World Heart Day Special: ఈ ఒక్క పని చేయగలిగితే హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సే లేదు..!

ABN , First Publish Date - 2022-09-29T18:08:11+05:30 IST

మానవ శరీరంలో హృదయం నిరంతరం ‘‘లబ్‌డబ్‌’’మని లయబద్ధంగా కొట్టుకుంటుంది. మనిషి ఆరోగ్యంగా జీవించేందుకు అలుపెరుగక శ్రమపడుతూనే...

World Heart Day Special: ఈ ఒక్క పని చేయగలిగితే హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సే లేదు..!

జీవనశైలి మార్పుతో గుండెపై ఒత్తిడి

బీపీ, మధుమేహం కంట్రోల్‌ లేక  గతి తప్పుతున్న హృదయం

చేటు తెస్తున్న ధూమపానం


ఆరోగ్యకరమైన అలవాట్లే గుండెకు శ్రీరామరక్ష

మానవ శరీరంలో హృదయం నిరంతరం ‘‘లబ్‌డబ్‌’’మని లయబద్ధంగా కొట్టుకుంటుంది. మనిషి ఆరోగ్యంగా జీవించేందుకు అలుపెరుగక శ్రమపడుతూనే ఉంటుంది. అలాంటి గుండెకు పలువురు ఎన్నో రకాలుగా శ్రమలు కలిగిస్తూ దాని ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారు. చివరకు ఆ దెబ్బ వారికే తగులుతుందన్న విషయాన్ని మరిచిపోతున్నారు. సంప్రదాయ అలవాట్లు, ఆహార విధానాల నుంచి దూరంగా వచ్చేశాం. అన్నీ మారిపోయాయి. అలాగని ఆరోగ్యకరమైన అలవాట్లను చేసుకోవడంలో యువత విఫలమవుతోంది. ఉదయాన్నే లేచి సూర్యకిరణాలను చూస్తూ కొంతసేపు వ్యాయామం చేయాలి. ఇవన్నీ కొత్తగా చెప్తున్నవి కావు. వేల సంవత్సరాలుగా మానవ జీవన విధానంలో ఉన్నవే. సంప్రదాయ అలవాట్లను గుర్తించగలిగి ఆచరిస్తే గుండె జబ్బే కాదు, ఏ జబ్బులూ దరిచేరవు. చివరకు పాఠశాలల్లో క్రీడా పాంగణాలు కరువవ్వడం కూడా గుండె జబ్బులకు కారణంగా నిలుస్తున్నాయి.


అలుపెరగని ప్రయాణం

గుండె నుంచి బయల్దేరిన రక్తం నిమిషానికి 43,20,000 మైళ్ల దూరం పయనిస్తుందంటే ఎవరికైనా ఆశ్చర్యం కలుగకమానదు. ఊపిరితిత్తుల్లో శుద్ధి అయిన మంచిరక్తం గుండెలోని ఎడమ గదుల్లోకి చేరుతుంది. అక్కడి నుంచి ధమనుల ద్వారా శరీరమంతా సరఫరా అవుతుంది. అది కూడా నిమిషానికి ఐదు లీటర్ల చొప్పున రోజుకు ఏడున్నర వేల లీటర్ల మంచి రక్తాన్ని యావత్‌ శరీరానికి అందజేస్తుంది.  శరీరంలో రక్తనాళాల పొడవు 60వేల మైళ్లు. హృదయం కొట్టుకుంటున్న ప్రతిసారీ బ్లడ్‌ సర్క్యులేషన్‌ సిస్టమ్‌లో ఆ రక్తం 60వేల మైళ్లు ప్రవహిస్తుంది. అంటే నిమిషానికి 72సార్లు హృదయం కొట్టుకుంటుంది. దానిని బట్టి నిమిషానికి రక్తం ఎన్ని మైళ్లదూరం ప్రయాణిస్తుందో చూడాలి. శరీరంలోని రక్తప్రసరణ వ్యవస్థలో సిరలు, ధమనులతో పాటు రక్తనాళాలు కీలకపాత్ర పోషిస్తుంటాయి. మన శరీరంలోని మొత్తం రక్తనాళాల పొడవు లక్ష మైళ్ల వరకు ఉంటుందట. సగటు జీవితకాలంలో గుండె నుంచి 15 లక్షల బ్యారెల్స్‌ (178.8కోట్ల లీటర్లు) రక్తం సరఫరా అవుతుందని నిర్ధారించారు. మనిషి శరీర బరువులో ఏడు శాతం రక్తమే ఉంటుంది. 


చాక్లెట్‌ తింటే గుండెజబ్బులు వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని వైద్య నిపుణులు చెప్తున్నారు.  తరచూ నేరేడు పండ్లు తినేవారిలో రక్తపోటు అదుపులో ఉండడంతో పాటు గుండెజబ్బులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఫ్లోరిడా స్టేట్‌ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని నిర్ధారించారు. నేరేడులోని నైట్రిక్‌ ఆక్సైడ్‌ ప్రభావం వల్ల రక్తపోటు తగ్గుతుందట.ధూమపానం గుండెకు చేటు

సిగరెట్‌ పొగ గుండెకు చేసే చేటు అంతాఇంతా కాదు. సిగరెట్‌ ముట్టించిన మరుక్షణం గుండె వేగం అదుపుతప్పి పెరిగిపోతుంది. పది నిమిషాల పాటు అదే పనిగా సిగరెట్‌ తాగితే గుండె వేగం 30 శాతానికి పైగా పెరుగుతుంది. అంటే అవసరానికి మించి గుండె కొట్టుకుంటున్నదన్నమాట. అంటే గుండె లయబద్ధంగా కొట్టుకోదు. గుండె, రక్తప్రవాహ వ్యవస్థ (హార్ట్‌ అండ్‌ కార్డియో వ్యాస్క్యులార్‌ సిస్టమ్‌)కు జరిగే నష్టాలను చూస్తే సిగరెట్‌ పొగవల్ల రక్తం చిక్కబడిపోతుంది. దాంతో రక్తప్రవాహం సాఫీగా జరగక రక్తనాళాల మధ్య రక్తపు గడ్డలు ఏర్పడి గుండెకు రక్తం అందకపోవచ్చు. ఏ భాగానికి రక్తం అందకపోయినా ఆక్సిజన్‌, పోషకాలు అందక ఆ భాగం చచ్చుబడిపోతుంది. ఇదే పరిణామం గుండెకు రక్తం సరఫరా చేసే క రోనరీ ఆర్టరీలో జరిగితే గుండెపోటు వస్తుంది. 


వేరుశెనగలు తింటే గుండెజబ్బులు, హైపర్‌ టెన్షన్‌ వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. వేరుశెనగ గింజల్లో దాదాపు 48 శాతం కొవ్వు పదార్థాలు ఉన్నా, వాటిలో గుండెకు మేలుచేసే మోనోశాచ్యురేటెడ్‌, పోలీ అన్‌శాచ్యురేటెడ్‌ కొవ్వులే ఎక్కువగా ఉంటాయని గుర్తించారు. వేరుశనగల్లో ఆరోగ్యకరమైన కొవ్వులతో పాటు విటమిన్‌-బి1, బి6, ఫోలిక్‌ యాసిడ్‌, విటమిన్‌-ఇ, మెగ్నీషియం, జింక్‌ వంటి పోషకాలు శరీరానికి చాలా మేలుచేస్తాయని అంటున్నారు.  బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్‌ వంటి ఎలాంటి గింజలనైనా రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకుంటే గుండెజబ్బుల ముప్పు గణనీయంగా తగ్గుతుందని పరిశోధనల్లో తేలింది.


జీవనశైలి మార్పులతో గుండె జబ్బులు: డాక్టర్‌ చింతా జయప్రకాష్‌

జీవనశైలి పూర్తిగా మారిపోయింది. వృత్తిపరమైన ఒత్తిళ్లు, వ్యక్తిగతమైన ఉద్వేగాలు, తింటున్న ఆహారం మనిషికి తెలియకుండానే రక్తపోటును పెంచేస్తున్నాయి. సిస్టోలిక్‌, డయాస్టోలిక్‌ రక్తపోటు రూపంలో మనకు ఉండాల్సిన బీపీ కొలత 120/80 మాత్రమే. కానీ అనేక అంశాలు దీనిని ప్రభావితం చేస్తున్నాయి. దాంతో యువత, ఉద్యోగులు సైతం గుండెజబ్బుల బారిన పడుతున్నారు. మద్యం సేవించడం, పొగతాగడం పూర్తిగా మానేయాలి. హైపర్‌ టెన్షన్‌తో పాటు మధుమేహం ఉన్నవాళ్లకు కూడా గుండె జబ్బులొచ్చే అవకాశాలున్నాయి. నడక వ్యాయామంతో పాటు అరగంట సేపు ఎక్సర్‌సైజ్‌ చేయడం, నూనె సంబంధ పదార్థాలకు దూరంగా ఉండడం, ఉప్పు వాడకాన్ని తగ్గించుకోవాలి. పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి.

Read more