Winter Carnivore : శీతాకాలం భలే మాంసాహారం

ABN , First Publish Date - 2022-12-10T00:24:46+05:30 IST

చలికాలంలో కాసింత విభిన్నంగా, వేడివేడి ఫుడ్‌ తింటే ఆ మజానే వేరు. సీజన్‌ మారిన ఈ కూల్‌ వేళల్లో ఇంటికి వచ్చిన అతిథులకు సరికొత్త రుచిని అందివ్వాలంటే..

Winter Carnivore : శీతాకాలం భలే మాంసాహారం

చలికాలంలో కాసింత విభిన్నంగా, వేడివేడి ఫుడ్‌ తింటే ఆ మజానే వేరు. సీజన్‌ మారిన ఈ కూల్‌ వేళల్లో ఇంటికి వచ్చిన అతిథులకు సరికొత్త రుచిని అందివ్వాలంటే.. ఈ మూడు రకాల డిష్‌లను తయారు చేయవచ్చు. ఘుమఘమలాడేట్లు చెట్టినాడు మాంసం, రాయలవారి కోడికూర, పనీర్‌ మెజిస్టిక్‌లను ఇలా తయారు చేసుకోవచ్చు.

చెట్టినాడు మాంసం

కావాల్సిన పదార్థాలు

ఉడికిన మటన్‌- 200 గ్రాములు, తరిగిన టమోటాలు- 30 గ్రాములు, తరిగిన ఉల్లిపాయలు-30 గ్రాములు, కారం పొడి- 2 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు- రుచికి తగినంత, నూనె- 2 టేబుల్‌ స్పూన్లు, పచ్చిమిర్చి-20 గ్రాములు, కరివేపాకు- 15 గ్రాములు, వెల్లుల్లిపాయలు- 10 గ్రాములు, గ్రేవీ- అరట్యూబ్‌, ధనియాలు- 20 గ్రాములు, ఎండిన మిరపకాయలు- 10 గ్రాములు, సోంపు- 10 గ్రాములు, లవంగాలు- 10 గ్రాములు, యాలకులు-10 గ్రాములు, దాల్చినచెక్క- 10 గ్రాములు, పసుపు- చిటికెడు

తయారీ విధానం

చెట్టినాడు మసాలా కోసం ముందుగా ధనియాలు, ఎండుమిర్చి, సోంపు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసి గ్రైండ్‌ చేసుకుని పెట్టుకోవాలి. ప్యాన్‌ హీట్‌ చేసి 2 టేబుల్‌ స్పూన్ల నూనె వేయాలి. అందులోకి తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి కలుపుతుండాలి. టమోటా ముక్కలు, పసుపు వేసి కలపాలి. ఆ తర్వాత ఉడికించిన మటన్‌ను వేసి అరకప్పు నీళ్లు పోయాలి.పది నిమిషాల పాటు కుక్‌ చేయాలి. ఆ తర్వాత కారంపొడి, ఉప్పుతో పాటు చెట్టినాడు మసాలా వేసి కలియబెట్టాలి. అర టబ్‌ గ్రేవీ వేసి 5 నిమిషాలు కుక్‌ చేయాలి. ఉప్పు సరిపోతుందో లేదో చూసుకుని కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకుని వేడి వేడి చెట్టినాడు మాంసాన్ని రోటీతో తినాలి.

పనీర్‌ మెజిస్టిక్‌

కావాల్సిన పదార్థాలు

పనీర్‌(రెక్టాంగులర్‌ రూపంలో)- 200 గ్రాములు, కార్న్‌ఫ్లోర్‌- 30 గ్రాములు, మైదాపిండి- 30 గ్రాములు, ధనియాలు- 5 గ్రాములు, పుదీనా- 5 గ్రాములు, జీలకర్ర- 5 గ్రాములు, పసుపు- అరటీస్పూన్‌, వెల్లుల్లి(తరిగిన)- 5 గ్రాములు, పెరుగు- 250 గ్రాములు, నూనె- తగినంత, తందూరి మసాలా- 1 టీస్పూన్‌, కారంపొడి- టేబుల్‌ స్పూన్‌

తయారీ విధానం

బౌల్‌లో కార్న్‌ఫ్లోర్‌, మైదాపిండి కలిపి దోశపిండిలా చేసుకోవాలి. అందులో పనీర్‌ ముక్కలను వేయాలి. ముక్కలకు పిండి అయ్యేట్లు బాగా కలపాలి. ఆ తర్వాత ప్యాన్‌లో నూనె వేసి ఆ పనీర్‌ ముక్కలను ఫ్రై చేసుకోవాలి. ఇంకో ప్యాన్‌ తీసుకుని అందులో నూనె వేసి, జీలకర్ర, వెల్లుల్లి, పసుపు, కొంచెం పెరుగువేయాలి. కలుపుతూ ఫ్రైడ్‌ పనీర్‌ ముక్కలను కలపాలి. గరిటెతో బాగా కలియబెడితే లిక్విడ్‌ థిక్‌గా అవుతుంది. వెంటనే ఉప్పు, తందూరి మసాలా, కారంపొడి వేయాలి. కలియదిప్పుతూ ఉప్పు సరిపోయిందో లేదో చెక్‌ చేసుకోవాలి. పుదీనా, జీడిపప్పుతో గార్నిష్‌ చేసుకుంటే సరి.. పనీర్‌ మెజిస్టిక్స్‌ రుచే వేరు.

రాయలవారి కోడి కూర

కావాల్సిన పదార్థాలు

ఉడికిన చికెన్‌- 200 గ్రాములు(చిన్న క్యూబ్స్‌), తరిగిన ఉల్లిపాయలు- 30 గ్రాములు, తరిగిన టమోటా- 50 గ్రాములు, కరివేపాకు- పది ఆకులు, పచ్చిమిర్చి- 10 గ్రాములు, అల్లంవెల్లుల్లి పేస్ట్‌- 1 టీస్పూన్‌, కారంపొడి- 1 టీస్పూన్‌, పసుపు- అరటీస్పూన్‌, ఉప్పు- రుచికి తగినంత, తందూరి పౌడర్‌- 1 టీస్పూన్‌, జీడిపప్పు- 40 గ్రా., ఎండు కొబ్బరిపొడి- 20 గ్రా., కొత్తిమీర- తగినంత, నూనె- 2 టీస్పూన్‌, జీడిపపు పేస్ట్‌- 40 గ్రాములు,

తయారీ విధానం

ప్యాన్‌మీద నూనె వేసి తరిగిన ఉల్లిపాయలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌, పచ్చిమిర్చి, కరివేపాకు, టమోటాలు వేసి గరిటెతో కదుపుతూ వేయిస్తూ ఉడకబెట్టిన చికెన్‌ కలపాలి. కారంపొడి, కొబ్బరిపొడి, జీడిపప్పు పేస్ట్‌ వేసి మిశ్రమాన్ని కలిపి పది నిమిషాల పాటు కుక్‌ చేయాలి. కొన్ని నీళ్లు పోసి ఉప్పు, తందూరి మసాలా వేసి గ్రేవీ థిక్‌గా వచ్చేంత వరకూ కుక్‌ చేయాలి. దీన్ని ఒక బౌల్‌లో వేసుకుని జీడిపప్పు, కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకుని తినాలి.

చెఫ్-సిహెచ్. విజయ్, ఫ్లాట్ ఫామ్ 65, హైదరాబాద్

Updated Date - 2022-12-10T00:26:59+05:30 IST