తొలగించాల్సింది అజ్ఞానాన్నే...

ABN , First Publish Date - 2022-11-24T22:29:47+05:30 IST

బుద్ధుని కాలంలో మగధ, కోసల రాజ్యాల్లో... లిచ్ఛవీ, శాక్య, మల్ల తదితర గణ రాజ్యాల్లో బుద్ధుని బోధలకు విశేష ప్రచారం ఉండేది.

తొలగించాల్సింది అజ్ఞానాన్నే...

బుద్ధుని కాలంలో మగధ, కోసల రాజ్యాల్లో... లిచ్ఛవీ, శాక్య, మల్ల తదితర గణ రాజ్యాల్లో బుద్ధుని బోధలకు విశేష ప్రచారం ఉండేది. అనేకమంది బుద్ధ అనుయాయులు ఉండేవారు. కానీ, ఉజ్జయినీ, అవంతి, ఛేది రాజ్యాల్లో... బుద్ధుని బోధలు అంతగా తెలియవు. అలాంటి సమయంలో - వైశాలికి చెందిన ఉత్తర అనే యువతికి... ఉజ్జయినికి చెందిన యువకునితో వివాహం అయింది.

ఉత్తర ఒక పెద్ద వ్యాపారి కూతురు. అందం, అణకువ, జ్ఞానం ఆమె సొంతం. వారి కుటుంబం మొత్తం బుద్ధుని మార్గంలో నడిచేది. ఉత్తర నిరంతరం బుద్ధుని ప్రవచనాలు వింటూ... పదిమందికీ చెబుతూ ఉండేది. బుద్ధ సేవ కోసం ఆరామాలకు వెళుతూ ఉండేది. కానీ, అత్తవారి ఇంటికి వచ్చాక... ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది. ఉజ్జయినిలో బుద్ధుని గురించి, బుద్ధ ప్రబోధాల గురించి అంతగా తెలీదు. పైగా ఆమె అత్తింటివారు బుద్ధ వ్యతిరేకులు కూడా. దాంతో ఆమెకు అత్తింట్లో అసహనం మొదలయింది. అక్కడ ఉండలేకపోయింది. అయితే, భర్త ఆమె పట్ల సానుకూలంగా ఉండడంతో సర్దుకుపోయింది. పైగా తన పుట్టింటికి వెళ్ళాలంటే చాలా దూరం. ప్రయాణం కూడా అంత తేలిక కాదు. వీలు కాదు కాబట్టే ఉంది కానీ, వీలయితే ఎప్పుడో పుట్టింటికి వచ్చేసేది.

ఒక రోజు... బుద్ధుడు తన భిక్షుగణంతో ఉజ్జయినికి వస్తున్నాడని తెలిసింది. ఆమెకు కొండంత ఊరట కలిగింది. ‘బుద్ధుని పరివారంతో తన పుట్టింటికి వెళ్ళిపోవచ్చు’ అనుకుంది. బుద్ధుడు ఉజ్జయినికి వచ్చిన మరునాడు... ఉత్తర ఇంటికే వచ్చాడు. దాంతో ఆమెకు ఆనందం, ఆశ్చర్యం కలిగాయి. తమ ఇంటికి బుద్ధుడే స్వయంగా రావడంతో... ఉత్తర అత్తింటివారు కూడా విస్మయానికి గురయ్యారు. గొప్పతనంగా భావించారు. తమ కోడలి ప్రాధాన్యతను గుర్తించారు.

ఎవరూ దగ్గరలేని సమయం చూసి... బుద్ధునికి తన గోడును ఉత్తర వెళ్ళబోసుకుంది. ఆయన వెంట తన పుట్టింటికి వచ్చేస్తాననీ, ఇక ఈ బంధం తెంచుకుంటాననీ చెప్పింది. ఆమె వేదన బుద్ధునికి అర్థమయింది. కొత్త వాతావరణంలో ఇమడలేకపోతోందని గ్రహించి...

‘‘ఉత్తరా! నీవు బుద్ధుని అనుయాయివి. నీ అత్తవారికి బుద్ధుని గురించి, బుద్ధుని ప్రబోధాల గురించి తెలియదు. సరైన అవగాహన లేదు. వారు తాము నమ్మినదే సత్యం అనే భ్రమలో ఉన్నారు. నీవు దీని కోసం నీ సంసారాన్ని వదిలి రాకూడదు. ఇరు కుటుంబాల వారికీ దుఃఖ కారణం కాకూడదు. నీవు ఓర్పుతో ఉండాలి. నెమ్మదిగా వారికి సత్యాన్ని బోధించాలి. వారిలో అజ్ఞానాన్ని తొలగించాలే కాని... నీవు తొలగిపోకూడదు. బుద్ధుని ప్రవచనాలు వినరనీ, బుద్ధుణ్ణి ద్వేషిస్తారనీ, బుద్ధ వ్యతిరేకులనీ భావించి... వారి మీద ద్వేషం పెంచుకోకు. వారు పసి పిల్లల లాంటి వారు. తెలియక మారాం చేస్తారు. మొండికేస్తారు. అలాంటి మొండి బిడ్డను తల్లి లాలించి, మొండితనం వదిలించి, సరైన దారిలో పెట్టినట్టు... నువ్వు తల్లిలా వారిని లాలించి, నెమ్మదిగా ధర్మమార్గంలోకి తీసుకురావాలి. అప్పుడే నీకూ, వారికీ శాంతి. బుద్ధ ధర్మం కోసం నీ కాపురాన్ని నాశనం చేసుకోకు’’ అని సర్దిచెప్పాడు. ఆమెకు మనశ్శాంతి కలిగింది.

బుద్ధుడు అక్కడ ఉన్న రోజుల్లో నాలుగైదుసార్లు ఉత్తర ఇంటికి వెళ్ళాడు. ధర్మ ప్రబోధాలు చేశాడు. అవి విన్నవారందరిలో ఉత్తర పట్ల గౌరవ భావం ఏర్పడింది. ఆమెను దూషించడం, మతపరమైన ఇబ్బందులు పెట్టడం క్రమంగా మానుకున్నారు. ఆమె కూడా అత్తవారింటిని వదిలేసి పుట్టింటికి పోవాలనే ఆలోచన మానుకుంది.

ఆ తరువాత కొన్నాళ్ళకు... బుద్ధుడు తన భిక్షుగణంతో ఉజ్జయినికి వెళ్ళాడు. ఈ విషయం తెలిసిన ఉత్తర అత్తింటి కుటుంబం మొత్తం బౌద్ధ సంఘానికి ఎదురు వెళ్ళి, తమ ఇంటికి రావలసిందిగా ఆహ్వానించింది. తమ కోడలుకు సరైన రీతిలో సర్దిచెప్పి... తమ కుటుంబం చెల్లాచెదురు కాకుండా చేసిన బుద్ధుని పాదాలకు వారందరూ ప్రణమిల్లారు.

బొర్రా గోవర్ధన్‌

Updated Date - 2022-11-24T22:29:49+05:30 IST