plants: మొబైల్‌తో మొక్కలకు నీళ్లు

ABN , First Publish Date - 2022-11-11T23:17:34+05:30 IST

ఇష్టపడి పెరట్లోనో... బాల్కనీలోనో మొక్కలు పెంచుకొంటాం. వాటిని కంటికి రెప్పలా కాపాడుకొంటాం. ఇంట్లో ఉంటే సరే... కానీ ఏ టూరుకో వెళితే! నీళ్లు పోసేవారు లేక పచ్చని గార్డెన్‌ కళ తప్పుతుంది.

plants: మొబైల్‌తో మొక్కలకు నీళ్లు

విభిన్నం

ఇష్టపడి పెరట్లోనో... బాల్కనీలోనో మొక్కలు పెంచుకొంటాం. వాటిని కంటికి రెప్పలా కాపాడుకొంటాం. ఇంట్లో ఉంటే సరే... కానీ ఏ టూరుకో వెళితే! నీళ్లు పోసేవారు లేక పచ్చని గార్డెన్‌ కళ తప్పుతుంది. మరి అలా కాకుండా ఉండాలంటే..? తమ పక్కింట్లో ఉత్పన్నమైన ఈ సమస్యకు చక్కటి పరిష్కారం చూపారు మంగళూరు

ఐటీ నిపుణురాలైన దీపిక షేట్‌. భర్త సంతో్‌షతో కలిసి ‘వాటరింగ్‌ ఆటోమేషన్‌ డివైజ్‌’ను అభివృద్ధి చేశారు.

‘‘మంగళూరు బెజాయ్‌ ప్రాంతంలో మా నివాసం. మా ఇంటికి సమీపంలో ఓ ఇల్లు. అందులో రిటైర్డ్‌ బ్యాంక్‌ ఉద్యోగి, ఆయన భార్య ఉంటారు. ఇంటి చుట్టూ రకరకాల మొక్కలు పేర్చారు. గేటు తీసి లోపలకు వెళితే పచ్చదన పరిమళాలు స్వాగతం పలుకుతాయి. ఆహ్లాదంతో మనసు పరవసిస్తుంది. ఎంతో అపురూపంగా తమ గార్డెన్‌ను చూసుకొంటున్నారు ఆ దంపతులు. ఒకసారి వాళ్లకు ఓ పెద్ద సమస్య వచ్చింది. అదేంటంటే... అమెరికాలో ఉంటున్న వాళ్లబ్బాయి దగ్గరకు వెళ్లాలి. అక్కడే ఓ ఏడాది ఉండాలి. దీంతో వారికి తమ గార్డెన్‌ గురించి దిగులు పట్టుకుంది. విషయం మాకు చెప్పారు. సలహా అడిగారు. ఏం చేస్తే బాగుంటుంది? నేను, నా భర్త ఆలోచనలో పడ్డాం. కానీ తరువాత ఎవరి పనుల్లో వాళ్లం బిజీ అయిపోయాం.

అలా మొదలైంది...

నేను, సంతోష్‌ లాక్‌డౌన్‌కు ముందు ఐటీ ఉద్యోగాలు చేసేవాళ్లం. ఆయనైతే సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌గా చాలా దేశాలు తిరిగారు. అయితే కరోనా వల్ల తను ఐర్లాండ్‌లో ఇరుక్కుపోయారు. ఇంటి దగ్గర నేను, మా ఏడాది పాప అద్వైతి మాత్రమే ఉండేవాళ్లం. ఆ సమయంలో ఒంటరితనంతో సంతో్‌షకు పిచ్చెక్కినట్టు అయిపోయింది. ఏంచేయాలో తోచలేదు. ఏదో ఒక వ్యాపకం లేకపోతే పరిస్థితి చేయి దాటిపోతుందనుకున్నారు. అప్పుడు తనకు సలహా ఇచ్చాను... ‘మన ఇంటి పక్కన దంపతుల సమస్యకు పరిష్కారం ఆలోచించమ’ని. ఇక దాన్ని ఓ పట్టు పట్టారు. ఆన్‌లైన్‌లో ఇద్దరం సాధ్యాసాధ్యాలు చర్చించుకొనేవాళ్లం. చూస్తుండగానే ఏడాది గడిచిపోయింది. ఈ లోగా చాలా రకాల ట్రయల్స్‌ వేశాం. ప్రొటోటై్‌పలు తయారు చేశాం. ఒక దశలో విసుగు పుట్టింది. అయినా పట్టు వదల్లేదు. చివరకు విజయం సాధించాం.

స్టార్ట్‌పకు శ్రీకారం...

మా ఆలోచనలకు రూపం ఇవ్వాలనుకున్నాం. ఇద్దరం ఉద్యోగాలు వదిలేశాం. మా జీవితంలో తీసుకున్న అతిపెద్ద నిర్ణయం అది. సంతోష్‌ భారత్‌కు తిరిగి రాగానే మేం అనుకున్న ‘వాటరింగ్‌ ఆటోమేషన్‌ టూల్‌’ను అభివృద్ధి చేశాం. ఐఓటీ (ఇంటర్‌నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌) ప్లాట్‌ఫాంలో ఇది పని చేస్తుంది. దీన్ని వెబ్‌సైట్‌ లేదంటే మొబైల్‌ యాప్‌ ద్వారా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా నియంత్రించవచ్చు. ఇంట్లో మొక్కలకు నీళ్లు పోసుకోవచ్చు. ఈ డివైజ్‌ కోసం ఏడాది పాటు శ్రమించాం. అందుకు ప్రధాన కారణం... చిన్నప్పటి నుంచి మొక్కలంటే నాకు కూడా చాలా ఇష్టం. మేం కనుగొన్న డివైజ్‌... టూర్లకు వెళ్లేవారికే కాకుండా ఉద్యోగాలు చేసే భార్యాభర్తలకూ బాగా ఉపయోగకరంగా ఉంటుంది. మా ప్రయత్నం విజయవంతం కావడంతో ‘ఉక్షతి’ పేరుతో స్టార్టప్‌ ఒకటి ప్రారంభించాం.

నీరు వృథా కాకుండా...

మా ప్రధాన ఉద్దేశం... ఎక్కడి నుంచైనా ఇంట్లో మొక్కలకు సులువుగా నీళ్లు పెట్టడం. అదే సమయంలో నీటి వృథాను సాధ్యమైనంతవరకు తగ్గించడం. మేం రూపొందించిన డివైజ్‌ పని చేయాలంటే ఇంటర్నెట్‌ ఉండాలి. అందుకే దీన్ని ‘ఇంటర్నెట్‌ కనెక్టెడ్‌ ట్యాప్‌’ అని పిలుస్తున్నాం. ఆల్కలీన్‌ బ్యాటరీలతో నడుస్తుంది. ఆరు నెలల వరకు బ్యాటరీలు మార్చాల్సిన అవసరం ఉండదు. వినియోగదారుల మొబైల్‌లో ఒక యాప్‌ ఇస్తాం. అందులో ఎప్పటికప్పుడు వాటరింగ్‌, బ్యాటరీకి సంబంధించిన నోటిఫికేషన్లు వస్తాయి. మా వెబ్‌సైట్‌లో వాటరింగ్‌ హిస్టరీ కూడా చూసుకోవచ్చు. ఎక్కడి నుంచైనా డివైజ్‌ను ఆన్‌/ ఆఫ్‌ చేసుకోవచ్చు. వాతావరణానికి తగినట్టు ఆటోమేటిక్‌గా అడ్జెస్ట్‌ అయ్యేలా దీన్ని అభివృద్ధి చేయాలనేది మా ఆకాంక్ష. చిన్న బాల్కనీ నుంచి పెద్ద గార్డెన్‌ల వరకు దీన్ని ఉపయోగించుకోచ్చు. విదేశాల నుంచీ కాల్స్‌ వస్తున్నాయి. ఇప్పటికైతే పరిమితంగానే ఆర్డర్లు తీసుకొంటున్నాం. ఈ తరహాలో వ్యవసాయ అవసరాలు కూడా తీర్చగలిగే డివైజ్‌ రూపొందించాలని అనుకొంటున్నాం. ఇప్పటికే ఆ దిశగా పరిశోధనలు, ప్రయోగాలు ప్రారంభించాం. త్వరలోనే దీనికి ఒక రూపం వస్తుందని ఆశిస్తున్నాం.’’

వినియోగదారుల మొబైల్‌లో యాప్‌ ఇస్తాం. అందులో ఎప్పటికప్పుడు వాటరింగ్‌, బ్యాటరీకి సంబంధించిన నోటిఫికేషన్లు వస్తాయి. మా వెబ్‌సైట్‌లో వాటరింగ్‌ హిస్టరీ కూడా చూసుకోవచ్చు. ఎక్కడి నుంచైనా డివైజ్‌ను ఆన్‌/ ఆఫ్‌ చేసుకోవచ్చు. ఎక్కడి నుంచైనా ఇంట్లో మొక్కలకు నీళ్లు పెట్టడం, నీటి వృథాను తగ్గించవచ్చు.

Updated Date - 2022-11-11T23:26:44+05:30 IST