గంగ ఘనత వీరిదే..
ABN , First Publish Date - 2022-03-16T05:30:00+05:30 IST
ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను స్వదేశానికి తరలించడం కోసం చేపట్టిన ఆపరేషన్ గంగలో శివానీ కార్ల, మహాశ్వేత చక్కవర్తి అనే ఇద్దరు....

ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను స్వదేశానికి తరలించడం కోసం చేపట్టిన ఆపరేషన్ గంగలో శివానీ కార్ల, మహాశ్వేత చక్కవర్తి అనే ఇద్దరు మహిళా పైలట్లు కీలక పాత్ర పోషించారు. ఉత్కంఠభరితమైన వాతావరణంలో, గంటల తరబడి విమానాలను నడిపి, విద్యార్థులను సురక్షితంగా సొంత గూటికి చేర్చిన ఆ సాహస నారీమణులు మనోగతాలివి!
అది నా బాధ్యత - శివానీ కార్ల
తమ్ముడి పెళ్లి వేడుకలో శివానీ కుటంబం మునిగి ఉంది. సరిగ్గా ఆ సమయంలోనే ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను స్వదేశానికి చేర్చే అవకాశం శివానీ తలుపు తట్టింది. ఆపరేషన్ గంగలో భాగంగా భారతీయ విద్యార్థులను ఖాళీ చేయించడంలో మీరు భాగస్వాములవుతారా? అంటూ ఫోన్లో వినిపించిన ప్రశ్నకు శివానీ మరో ఆలోచన లేకుండా ఓకే చెప్పేసింది. ఆ మరుసటి రోజే ఢిల్లీకి చెందిన శివానీ, ఆమె బృందం కలిసి, 249 మంది భారతీయ విద్యార్థులను స్వదేశానికి చేర్చింది. ఈ విద్యార్థులు ఉక్రెయిన్ నుంచి రొమేనియా, హంగరీలకు శరణార్థులుగా తరలి వెళ్లారు. ఆ అనుభవం గురించి ప్రస్తావిస్తూ.. ‘‘మేం మా గమ్యం చేరుకునేటప్పటికి విద్యార్థులు మా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మమ్మల్ని చూసిన వెంటనే భయం నిండిన వాళ్ల వదనాల్లో చిరునవ్వులు విరిశాయి. వాళ్లను భారతదేశానికి చేర్చడం మా బాధ్యత. బుడాపెస్ట్, రొమేనియాల నుంచి మేం 249 మంది విద్యార్థులను ఖాళీ చేయించాం. తిరిగి ఢిల్లీకి చేరుకున్న తర్వాత, ఆ విద్యార్థుల కుటుంబాలు మాకు స్వాగతం పలికాయి. వాళ్లందరూ చప్పట్లు కొడుతూ అభినందించడం నాకెంతో గర్వంగా అనిపించింది.
సాధారణంగా ఇలాంటి సమయాల్లో ప్రయాణమంటే తల్లితండ్రులు భయపడతారు. కానీ మా తల్లితండ్రులు ఇందుకు పూర్తి భిన్నం. నన్ను ఆపడానికి బదులుగా వాళ్లు... ‘‘ భారతీయులను స్వదేశానికి చేర్చడం ఒక్కటే నీ బాధ్యత కాదు, ఎన్నో కుటుంబాలను తిరిగి కలుపుతున్న బాధ్యత కూడా నీ మీద ఉంది. నీ గురించి మేమెంతో గర్వపడుతున్నాం. సురక్షితంగా తిరిగి రా! అంటూ నా తమ్ముడు, తల్లితండ్రులు నన్ను సాగనంపారు. తిరిగొచ్చిన తర్వాత అమ్మ నన్ను గుండెలకు హత్తుకుని, భావోద్వేగానికి లోనైంది. కొవిడ్ సమయంలో కూడా నేను ఇవాక్యుయేషన్ , రెస్క్యూ ఫ్లయిట్లు నడిపాను. అయినా అమ్మ ఎప్పుడూ ఇలా ప్రవర్తించలేదు. యుద్ధ వాతావరణం అమ్మను భయపెట్టి ఉండవచ్చు. యుద్ధం ముగిసేలోగా నేను మరెన్నో రెస్క్యూ ఫ్లయిట్లను నడపవలసి రావచ్చు. అయినా.. ఎప్పుడు పిలుపు వచ్చినా, వెళ్లడానికి నేను సిద్ధంగా ఉన్నా’’ అంటూ చెప్పుకొచ్చింది శివానీ.

వాళ్లే నిజమైన హీరోలు - మహాశ్వేతా చక్రవర్తి
కోల్‌కతాకు చెందిన 24 ఏళ్ల మహాశ్వేతా చక్రవర్తి పోలాండ్, హంగేరీ సరిహద్దులకు చేరుకున్న 800 మంది భారతీయ విద్యార్థులను విమానంలో సురక్షితంగా స్వదేశానికి చేరవేసింది. ఆపరేషన్ గంగ పిలుపును గుర్తు చేసుకుంటూ... ‘‘రెస్క్యూ మిషన్ కోసం నేను ఎంపికయ్యాననే కబురు అర్థరాత్రి అందింది. ఆ వెంటనే కేవలం రెండు గంటల్లోనే అవసరమైన వస్తువులను సర్దేసుకుని ఇస్తాంబుల్ చేరుకున్నాను. పోలాండ్ నుంచి రెండున్నర గంటల ప్రయాణ దూరంలో ఉన్న ఆ ప్రదేశానికి చేరుకుని, రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించమని నాకు ఆదేశాలందాయి’’ అని చెప్పుకొచ్చింది చక్రవర్తి. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 7 మధ్య, పోలాండ్ నుంచి నాలుగు సార్లు, హంగరీ నుంచి రెండు సార్లు... ఇలా మొత్తం 6 ఇవాక్యుయేషన్ ఫ్లయిట్లను నడిపిందీమె. ఆ అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ.... ‘‘అది జీవితమంతా గుర్తుండిపోయే అనుభవం. టీనేజీలో ఉన్న ఆ విద్యార్థులు జబ్బు పడి ఉన్నారు.
భయకంపితులై ఉన్నారు. వాళ్ల భయానక అనుభవాల గురించి కథలు కథలుగా చెపుతూ ఉన్నారు. మేం వాళ్లకు ఆహారం, పానీయాలను అందించాం. అయినా వాళ్లు నీళ్లు తాగడానికి కూడా ఇష్టపడడం లేదు. వీలైనంత త్వరగా ఇళ్లకు చేరుకోవాలనే ఆరాటంలో ఉన్నారు. వాళ్ల పోరాట పటిమకు నేను సెల్యూట్ చేస్తున్నాను. వాళ్లను ఇళ్లకు చేర్చడంలో నా వంతు పాత్ర పోషించడం నాకెంతో గర్వంగా ఉంది. నిజానికి ఉక్రెయిన్‌లో ఇరుక్కుపోయిన విద్యార్థులే నిజమైన హీరోలు. వాళ్లు యుద్ధంతో దెబ్బతిన్న దేశం నుంచి, ఆకలిదప్పులతో, ప్రాణభయంతో, విపరీతమైన వాతావరణంతో, కెరీర్ గురించిన ఆందోళనలతో పోరాడి బయపడ్డారు’’ అంటూ రెస్క్యూ మిషన్‌లో పాల్గొన్న మహిళా పైలట్‌గా తన అనుభవాన్ని వివరించింది మహాశ్వేత.
