film writer Satyanand: నా సూపర్‌స్టార్‌

ABN , First Publish Date - 2022-11-27T02:47:14+05:30 IST

అప్పుడు నాకు తెలీదు ఆ పాట పాడుతూ తెర మీద నటించబోయే హీరో... నిజ జీవితం కూడా ఆ పాటలాగే గొప్పగా చివరి వరకూ సాగుతుందని. అవును..

film writer Satyanand: నా సూపర్‌స్టార్‌

నివాళి

లవ్‌ యూ సర్‌

నవ్వుతూ బ్రతకాలి రా తమ్ముడూ... నవ్వుతూ చావాలి రా...

(నేడు సూపర్‌స్టార్‌ కృష్ణ పెద్దకర్మ సందర్భంగా

ప్రముఖ సినీ రచయిత సత్యానంద్‌ నివాళి)

‘తోడు దొంగలు’ సినిమాలో మరో కుర్ర హీరోతో ఫైట్‌ షూట్‌ అయ్యాక వేరే షూటింగ్‌లో మాతో... ‘తను ఫైట్స్‌ భలే చేశాడు... రిస్క్‌ షాట్స్‌ కూడా ఈజీగా చేసేశాడు. డాన్స్‌ కూడా అదరగొడుతున్నాడని విన్నాను.

గొప్ప ఫ్యూచర్‌ ఉంటుంది తనకి’ అని ఆ తోటి నటుడు ‘చిరంజీవి’ గురించి చెప్పారు ఆయన. (అలా చెప్పేవాళ్లు ఇక్కడ చాలా తక్కువ).

చాలా ఏళ్ల క్రితం ఓ రాత్రి వేళ గురువు ఆత్రేయ గారి దగ్గర కూర్చుని ఆయన డిక్టేట్‌ చేస్తుంటే పాట రాసుకున్నాను.

-( సత్యానంద్‌)

‘నవ్వుతూ బ్రతకాలిరా తమ్ముడు... నవ్వుతూ చావాలిరా..’

అప్పుడు నాకు తెలీదు ఆ పాట పాడుతూ తెర మీద నటించబోయే హీరో... నిజ జీవితం కూడా ఆ పాటలాగే గొప్పగా చివరి వరకూ సాగుతుందని. అవును... నా మొదటి సినిమా హీరో... కృష్ణ గారు స్వచ్ఛంగా నవ్వుతూనే జీవించి, నవ్వుని అందరికీ అందించి, నవ్వుతూనే వెళ్లిపోయారు. అలా నవ్వటానికి మనసు నిండా నిజాయతీ- మనిషి నిండా మంచితనం ఉండాలి. అది కొందరికే కుదురుతుంది కృష్ణగారి లాంటి వారికి.

ఆయన లేరు అని తెలిసి... చూడటానికి వెళ్లినప్పుడు నిదురపోతున్నట్టు కనిపించిన ఆయన్ని చూస్తుంటే అనిపించింది... ‘జరగదు అని తెలిసినా కొందరు ఇంకా కొంతకాలం ఉండిపోతే బావుండును... ఎత్తయిన కొండగా... ఎందరికో అండగా..’ అని. అలా ఆయన్ని చూస్తున్నప్పుడు మొదటిసారి ఆయన్ని దగ్గరగా చూడటం గుర్తు కొచ్చింది... మద్రాస్‌ (అప్పట్లో) శివాజీ గార్డెన్స్‌లో పాటతో కొత్త సినిమా షూటింగ్‌ ఆ రోజే ఆరంభం...

ఓ చెట్టు కింద చైర్‌లో కూర్చుని పాటకి చివర్లో వచ్చే సీన్‌లో డైరెక్టర్‌ చెప్పిన కరెక్షన్స్‌ చేస్తున్నా డైలాగ్‌ రైటర్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌... రెండూ అయిన నేను. ఎవరో వచ్చి పక్క చైర్లో కూర్చుంటూ... ‘ఈ పిక్చర్‌లో డైలాగులు బావున్నాయని అప్పుడే ఇండస్ట్రీలో అంటున్నారట... మేకప్‌ మాధవరావు చెప్పాడు..’ అనడం వినిపించి తల తిప్పి చూశాను. ఉలిక్కి పడి లేవబోయి కుదరక బిగుసుకున్నా. మొదటిసారి అంత దగ్గర్లో తనని చూశాను. అందంగా, ఎర్రగా, నిండుగా, నవ్వే పలకరింపులా, నచ్చే స్నేహంలా... కృష్ణ... హీరో కృష్ణ!

కొన్నేళ్ల క్రితం...

‘తేనెమనసులు’ విజయ యాత్రకి వాళ్లు రాజమండ్రి వచ్చారు. హోటల్‌లో యూనిట్‌ అంతా హడావిడిగా ఉన్నారు. కాస్త దూరం నుంచి ఆశ్చర్యంగా నేను చూసినప్పటి అందంగా నవ్వే కృష్ణ. ఆ తరువాత స్కూల్‌, కాలేజ్‌ ఎగ్గొట్టి ‘అవే కళ్లు’ ‘నేనంటే నేనే’ సినిమాల్లో మళ్లీ మళ్లీ చూసిన కృష్ణ.

‘పానిక్‌ ఇన్‌ బ్యాంకాక్‌’ అని నేను చూసిన ఇంగ్లీష్‌ సినిమాని ‘గూఢచారి116’గా రాజమండ్రి వీరభద్ర టాకీ్‌సలో మొదటి రోజు మార్నింగ్‌ షోకి బ్లాక్‌లో టికెట్స్‌ కొని చూస్తున్నప్పుడు... ఆ ఇంగ్లీష్‌ హీరో కంటే గొప్పగా అదిరిపోయే ఫైట్స్‌తో నన్ను థ్రిల్‌ చేసిన కృష్ణ... బాపుగారి ‘సాక్షి’లో అయ్యో పాపం అనిపించిన కృష్ణ, నెల్లూరి కాంతారావును తెరమీద ఎత్తి పడేసి ‘అసాధ్యుడు’గా కనిపించిన కృష్ణ.

‘సీన్‌ ఓసారి మీరు చదవితే వింటా’... ఎదురుగా అడుగుతున్న కృష్ణ. యధాశక్తి మాడ్యులేషన్‌తో సహా చదివేశాను నేను. ‘బావుంది’... నవ్వుతూ తను. అసోసియేట్‌ వచ్చి షాట్‌కి పిలవగా వెళ్లారు తను. ఆ సినిమా ‘మాయదారి మల్లిగాడు’... రచయితగా నా తొలి చిత్రం.

రెండు రోజుల తర్వాత...

‘మీ సొంత సినిమా బ్లాక్‌ అండ్‌ వైట్‌లో తీస్తున్నారేంటి డైరెక్టర్‌ గారు?’... షూటింగ్‌లో ఆదుర్తిని కృష్ణ అడిగారు.

‘మన రెండు హిందీ సినిమాలు ‘జీత్‌’, ‘దర్పణ్‌’ దెబ్బతిన్నాయిగా.. ఫైనాన్షియల్‌ సమస్యలతో..’.ఆయన మాట పూర్తి కాకుండానే ‘అదేంటీ డైరెక్టరు గారు.. మాలాంటి కొత్త మొహాలు అందరినీ పెట్టి ఏళ్ల క్రితమే కలర్‌ సినిమా తీసిన మీరు... బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఏంటి? రెండు రోజులు షూట్‌ చేసింది పక్కన పడేసి కలర్‌లో తీద్దాం’...

‘అది కాదు కృష్ణా... పరిస్థితులు..’

‘మీరు అలా ఉండండి... నేను చూసుకుంటాగా అంతా..’ అంటూ గంటలో కలర్‌ నెగెటివ్‌ తెప్పించి, తీసింది తీసిపారేయించి, కలర్‌ సినిమా తీయించారు. తనని పరిచయం చేసిన గురువు గారి మీద ఉన్న ఇష్టం, కృతజ్ఞత అది. (కొద్ది మందికి మాత్రమే ఉండే గుణం).

రంగుల్లో ఆ సినిమా రావడానికి కారణం కృష్ణ. ఆ తర్వాత ‘గాజుల కిష్టయ్య’... ఆదుర్తి డైరెక్టన్‌లో... హీరో తను. రచయిత నేను. తరచూ షూటింగ్‌లో కలిసేవాళ్లం. సిగరెట్స్‌ కాలుస్తున్న టైమ్‌లో డైరెక్టర్‌ వస్తుంటే నాకంటే తొందరగా తను సిగరెట్‌ పక్కకి పారేసి లేచి నుంచోవటం నాకు ఆశ్చర్యం వేసేది. అంతలా ఉండవలసిన అవసరం లేదు. అయినా ఆ గౌరవం అలాగే ఉంది గురువు అంటే... దటీజ్‌ కృష్ణ.

ఆ తర్వాత చాలా సినిమాలు రాశాను కృష్ణకి. ఆయన గురించి తెలిసిన కొద్దీ ఆశ్చర్యం వేసేది...

మంచితనం మనిషి అయ్యింది... నిజాయతీ నిలువెత్తున నిలిచింది. వ్యక్తి వ్యవస్థ అయ్యాడు... ‘పద్మాలయా’ బ్యానర్‌ పెట్టి, రోజుకి వంద మందికి భోజనం పెట్టి.

‘పలానా నిర్మాత సగం రెమ్యూనిరేషన్‌ బాకీ... డబ్బింగ్‌ ఆపేద్దామా సార్‌’... మేనేజర్‌ అడిగాడు.

‘డబ్బింగ్‌ కాదు... సినిమా కూడా ఆగడానికి వీల్లేదు’ అని డబ్బింగ్‌ చెప్పారు. డిస్ట్రిబ్యూటర్స్‌తో మాట్లాడి సినిమా రిలీజ్‌ చేయించి, నిర్మాతని బతికించారు. అలా ఒకటి కాదు... ఎన్నో సినిమాలకు చేశారు. ఎంతో మంది కొత్త దర్శకులకి అండ.. ఆధారం అయ్యారు. టెక్నిషియన్స్‌కి ఊతం.. ఊపిరి అయ్యారు. విషయం ఉన్న కొత్తవాళ్ల గురించి పది మందికి మంచి మాట చెప్పేవారు.

తను డబ్బు గురించి పెద్దగా ఆలోచించలేదు... ఎప్పటికప్పుడు ఏదో కొత్తగా తియ్యాలని, చెయ్యాలనే తప్ప. తమ్ముళ్లు హనుమంతరావు, ఆదిశేషగిరిరావు అండగా ఉండగా సంచలనాలతో తెలుగు సినిమాని కొత్త బాట పట్టించారు కృష్ణ. ‘కౌబాయ్‌ తియ్యకు... చూడరు’ అన్నారు కొందరు. తను తీశారు... చూసేట్టు చేశారు. ‘సీతారామరాజు రిస్క్‌’ అన్నారు. ఆ రిస్క్‌ తీసుకుని రికార్డు సృష్టించారు. ‘మల్టీస్టారర్‌ చెయ్యటం మంచిది కాదేమో’ అన్నవారికి

‘దేవుడు చేసిన మనుషులు’తో మొదలెట్టి అందరు హీరోలతోనూ సినిమాలు చేశారు. ‘70ఎంఎం మూవీ వేస్ట్‌’ అన్నారు. డైరెక్షన్‌ వద్దన్నారు చాలామంది. రెండూ చేసి, ‘సింహాసనం’ తీసి, చూపించారు కృష్ణ. స్టూడియో వద్దన్నారు... కట్టి నడిపించారు. ‘దేవదాసు’... ‘కురుక్షేత్రం’ అనుకున్నట్టు కుదరకపోయినా బెదరలేదు... ఆగలేదు.. నడక ఆపలేదు.

జీవితం అన్నాక గెలుపు... ఓటమి... రెండూ ఉంటాయి. ఓటమి గురించి భయపడి ఆగిపోతే గెలుపు అనేదే ఉండదు అని తెలుసు ఆయనకు. నవ్వుతూనే ముందుకు నడిచారు. తనకి చేసిన సాయం, తను ఇచ్చిన మాట మరిచిపోడు సరైన మనిషి అన్నవాడు... ‘కృష్ణ’లాగ!

ఆదుర్తి వెళ్లిపోయాక... ఆ బేనర్‌కి సినిమాలు చేసి, ఋణం తీర్చుకున్నారు ఆయన. ఎందరో చిన్న నిర్మాతలకు సినిమా చేస్తానని మాట ఇచ్చి... తప్పలేదు ఆయన. ముందు రోజు రిలీజ్‌ అయిన ఆయన సినిమాని కొందరు భట్రాజులు పొగుడుతూ ‘మనది చాలా బావుంది కృష్ణ గారూ... హిట్‌ టాక్‌ వచ్చింది’ అన్నప్పుడు... ‘ఎవరూ చెప్పింది మీకు... మనది ఫ్లాప్‌. రిపోర్ట్స్‌ తెప్పించా కదా... వారంలో లేపేస్తారు’... అని తను పెద్దగా నవ్వేయటం నేను అక్కడ ఉండి చూశాను. ఓటమిని కూడా గెలుపులాగే ఓపెన్‌గా, నవ్వుతూ ఒప్పుకుని, చెప్పుకునే మనిషిని నేను ఇప్పటికీ చూడలేదు. ముఖ్యంగా ‘సక్సె్‌స’ని మాత్రమే నెత్తిన పెట్టుకునే ఈ సినిమా ఇండీస్ట్రీలో.

జీవితం ఓ పొగరుబోతు మొండి గుర్రం. ఓ వైల్డ్‌ హార్స్‌... ఎక్కినంత మాత్రాన గమ్యానికి వెళతాం అనే గ్యారంటీ ఇవ్వదు. చాలా మంది చచ్చి చెడి దాన్ని ఎక్కి భయంతో అది ఎటు తీసుకెళితే అటు పోతారు. కొందరు మాత్రం దాన్ని లొంగదీసి ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా... ఎన్ని ఆటంకాలు ఉన్నా, తమకి నచ్చిన వైపు పరుగెత్తించి... అనుకున్న గమ్యానికి వెళతారు. వాళ్లు విజేతలు.... అలాటి వారిలో ‘బుర్రిపాలెం’ నుంచి సినిమా కోసం బయల్దేరి వచ్చిన ఆ అబ్బాయి ఒకరు.

సినీ రచయితగా నేను రాసిన నా మొదటి డైలాగ్‌ని తన వాయి్‌సతో మొదటిసారిగా సౌండ్‌ ట్రాక్‌ మీదకి ఎక్కించిన ఆయన అంటే నాకు ఇష్టం. ఘట్టమనేని కృష్ణమూర్తి అనే పేరుకి... ‘హీరో కృష్ణ’ అనే గొప్ప పేరు తెచ్చిన ఆయన ఎప్పటికీ హీరోయే!

‘నేను ఎక్కడికీ వెళ్లలేదు... సినిమాలతోనూ, మీ అందరితోనూ ఎప్పటికీ ఉంటాను’ అని ఆయన చెబుతున్నట్టే ఉంటుంది ఆయన జ్ఞాపకాల్ని తలుచుకున్నప్పుడు... మహే్‌షబాబును చూస్తున్నప్పుడు.

థ్యాంక్యూ కృష్ణ గారు... సాహసాన్ని, సరదాని, మంచితనాన్ని... ముఖ్యంగా స్వచ్ఛమైన నవ్వుని, మహే్‌షబాబుని, సినిమాకి అందించినందుకు.

Updated Date - 2022-11-27T08:43:36+05:30 IST