నేటి అలంకారం శ్రీ సరస్వతీ దేవి

ABN , First Publish Date - 2022-10-02T06:47:57+05:30 IST

శరన్నవవరాత్రి మహోత్సవాల్లో ఏడో రోజున... విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ వారు...

నేటి అలంకారం శ్రీ సరస్వతీ దేవి

ఆశ్వయుజ శుద్ధ సప్తమిఆదివారం (మూలా నక్షత్రం)

రన్నవవరాత్రి మహోత్సవాల్లో ఏడో రోజున... విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ వారు... చదువుల తల్లి శ్రీసరస్వతీ దేవిగా దర్శనమిస్తారు. శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రానికి విశిష్ట ప్రాముఖ్యం ఉంది. మూలా నక్షత్రం అమ్మవారి జన్మ నక్షత్రం. బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతీ దేవిని పురాణాలు వర్ణించాయి. ఆమె సంగీత, సాహిత్యాలకు అధిష్ఠాన దేవత. మానవులందరికీ సకల విద్యలను ప్రసాదించి వారిలో జ్ఞానదీపాన్ని వెలిగించే విద్యాశక్తి. ఈ తల్లిని ఆరాధించడం వల్ల బుద్ధి వికాసం, విద్యాలాభం కలుగుతాయి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా త్రిశక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవి తన అంశలోని నిజ స్వరూపాన్ని సాక్షాత్కరింప చేయడమే మూలా నక్షత్రం రోజున చేసే అలంకార ప్రత్యేకత. శ్వేతపద్మాన్ని అధిష్ఠించి, వీణ, దండ, కమండలాలు, అక్షమాల ధరించి, అభయ ముద్రతో భక్తుల అజ్ఞాన తిమిరాలను ఆమె దూరం చేస్తారని విశ్వాసం. చింతామణి సరస్వతి, జ్ఞానసరస్వతి, నీల సరస్వతి, ఘట సరస్వతి, కిణి సరస్వతి, అంతరిక్ష సరస్వతి, మహా సరస్వతి అనేవి సరస్వతీ దేవి ఏడు రూపాలు. ఆమెను కొలిస్తే విద్యార్ధులకు మంచి చదువును ప్రసాదిస్తుందనీ, వాక్సుద్ధి,  మంచి బుద్ధీ ఇస్తుందనీ నమ్మిక. నవరాత్రుల్లో మూలా నక్షత్రం నుంచి విజయదశమి వరకు విశేష పుణ్యదినాలుగా అమ్మవారిని భక్తులు ఆరాధిస్తారు. 


నైవేద్యం: దద్ధ్యోజనం, పాయసం, ఇతర తీపి పదార్థాలు

అలంకరించే చీర రంగు: తెలుపు

అర్చించే పూలు: కలువ పూలు 

పారాయణ: చేయాల్సినవి: సరస్వతీ స్తోత్రాలు

Read more