మొండి కొవ్వు కరగాలంటే

ABN , First Publish Date - 2022-06-07T08:05:40+05:30 IST

గంటల తరబడి వ్యాయామం చేస్తాం, ఆచితూచి క్యాలరీలు లెక్కించి మరీ డైటింగ్‌ చేస్తాం. అయినా ముఖం సన్నబడుతుందే తప్ప, శరీరం సన్నబడదు.

మొండి కొవ్వు కరగాలంటే

డైటింగ్‌, వ్యాయామం.. ఈ రెండింటితో అదనపు కొవ్వును కరిగించి, నాజూకైన శరీరాకృతిని 

పొందవచ్చు అనుకుంటాం. కానీ కొన్ని మొండి కొవ్వులు అంత తేలికగా  కరగవు. వాటి కోసం వైద్య చికిత్సలను  ఆశ్రయించవలసి వస్తుంది. ఆ సెల్యులైట్‌ రిడక్షన్‌ ట్రీట్మెంట్స్‌ ఇవే!


గంటల తరబడి వ్యాయామం చేస్తాం, ఆచితూచి క్యాలరీలు లెక్కించి మరీ డైటింగ్‌ చేస్తాం. అయినా ముఖం సన్నబడుతుందే తప్ప, శరీరం సన్నబడదు. మరీ ముఖ్యంగా పిరుదులు, తొడలు, నడుము.. ఇలా కొన్ని ప్రదేశాల్లో కొవ్వు మొండిగా తిష్ట వేసుకుని కూర్చుండిపోతుంది. 35 నుంచి 40 ఏళ్ల మహిళలు ఎదుర్కొనే కొవ్వు సమస్య ఇది. ప్రసవాలతో, అస్తవ్యస్థ ఆహారపుటలవాట్లతో ఈ సమస్య రెట్టింపవుతుంది. అయితే ఎలాంటి కొవ్వైనా వ్యాయామం, డైటింగ్‌తో కరగాలి. కానీ సెల్యులైట్‌ అనే ఈ మొండి కొవ్వు వాటికి స్పందించదు. శరీరమంతా సన్నబడినా, కొన్ని శరీర భాగాల్లో అలాగే తిష్ఠ వేసుకుని ఉండిపోతుంది. సెల్యులైట్‌ అనే ఈ భిన్నమైన కొవ్వు సమస్య పెద్దల నుంచి పిల్లలకు వంశపారంపర్యంగా సంక్రమిస్తుంది. జన్యుపరంగా సంక్రమించే ఈ సమస్యను వైద్య చికిత్సలతో పరిష్కరించుకోవచ్చు.ఇందుకోసం నాన్‌ సర్జికల్‌, సర్జికల్‌ అనే రెండు ప్రత్యామ్నాయాలున్నాయి. 


సర్జరీతో పనిలేని చికిత్సలు

రీరంలో ఎంత సెల్యులైట్‌ ఉంది? ఎంత ఫలితాన్ని ఆశిస్తున్నారు? అనే దాన్ని బట్టి సెల్యులైట్‌ రిడక్షన్‌ చికిత్సను ఎంచుకోవలసి ఉంటుంది. మిగతా శరీరమంతా ఫిట్‌గా ఉండి, కొన్ని ప్రదేశాల్లో తక్కువ మోతాదుల్లో సెల్యులైట్‌ ఉన్నవాళ్లకు నాన్‌ సర్జికల్‌ ట్రీట్మెంట్‌ ఫలితాన్నిస్తుంది. ఎక్కువ ఏరియాల్లో (పిరుదులు, తొడలు, చేతులు, వీపు, పొట్ట, నడుము), ఎక్కువ సెల్యులైట్‌ ఉన్న వాళ్లకు సర్జికల్‌ ట్రీట్మెంట్‌ మెరుగైన ఫలితాన్నిస్తుంది. అయితే సర్జరీతో పని లేని చికిత్సల్లో సెషన్లు, ఖర్చూ.. రెండే ఎక్కువే! అలాగే అతి తక్కువ నుంచి మధ్యస్థంగా ఉండే సెల్యులైట్‌కు మాత్రమే నాన్‌ సర్జికల్‌ చికిత్సలు ఉపయోగపడతాయి. ఈ చికిత్సలో భాగంగా డబుల్‌ చిన్‌ లాంటి చిన్న ప్రదేశాల్లోని సెల్యులైట్‌ను లైపోలైటిక్‌ ఇంజెక్షన్లతో కరిగించవచ్చు. ఆ ప్రదేశంలో ఇంజెక్షన్‌ ఇవ్వడం వల్ల అక్కడి కొవ్వు కణాలు కరిగి, రక్తంలో కలిసిపోతాయి. అలాగే మైల్డ్‌ టు మోడరేట్‌ సెల్యులైట్‌ ఉన్నవాళ్లకు క్రయోథెరపీ ఉపయోగపడుతుంది. ఈ థెరపీలో ప్రోబ్స్‌ ద్వారా ఆ ప్రదేశంలోని కొవ్వు తాపమానాన్ని బాగా తగ్గించి, శరీరంలో శోషణ చెందేలా చేయడం జరుగుతుంది.


సెల్యులైట్‌ సర్జరీలు ఇవే!

ఎక్కువ చోట్ల, ఎక్కువ మోతాదుల్లో ఉన్న కొవ్వును ఒకే సెషన్‌లో తొలగించే చికిత్స ఇది. మధ్యస్తం నుంచి అత్యధిక కొవ్వును కరిగించుకోవడం కోసం ఉద్దేశించిన సర్జరీలు ఇవి. కొవ్వును కరిగించడమనే ప్రధాన సూత్రం ఆధారంగా, మాన్యువల్‌ లైపోసక్షన్‌తో పాటు, అలా్ట్రసౌండ్‌, లేజర్‌ అసిస్టెడ్‌, ఇన్‌ఫ్రారెడ్‌, సక్షన్‌ అసిస్టెడ్‌ మొదలైన ఆధునికమైన, సౌకర్యవంతమైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. వీటన్నిట్లో శరీరం మీద, ఒకటి నుంచి ఒకటిన్నర సెంటీమీటర్ల కోత పెట్టవలసి ఉంటుంది. 


మాన్యువల్‌ లైపోసక్షన్‌: ఎంతో పూర్వం నుంచీ అనుసరిస్తున్న సంప్రదాయ చికిత్స ఇది. ఈ సర్జరీలో ఏరియాను బట్టి (లోకల్‌, జనరల్‌) అనస్తీషియా ఎంచుకుంటారు. తర్వాత కొవ్వును కరిగించవలసిన ప్రాంతం దగ్గర చిన్న రంధ్రం చేసి, కొవ్వును కరిగించే ద్రవాన్ని పంపించి, ట్యూబ్‌తో సక్షన్‌ మిషన్‌కు కనెక్ట్‌ చేయడం జరుగుతుంది. అలా వైద్యులు ప్రోబ్‌ను కదిలించే చేతి కదలికలను బట్టి, కొవ్వు సక్షన్‌ మిషన్‌ సహాయంతో బయటకు వచ్చేస్తూ ఉంటుంది.

అల్ర్టాసౌండ్‌ అసిస్టెడ్‌ లైపోసక్షన్‌: ఈ పద్ధతిలో అల్ర్టాసౌండ్‌ తరంగాలతో కొవ్వు కణాలను పగిలిపోయేలా చేసి, సక్షన్‌ మిషన్‌తో వాటిని బయటకు రప్పించడం  జరుగుతుంది. 

లేజర్‌ అసిస్టెడ్‌ లైపోసక్షన్‌: లేజర్‌తో కొవ్వు కణాలను ఛేదించి, సక్షన్‌ మిషన్‌ సహాయంతో వాటిని శరీరం నుంచి తొలగించడం జరుగుతుంది.


పరిమితులున్నాయి

సర్జరీకి ముందు, ఎంతటి ఫలితాన్ని ఆశిస్తున్నారు? ఎంత కొవ్వును కరిగించుకోవాలనుకుంటున్నారు? అనేది వైద్యులు ఆరా తీస్తారు. తర్వాత కొవ్వు తొలగించవలసిన ప్రదేశాలను మార్క్‌ చేసుకుని, సాధ్యాసాధ్యాలను రోగికి వివరిస్తారు. లైపోసక్షన్‌కు కొన్ని పరిమితులుంటాయి. ఒకసారికి 5 నుంచి 8 లీటర్ల కొవ్వును మాత్రమే తొలగించడానికి సాధ్యపడుతుంది. అలాగే వ్యక్తి వయసు, బరువు, ఇతరత్రా ఆరోగ్య సమస్యలన్నిటినీ దృష్టిలో పెట్టుకోవాలి. మధుమేహం, అధిక రక్తపోటు మొదలైన సమస్యలన్నీ అదుపులో ఉండాలి. కొంతమందికి ఒకే సెషన్‌లో కొవ్వు తొలగించడానికి వీలు పడుతుంది. ఇంకొందరికి రెండు సెషన్లు అవసరం పడవచ్చు. 


సర్జరీ తర్వాత జాగ్రత్తలు

చర్మం, కండరం మధ్య ఉండే కొవ్వును తొలగించడం మూలంగా సర్జరీ తర్వాత చర్మం వదులవుతుంది. ఆ పరిస్థితిని కొంత అదుపు చేయడం కోసం 4 నుంచి 6 వారాల పాటు బిగుతైన కంప్రెషన్‌ గార్మెంట్స్‌ ధరించవలసి ఉంటుంది. నొప్పి తగ్గించే మందులు, యాంటీబయాటిక్స్‌ కొంతకాలం వాడవలసి ఉంటుంది. అలాగే జిమ్‌లో వ్యాయామాలు, క్రీడలకు 6 వారాల పాటు దూరంగా ఉండాలి. 


డాక్టర్‌ వెంకటేష్‌ బాబు

ప్లాస్టిక్‌ రికన్‌స్ట్రక్టివ్‌ అండ్‌ ఈస్థటిక్‌ సర్జన్‌,

కాస్మోస్యూర్‌ క్లినిక్‌,

హైదరాబాద్‌.


నివారణ ఇలా...

జన్యుపరంగా సంక్రమించే కొవ్వును ఆపడం మన చేతుల్లో ఉండదు. కానీ డైట్‌, వ్యాయామాలతో దాన్ని అదుపులో పెట్టుకోవడం మన చేతుల్లో పనే! జన్యుపరంగా సంక్రమించే గుణం కొవ్వుకు ఉన్నప్పటికీ, దాన్ని పరిమితిలో ఉంచడం కోసం కచ్చితంగా ఆహారపుటలవాట్లు, జీవనశైలులను మార్చుకోక తప్పదు. వంశపారంపర్యంగా సెల్యులైట్‌ సమస్య పొంచి ఉన్నవాళ్లు, కొంత అప్రమత్తంగా ఉండాలి. లావు అవుతున్నామనడానికి సూచనగా కనిపించే స్ట్రెచ్‌ మార్క్స్‌ మొదలైన వెంటనే బరువు తగ్గే చర్యలు మొదలుపెట్టాలి.


మళ్లీ కొవ్వు?

సర్జరీతో కొవ్వును తొలగించిన తర్వాత, తిరిగి కొవ్వు పేరుకోదని చెప్పడానికి లేదు. అయితే పేరుకునే కొవ్వు మోతాదు మాత్రం కచ్చితంగా తక్కువగానే ఉంటుంది. సర్జరీతో 50ు నుంచి 60ు కొవ్వు కణాలను తొలగిస్తారు కాబట్టి, మిగిలిన 40ు కొవ్వు కణాలే పెరుగుతాయి. తప్ప తొలగించిన కొవ్వు కణాలన్నీ భర్తీ కావు. కాబట్టి సర్జరీకి ముందులా ఎక్కువగా లావైపోయే పరిస్థితి ఉండదు. అయినప్పటికీ సర్జరీతో సమకూరిన శరీరాకృతిని కొనసాగించాలంటే, పరిమిత కాల్యరీలు తీసుకోవడంతో పాటు క్రమం తప్పక వ్యాయామం చేస్తూ ఉండాలి. 


మాన్యువల్‌ లైపోసక్షన్‌ కంటే లేజర్‌, ఇన్‌ఫ్రారెడ్‌ మొదలైన లైపోసక్షన్లతో సర్జరీ తర్వాత నొప్పి తక్కువగా ఉంటుంది. సర్జరీ నుంచి త్వరగా కోలుకోగలుగుతారు. మాన్యువల్‌ లైపోసక్షన్‌తో కోలుకోడానికి నాలుగు రోజుల సమయం పడితే, ఇతర సర్జరీలతో రెండు రోజుల్లోనే కోలుకోవచ్చు. అలాగే లేజర్‌, ఇన్‌ఫ్రారెడ్‌ సర్జరీలతో వదులైన చర్మం తిరిగి బిగుతుగా మారే అవకాశాలు కూడా ఎక్కువే!

Updated Date - 2022-06-07T08:05:40+05:30 IST