‘జీవితంలో కష్టాలు పడీపడీ అలిసిపోయాం.. ఇక మా వల్ల కాదు’ అనుకునే వాళ్లు ఈ వార్త చూడండి..

ABN , First Publish Date - 2022-07-18T20:32:05+05:30 IST

పట్టుదలతో ఆర్థిక ఇబ్బందులను దాటి అనుకున్నది సాధించడం అంటే మాటలు కాదు. దానికి అపారమైన కృషితో పాటు పట్టుదల కూడా తోడుకావాలి.

‘జీవితంలో కష్టాలు పడీపడీ అలిసిపోయాం.. ఇక మా వల్ల కాదు’ అనుకునే వాళ్లు ఈ వార్త చూడండి..

జీవితంలో గొప్పగా నిలదొక్కుకోవడానికి మనం ఎన్నో కలలు కంటూ ఉంటాం.. పెద్దయ్యాకా ఇలా అవ్వాలి అలా అవ్వాలని, డాక్టర్, ఐఏఎస్ కావాలని, లాయర్ కావాలని తల్లిదండ్రులు పెట్టే గోల్స్ కొన్నయితే, మనకు మనం పెట్టుకునేవి మరికొన్ని. కలలను నెరవేర్చుకొనే అవకాశం అందరికీ రాదు. పట్టుదలతో ఆర్థిక ఇబ్బందులను దాటి అనుకున్నది సాధించడం అంటే మాటలు కాదు. దానికి అపారమైన కృషితో పాటు పట్టుదల కూడా తోడుకావాలి. అందరూ వాళ్లు కన్న కలలను సాకారం చేసుకోలేరు. కానీ ఇప్పుడు మనం తెలుసుకునే వ్యక్తి తన కష్టార్జితంతో కన్న కలను సాధించాడు. ఉత్తరాఖండ్ జిల్లా సితార్ గంజ్ కు చెందిన IAS అధికారి హిమాన్షు గుప్తా గురించి చెప్పాలంటే చాలా ఉంది. పేదరికం, కష్టాలు ఉన్న ఓ సాధారణమైన కుటుంబానికి చెందిన హిమాన్షు గుప్తా UPSC పరీక్షను రాయడానికి కష్టపడే సివిల్ సర్వీస్ అభ్యర్థులందరికీ ఒక ప్రేరణ.


ఐఏఎస్ హిమాన్షు గుప్తా ఎవరు?

ఉత్తరాఖండ్‌లోని సితార్‌గంజ్ జిల్లాకు చెందిన హిమాన్షు గుప్తా చిన్నప్పటి నుంచి తెలివైన విద్యార్థి.  అతని బాల్యం సాధారణ పిల్లల కంటే చాలా భిన్నంగా గడిచింది. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా పేదరికంలో పెరిగాడు. తండ్రి రోజువారీ కూలీ, అతని సంపాదన కుటుంబ అవసరాలుకు సరిపోయేది కాదు. 


తన లక్ష్యాన్ని చేరుకోవడానికి టీ అమ్మాడు.

కుటుంబ స్థితిని అర్థం చేసుకుని హిమాన్షు తండ్రితో కలిపి టీ స్టాల్‌ను మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. పాఠశాల సమయం తర్వాత టీ స్టాల్‌లో తండ్రికి సహాయం చేసేవాడు. హిమాన్షుపై ఎప్పుడూ పెద్ద ఆర్థిక భారం ఉండేది.  తండ్రి ఈ చాలీచాలని ఆదాయాన్ని పెంచుకోవాలని చాలా ప్రయత్నాలు చేసేవాడు. విదేశాల్లో ఉద్యోగం దొరికితే మంచి ఆదాయం వస్తుందని ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉండేవాడు. ఈ ఆర్థిక భారాన్ని తట్టుకోడానికి సొంత ఊరు బరేలీకి మారారు. అక్కడే హిమాన్షుని స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు.


ఐఏఎస్‌ అధికారి కావాలనే తన కలను ఎలా నెరవేర్చుకున్నాడు.

IAS అధికారి హిమాన్షు గుప్తా చదువు కోసం ప్రతిరోజూ 70 కి.మీ ప్రయాణించాల్సి వచ్చేది. తన పాఠశాల చదువు పూర్తి చేసిన తర్వాత, హిమాన్షు ఢిల్లీ విశ్వవిద్యాలయంలో హిందూ కళాశాలలో చేరాడు. ట్యూషన్లు, బ్లాగులు రాస్తూ ఫీజు కట్టేవాడు. ఆ తరువాత ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్‌లో మాస్టర్స్ డిగ్రీ తీసుకున్నాడు. కష్టపడి చదివి తన బ్యాచ్‌లో మొదటిస్థానంలో నిలిచాడు.


విదేశాలలో పీహెచ్‌డీని చేసే అవకాశం వచ్చినా కూడా, భారతదేశంలోనే ఉండి సివిల్ సర్వీసెస్‌ను ఎంచుకున్నాడు. కుటుంబ అవసరాల కోసం హిమాన్షు ప్రభుత్వ కళాశాలలో రీసెర్చ్ స్కాలర్‌గా చేరాడు. ఈ ఉద్యోగంలో నే ఎన్నో విషయాలను గమనించే అవకాశం వచ్చింది. ఆర్థికంగా కూడా స్టైఫండ్ అందడంతో కుటుంబ పరిస్థితి కాస్త మెరుగుపడింది. అంతే కాకుండా పౌర సేవలకు సిద్ధం కావడానికి విద్యా వాతావరణాన్ని కల్పించినట్టయింది.


యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షకు మూడుసార్లు ప్రయత్నించారు.

హిమాన్షు గుప్తా మూడుసార్లు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షకు ప్రయత్నించాడు. మొదటి ప్రయత్నంలో, సివిల్ సర్వీసెస్‌కు అర్హత సాధించాడు కానీ IRTSకి మాత్రమే ఎంపికయ్యాడు. తిరిగి మళ్ళీ ప్రిపరేషన్ కొనసాగించి 2019 UPSC పరీక్షలో IPS అయ్యాడు. 


UPSC సివిల్ సర్వీసెస్‌కు హాజరైన మూడవసారి తన చివరి ప్రయత్నంలో, అతను ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ (IAS)కి అర్హత సాధించాడు. IAS అధికారి హిమాన్షు గుప్తా పెద్ద కలలు కనే వారందరికీ వాటిని సాధించడానికి ఒక స్పష్టమైన ఉదాహరణ. ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు అడుగడుగునా ఇబ్బంది పెడుతున్నా కృషి, పట్టుదలతో అనుకున్నది సాధించే తత్వం ఉంటే ఎవరైనా IAS సాధించగలరని హిమాన్షు నిరూపించాడు.

Read more