ఈ విద్యార్థిని ఉత్తమ సంస్కృత స్కాలర్‌

ABN , First Publish Date - 2022-02-19T05:30:00+05:30 IST

ఓ ముస్లిం విద్యార్థిని... ఉత్తమ సంస్కృత స్కాలర్‌గా ఎంపికై అందరి

ఈ విద్యార్థిని ఉత్తమ సంస్కృత స్కాలర్‌

 ఓ ముస్లిం విద్యార్థిని... ఉత్తమ సంస్కృత స్కాలర్‌గా ఎంపికై అందరి మన్ననలు అందుకుంటోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 10న విశ్వవిద్యాలయ డీన్‌ చేతుల మీదుగా 5 స్వర్ణ పతకాలను అందుకుంది. చదువులో రాణించడానికి కులమతాలతో పని లేదని నిరూపించిన లక్నో అమ్మాయి గజాలా గురించిన విశేషాలు!


లక్నో, నిశాంత్‌గంజ్‌లోని గజాలా నివాసం ఒకే ఒక ఇరుకు గది. ఆ 23 ఏళ్ల అమ్మాయి ప్రతి రోజూ ఐదు గంటలకు నమాజ్‌ కోసం నిద్ర లేస్తుంది. తర్వాత ఇంటి పనులు ముగించుకుని, ఏకంగా 7 గంటల పాటు సంస్కృతం చదువుతుంది. సంస్కృతం మీద పట్టు సాధించడం కోసం గజాలా అంతలా కృషి చేయడానికి కారణం సంస్కృత ప్రొఫెసర్‌గా ఎదగాలని ఆమె కలలు కనడమే! సంస్కృతం పట్ల ఆసక్తి గజాలాకు బాల్యంలోనే ఏర్పడింది.


నిశాంత్‌గంజ్‌లోని ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి నుంచే గజాలా సంస్కృతాన్ని అభ్యసించింది. స్కూలు నుంచి కాలేజీ విద్య వరకూ తనకు సంస్కృతం భోధించిన ఉపాధ్యాయులను గుర్తు చేసుకుంటూ గజాలా తన కథను ఇలా చెప్పుకొచ్చింది. ‘ఐదో తరగతిలో నాకు మీనా టీచరు సంస్కృతం నేర్పించారు. తర్వాత ఆర్యకన్య ఇంటర్‌ కాలేజీలో ఇంటర్‌ చదువుతున్నప్పుడు అర్చనా ద్వివేదీ అనే ప్రొఫెసర్‌ సంస్కృత భాషలో నన్ను ప్రోత్సహించారు. ఫలితంగా నేను మంచి మార్కులు సాధించాను. బిఎ చదివే సమయంలో నగ్మా సుల్తాన్‌, తర్వాత ఎమ్‌ఎలో ప్రయాగ నారాయణ్‌ మిశ్రా... ఇలా ఎంతో మంది టీచర్లు, ప్రొఫెసర్లు సంస్కృతంలో నేను రాణించడానికి తోడ్పడ్డారు.


వాళ్ల తోడ్పాటుతోనే...

ముస్లిం మహిళనై ఉండి సంస్కృతం పట్ల ఆసక్తి ఏర్పడడం, ఆ భాషలో రాణించడం ఎలా సాధ్యపడిందని నన్నెంతో మంది అడుగుతూ ఉంటారు. ఒక ముస్లింగా సంస్కృత భాషతో నాకు ఒరిగే ప్రయోజనం గురించి కూడా అడుగుతూ ఉంటారు. నిజానికి నేను ప్రయోజనాన్ని ఆశించి సంస్కృతం మీద ఆసక్తిని పెంచుకోలేదు. మా తల్లితండ్రులు సైతం నా ఆసక్తికి అడ్డు చెప్పలేదు. రోజువారీ కూలీ అయిన నా తండ్రి నన్నెంతో కష్టపడి చదివించారు.


నా చదువుకయ్యే ఖర్చు కోసం నా తమ్ముళ్లు షాదాబ్‌, నవాబ్‌లు బాల్యంలోనే బడి మానుకుని గ్యారేజీలో పని చేయడం మొదలుపెట్టారు. నా పెద్దక్క యాస్మిన్‌ ఓ స్టీలు దుకాణంలో పనిలో చేరింది. అమ్మ నశ్రీన్‌ బానో నా బాగోగులన్నీ చూసుకునేది. ఇలా కుటుంబ సభ్యులందరూ నా చదువు కోసం తమ జీవితాలను ధారపోశారు. వాళ్లు నా మీద పెట్టుకున్న ఆశలను నిజం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాను. నాకెంతో ఇష్టమైన సంస్కృతంలో పరిణతి సాధించాను. అలా 5 బంగారు పతకాలు గెలుచుకుని, లక్నో యూనివర్శిటీ ఉత్తమ సంస్కృత స్కాలర్‌గా ఎంపికయ్యాను. 


తమ్ముళ్లకే అంకితం

నాలాంటి వ్యక్తికి ఈ స్వర్ణ పతకాలెంత విలువైనవో ఎవరూ ఊహించలేరు. ఇవి నా కుటుంబం పడిన కష్టం ఫలితం. కాబట్టి ఈ గోల్డ్‌ మెడల్స్‌ నా కోసం తమ చదువులను త్యాగం చేసిన నా తమ్ముళ్లు, అక్కకే అంకితమిస్తున్నాను. స్వర్ణ పతకాలు గెలుచుకున్న పోత్సాహంతో నేను వేదిక్‌ లిటరేచర్‌లో పిహెచ్‌డి చేయాలని నిశ్చయించుకున్నాను. 


నాలాంటి వ్యక్తికి ఈ స్వర్ణ పతకాలెంత విలువైనవో ఎవరూ ఊహించలేరు. ఇవి నా కుటుంబం పడిన కష్టానికి  ఫలితం.


Updated Date - 2022-02-19T05:30:00+05:30 IST