Invest : ఆర్థిక మంత్రి మీరే!

ABN , First Publish Date - 2022-12-06T23:37:40+05:30 IST

కుటుంబపరమైన ఆర్ధిక అంశాల్లో తమకంటే పురుషులే మేలనే భావన వదిలించుకుని దాన్లో తమ పాత్ర పరిధి పెంచాలి. అందుకోసం సమయాన్ని

Invest : ఆర్థిక మంత్రి మీరే!

  • కుటుంబపరమైన ఆర్ధిక అంశాల్లో తమకంటే పురుషులే మేలనే భావన వదిలించుకుని దాన్లో తమ పాత్ర పరిధి పెంచాలి. అందుకోసం సమయాన్ని కేటాయించటం మొదలుపెట్టాలి. మ్యూచువల్‌ ఫండ్స్‌, సేవింగ్స్‌ మొదలైన విషయాల్లో చురుగ్గా వ్యవహరించాలి.

  • పర్సనల్‌ ఫైనాన్స్‌ మీద పట్టు కోసం ఫైనాన్స్‌ లేదా పెట్టుబడికి సంబంధించిన కోర్సులు అభ్యసించాలి.

  • ఇల్లు కట్టుకోవటం మీ లక్ష్యమైతే అందుకోసం ఎలా, ఎంతకాలం, ఎంత పొదుపు చేయాలనుకుంటున్నారో ఆ ప్లానింగ్‌ గురించి దంపతులిద్దరూ చర్చించుకోవాలి. ఆ లక్ష్యాన్ని చేరుకోవటం కోసం దేన్లో పెట్టుబడి పెట్టొచ్చో కలిసి నిర్ణయించుకోవాలి.

  • స్నేహితుల ఆర్ధిక సలహాల మీద ఆధారపడకూడదు. ఇందుకోసం అనుభవం ఉన్న ఆర్ధిక నిపుణుడిని సంప్రదించాలి. అలాగే అతను సూచించే పెట్టుబడి మార్గాలను గుడ్డిగా అనుసరించకుండా, సందేహాలుంటే అతన్నే అడిగి నివృత్తి చేసుకుని ముందుకు సాగాలి.

మనీ మేనేజ్‌మెంట్‌ ఇలా!

డబ్బును మదుపు చేయటం, పెట్టుబడి పెట్టటం...ఈ రెండు ఆర్ధిక విషయాల్లో మహిళలు సమానమైన పట్టు సాధించాలి. ఇందుకోసం...

  • ఆర్ధిక భద్రత, స్థిరత్వం, కుటుంబ స్వేచ్ఛ...ఈ మూడు లక్ష్యాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఎప్పుడు ఎటువంటి ఉపద్రవమైనా రావొచ్చు. ఊహించని ఖర్చు కుదేలు చేయొచ్చు. కాబట్టి ఆర్ధిక భద్రత కల్పించుకోవాలి. ఒడిదుడుకులకు లోనైనా చెక్కు చెదరని ఆర్ధిక స్థిరత్వం ఏర్పరుచుకోవాలి. అదే సమయంలో కుటుంబంలోని ఏ ఒక్క వ్యక్తి ఆర్ధిక స్వేచ్ఛకూ భంగం కలగకుండా చూసుకోవాలి.

  • భవిష్యత్తుకు సంబంధించిన ఆర్ధిక అంచనాలను తయారుచేసి పెట్టుకుంటే సంసార నౌక సజావుగా సాగిపోతుందనే విషయం గుర్తు పెట్టుకోవాలి. పిల్లల చదువులు, పెళ్లిళ్లులాంటి పెద్ద ఖర్చులను దృష్టిలో పెట్టుకుని ఆ అంచనాలకు తగ్గట్టు ఆర్ధిక ప్రణాళికలు వేసుకోవాలి. ఇలాంటి ఫ్యూచర్‌ ప్లానింగ్‌ వల్ల ఆ సమయం వచ్చినప్పుడు అప్పుల కోసం చేయి చాచాల్సిన దుస్థితి తప్పుతుంది.

  • పెట్టుబడి, రాబడి మీద స్పష్టత ఉండాలి. దేన్లో పెట్టుబడి పెడుతున్నాం? ఫలితంగా ఎంత లాభం ఆశిస్తున్నాం? అనే విషయాల మీద పట్టుంటే నష్టభయం ఉండదు.

  • ఆర్ధిక అంశాల్లో పురుషులే బెస్ట్‌ అనుకోకూడదు. కొన్ని కుటుంబాల్లో మనీ మేనేజ్‌మెంట్‌ కోసం భర్తలు పూర్తిగా భార్యల మీదే ఆధారపడతారు. అలాంటి భార్యల కోవలో మీరూ ఒకరు కావొచ్చు. కాబట్టి పరిస్థితికి తగ్గట్టు ఆర్ధిక కళ్లాలు చేతుల్లోకి తీసుకుని సంసార రథాన్ని పరిగెత్తించాలి.

Updated Date - 2022-12-10T00:29:51+05:30 IST