సెట్‌లో మహేశ్వరిని చూసి షాక్‌ అయిన దర్శకుడు

ABN , First Publish Date - 2022-05-29T07:41:33+05:30 IST

వరకట్న సమస్యల మీద ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో టి.కృష్ణ మెమోరియల్‌ సంస్థ అధినేత ఎం.

సెట్‌లో మహేశ్వరిని చూసి షాక్‌ అయిన దర్శకుడు

రకట్న సమస్యల మీద ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో టి.కృష్ణ మెమోరియల్‌  సంస్థ  అధినేత ఎం. నాగేశ్వరరావు నిర్మించిన చిత్రం ‘అమ్మాయి కాపురం’ (1994). హాస్యనటుడు అలీ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రంతో ప్రముఖ కథానాయిక శ్రీదేవి సోదరి సూర్యకళ కుమార్తె  మహేశ్వరి హీరోయిన్‌గా పరిచయం అయ్యారు. స్వర్గీయ దర్శకుడు టి. కృష్ణ పెద్ద కుమారుడు ప్రేమ్‌చంద్‌ (హీరో గోపీచంద్‌ అన్నయ్య. అప్పటికి గోపీచంద్‌ రష్యాలో చదువుకుంటున్నారు)  డిగ్రీ పూర్తి చేసి,  ఈ సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేరారు.


  ఆ సమయంలోనే తమిళ దర్శకుడు భారతీరాజా ‘కరుత్తమ్మ’ చిత్రంతో మహేశ్వరిని హీరోయిన్‌గా పరిచయం చేశారు. ఆ విషయం తెలిసి ఆమెకు  తెలుగులో అవకాశం ఇవ్వాలనుకున్నారు  నిర్మాత నాగేశ్వరరావు. ఆమె ఫొటోలు దర్శకుడు ముత్యాల సుబ్బయ్యకు చూపించడంతో ఆయనకు కూడా నచ్చి, మనిషిని చూడకుండానే  ఓకే అనేశారు. ఒంగోలు లో షూటింగ్‌ ప్రారంభించిన రోజున మహేశ్వరి సెట్‌కు వచ్చారు. ఆమెను చూడగానే ముత్యాల సుబ్బయ్య తెల్లబోయారు. మనిషి చాలా సన్నగా, ఏ మాత్రం గ్లామర్‌ లేకుండా ఉంది. మాంచి ఎండలలో భారతీరాజా షూటింగ్‌ చేశారేమో ముఖం మాడి నల్లగా తయారైంది.


ఆయన సినిమాల్లో హీరోయిన్లకు మేకప్‌ ఉండదు కనుక పరవాలేదు కానీ ‘అమ్మాయి కాపురం’ చిత్రంలో కథంతా హీరోయిన్‌ చుట్టూనే తిరుగుతుంది. ఆమె అందంగా లేకపోతే ఎలా అని డీలా పడిపోయారు ముత్యాల సుబ్బయ్య. ఆర్టిస్టులంతా ఒంగోలు వచ్చేశారు. షూటింగ్‌ ఆపి, మరో హీరోయిన్‌ని ఎంపిక చేసే సమయమే లేదు. ‘ఇంతమంచి సినిమాకు ఇలాంటి అమ్మాయిని హీరోయిన్‌గా పెట్టుకుని ఎలా ముందుకు పోవడం!.. ఏమిటీ  నాకు ఈ అగ్నిపరీక్ష’  అని మనసులో బాధ పడ్డారు ముత్యాల సుబ్బయ్య. అయితే ‘ఈ అమ్మాయిని మార్చాల్సిందే.. లేకపోతే నేను షూటింగ్‌ చెయ్యను’ అని మొండికేసే మనస్తత్వం సుబ్బయ్యది కాదు. అందుకే తనే రాజీ పడి షూటింగ్‌ మొదలుపెట్టారు. ‘ఈ అమ్మాయి హీరోయిన్‌ అట.. చండాలంగా లేదూ’ అని షూటింగ్‌ చూడడానికి వచ్చిన జనం చేస్తున్న కామెంట్స్‌ విననట్టు నటిస్తూ షూటింగ్‌ కొనసాగించారు ముత్యాల సుబ్బయ్య. మహేశ్వరి ఓ యాంగిల్‌లో బాగుంటుందో ఛాయాగ్రాహకుడితో చర్చించి అలాగే షూటింగ్‌ చేసేవారు. 


అయితే కొన్ని రోజుల తర్వాత  ఎవరూ ఊహించని సంఘటన జరిగి, ‘అమ్మాయి కాపురం’ షూటింగ్‌కు బ్రేక్‌ పడింది. అదేమిటంటే షూటింగ్‌లో ఉపయోగించడం కోసం గుర్రపు బండి కావాల్సి వస్తే, సింగరాయకొండ దగ్గరున్న గ్రామంలో ఉందని తెలిసి తీసుకురావడానికి ప్రేమ్‌చంద్‌ వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఆయన వస్తున్న కారుకు ప్రమాదం జరిగి ప్రేమ్‌చంద్‌ ప్రాణాలు కోల్పోయారు. ఈ వార్త తెలియగానే యూనిట్‌లో అందరూ షాక్‌ అయ్యారు. వెంటనే షూటింగ్‌కు ప్యాకప్‌ చెప్పేసి ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లారు.


అప్పటికే టి.కృష్ణ పోయారు. చేతికి అంది వచ్చిన ప్రేమ్‌చంద్‌ కూడా ఇలా అర్థాంతరంగా కన్నుమూయడంతో ఆ షాక్‌ను తట్టుకోలేక రెండు నెలల పాటు ‘అమ్మాయి కాపురం’ షూటింగ్‌ ఆపేశారు. దీని వల్ల  ఒక రకంగా మేలే జరిగింది. ఈ గ్యాప్‌లో గ్లామర్‌ మీద కేర్‌ తీసుకుని  మహేశ్వరి పరవాలేదనిపించే విధంగా తయారైంది. దాంతో  అంతకుముందు తీసిన షాట్స్‌ రీ షూట్‌ చేసి  ‘అమ్మాయి కాపురం’ సినిమా పూర్తి చేశారు.  ఈ సినిమా ప్రేక్షకుల ప్రశంసలు పొంది, హిట్‌ అవడమే కాదు ప్రభుత్వ నంది అవార్డ్‌ కూడా పొందింది.

Read more