surgery : ఆ సర్జరీ ఉపయోగకరమా?

ABN , First Publish Date - 2022-11-10T06:10:10+05:30 IST

డాక్టర్‌! నా వయసు 30. అధిక బరువు కారణంతో నాకు పెళ్లి సంబంధాలు రావడం లేదు. మధుమేహం కూడా ఉంది. ఊబకాయాన్ని తగ్గించుకోవడం

surgery : ఆ సర్జరీ ఉపయోగకరమా?

డాక్టర్‌! నా వయసు 30. అధిక బరువు కారణంతో నాకు పెళ్లి సంబంధాలు రావడం లేదు. మధుమేహం కూడా ఉంది. ఊబకాయాన్ని తగ్గించుకోవడం కోసం బేరియాట్రిక్‌ సర్జరీ చేయించుకుందామని అనుకుంటున్నాను. ఈ సర్జరీలో ఉన్న లాభనష్టాల గురించి వివరించగలరు

ఓ సోదరి, ఖమ్మం.

లావు, సన్నం....ఎలాంటి వ్యక్తులకైనా మజిల్‌ మాస్‌ ఒకేలా ఉంటుంది. లావుగా ఉండే వ్యక్తుల్లో ఈ మజిల్‌ మాస్‌కు అదనంగా కొవ్వు ఉంటుంది. బేరియాట్రిక్‌ సర్జరీ ప్రధానోద్దేశం ఈ కొవ్వును కరిగించటమే! సర్జరీతో తీసుకునే ఆహారాన్ని, తద్వారా క్యాలరీలను నియంత్రించగలిగితే శరీరం శక్తి కోసం తనలోని కొవ్వును కరిగించుకోవటం మొదలుపెడుతుంది. ఈ పరిస్థితి కొనసాగితే కొంతకాలానికి శరీరంలో పేరుకున్న అదనపు కొవ్వు కరిగి శరీర బరువు అదుపులోకొస్తుంది. ఫలితంగా మెటబాలిక్‌ డిజార్డర్లు అయిన మధుమేహం, థైరాయిడ్‌, హైపర్‌టెన్షన్‌లాంటి సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. జీవన శైలి మెరుగవుతుంది. స్థూలకాయంతో కూడిన ఇబ్బందులన్నీ తగ్గిపోతాయి. ఇవన్నీ బేరియాట్రిక్‌ సర్జరీతో పొందే ప్రయోజనాలు.

ప్రతికూలతలూ ఉన్నాయి

  • అన్ని సర్జరీలకు లాగే బేరియాట్రిక్‌ సర్జరీకి అనుకూలతలు, ప్రతికూలతలు రెండూ ఉంటాయి. అవేంటంటే...

  • జీర్ణాశయం సాగుతుంది: జీర్ణాశయానికి సాగే గుణం ఉంటుంది. స్లీవ్‌ గ్యాస్ట్రక్టమీ చేసి జీర్ణాశయంలో సగ భాగాన్ని తొలగించినా 8 నుంచి 10 ఏళ్ల వ్యవధిలో అది కొద్ది కొద్దిగా సాగి పూర్తి ఆకారం సంతరించుకుంటుంది. కాబట్టి దీర్ఘకాలం నాన్‌ ఒబేసిటీ కోరుకునేవారికి ఈ సర్జరీ అనుకూలం కాదు.

  • ఇన్‌ఫెక్షన్‌: స్లీవ్‌ గ్యాస్ట్రక్టమీలో కత్తిరించిన జీర్ణాశయానికి వేసే క్లిప్పులు మధ్య నుంచి ఆహారం శరీరంలోకి లీక్‌ అవుతుంది. దాంతో శరీరంలోని భాగాలకు ఇన్‌ఫెక్షన్‌ వ్యాపించే ‘సెప్టిసీమియా’ అనే తీవ్ర సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది.

  • రక్తస్రావం: స్లీవ్‌ గ్యాస్ట్రక్టమీ సర్జరీ తర్వాత క్లిప్స్‌ నుంచి అంతర్గతంగా రక్తస్రావం జరగొచ్చు. ఈ లక్షణాన్ని సర్జరీ జరిగిన మూడు, నాలుగు రోజుల్లో గుర్తించగలిగితే సరిదిద్దటం తేలిక. అంతకు మించి ఆలస్యమైతే పరిణామాలు ప్రాంణాంతకంగా మారతాయి.

  • పోషకాల లోపం: గ్యాస్ట్రిక్‌ బైపాస్‌ వల్ల ఆహారం నేరుగా విసర్జించబడి పోషకాల లోపం ఏర్పడుతుంది. ఈ స్థితిని సరిదిద్దటం కోసం జీవితాంతం విటమిన్‌, మినరల్‌ సప్లిమెంట్లు వాడాల్సి ఉంటుంది.

  • ఆహారం లేదా నీరు: గ్యాస్ట్రిక్‌ బ్యాండింగ్‌లో జీర్ణాశయం చిన్న సంచీలా మారుతుంది కాబట్టి ఆహారం తీసుకున్న తర్వాత పొట్టలో నీటికి చోటుండదు. దాంతో తిన్న వెంటనే నీళ్లు తాగితే వాంతి అయ్యే అవకాశాలు ఎక్కువ. ఆహారం తిన్న కొద్దిసేపటి తర్వాతే నీళ్లు తాగాలి.

  • ఈ సర్జరీతో ముడిపడి ఉన్న ప్రతికూలతలు, అనుకూలతలను బేరీజు వేసుకుని, తప్పనిసరి పరిస్థితిలోనే బేరియాట్రిక్‌ సర్జరీని ఎంచుకోవాలి.

డాక్టర్‌. వరుణ్‌ రాజు,

లాప్రోస్కోపీ హెచ్‌ఓడి, జనరల్‌ అండ్‌ జిఐ సర్జరీ,

హైదరాబాద్‌.

Updated Date - 2022-11-10T06:10:11+05:30 IST