ఆ ఘనత నాది కాదు...

ABN , First Publish Date - 2022-07-18T06:26:06+05:30 IST

‘‘కుటుంబాల్లో మహిళలు అనుభవించే హింసనూ, పడే వేదననూ చాలా చిన్న వయసులోనే చూశాను.

ఆ ఘనత నాది కాదు...

‘వంటింట్లో పడుండక... వీధుల్లోకి ఎందుకు వచ్చావ’నే ఎగతాళి మాటలు...ప్రవర్తన మీదా, వ్యక్తిత్వం మీద నిందలు, అపహాస్యాలు. వీటన్నిటినీ తట్టుకొని... మహిళా సాధికారత కోసం తపించారు అనితా గుప్తా. యాభై వేలమందికి శిక్షణ, పదివేల మందికి ఉపాధి కల్పించారు. ఎందరికో ఆదర్శంగా నిలిచి, నారీశక్తి లాంటి పురస్కారాలను అందుకున్న అనిత స్ఫూర్తివంతమైన ప్రయాణం... ఆమె మాటల్లోనే...


‘‘కుటుంబాల్లో మహిళలు అనుభవించే హింసనూ, పడే వేదననూ చాలా చిన్న వయసులోనే చూశాను. ఆ దృశ్యాలు మనసులో శాశ్వతంగా ముద్ర పడ్డాయి. నా మార్గాన్ని అవే నిర్దేశించాయి. మా స్వగ్రామం బిహార్‌లోని భోజ్‌పూర్‌ జిల్లా అర్రాహ్‌. నా బాల్యంలోనే మా నాన్న మరణించారు. వేరే దిక్కు లేకపోవడంతో... నాతో, నా ఆరుగురు తోబుట్టువులతో మా తాతగారి ఊరికి మా అమ్మ చేరుకుంది. అప్పటికే మా అమ్మమ్మ చనిపోయింది. నా మేనమామలు ముగ్గురూ మరణించడంతో... మళ్ళీ పిల్లల్ని కనడం కోసం, తన అవసరాల కోసం మా తాత తనకన్నా చాలా చిన్న వయసున్న అమ్మాయిని డబ్బిచ్చి కొనుక్కున్నాడు. అమెకు సరిగ్గా తిండి పెట్టేవాడు కాదు. రోజూ కొట్టేవాడు. ఆమెను చూస్తే నాకు చాలా బాధనిపించేది. మా అమ్మకన్నా తక్కువ వయసున్న ‘కొత్త అమ్మమ్మ’ పేద కుటుంబానికి చెందినది కాకపోయినా, చదువుకున్నా తన కాళ్ళమీద తాను నిలబడేది  కదా! అనిపించేది. ఆమె మాత్రమే కాదు, మా చుట్టుపక్కల కుటుంబాల్లో చాలామంది మహిళల పరిస్థితి ఇదే. ఇవన్నీ పదేళ్ళ వయసున్న నన్ను ఆలోచనలో పడేసేవి. వాళ్ళ దుస్థితిని గమనించాక... బాగా చదువుకోవాలనీ, తోటి మహిళలకు అండగా నిలిచి, వారు సాధికారత సాధించడానికి దారి చూపించాలనీ నిర్ణయించున్నాను. చదువు పూర్తయ్యాక... ‘ఉద్యోగంలో చేరాలా? మహిళల కోసం ఏదైనా చెయ్యాలా?’ అనే ప్రశ్న తలెత్తినప్పుడు... సేవా కార్యక్రమాల వైపే నా మనసు మళ్ళింది. నా సోదరుడు సంతోష్‌ కుమార్‌ సాయంతో 1999లో ‘భోజ్‌పూర్‌ మహిళా కళా కేంద్ర’ను స్థాపించాను. అప్పుడే 300కు పైగా మహిళా స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేశాను. అయితే వాటిలో మహిళలను చేర్చడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆ ఇళ్ళలో పురుషులు ‘‘మా ఇంటికి ఎందుకొచ్చావ్‌? బయటికెళ్ళు’’ అని వీధిలోకి నెట్టినంత పని చేసేవారు. తమ ఇళ్ళలోని మహిళలతో ఒక్క నిమిషమైనా మాట్లాడనిచ్చేవారు కాదు. ఆ వ్యక్తులకు మహిళలు సంపాదించి, ఆర్థికంగా నిలదొక్కుకోవడం కానీ, తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడం కానీ ఇష్టం ఉండేవి కావు. ‘‘మా ఆడవాళ్ళు ముఖం మీద నుంచి ముసుగు తియ్యరు తెలుసా?’’ అనేవారు. చాలామంది నన్ను ఎగతాళి చేసేవారు. వంటింటికే పరిమితం కాకుండా... ధైర్యంగా బయటకు వచ్చి, పని చేస్తున్నందుకు నా ప్రవర్తన మీదా, వ్యక్తిత్వం మీదా నిందలు వేసేవారు. అశ్లీలంగా మాట్లాడేవారు. కానీ ఇవేవీ నన్ను వెనక్కు లాగలేదు. అయితే, వారు నన్ను అన్న మాటలు గుర్తొస్తే... ఇప్పటికీ రక్తం మరిగిపోతూ ఉంటుంది..


సాధికారత అంత సులువేం కాదు...

విద్య, ఆర్థిక స్వాతంత్రం ఎంత ముఖ్యమైనవో మహిళలకు తెలియజేయడం నా ప్రధానోద్దేశం. ‘‘మీరు ఎంతో కొంత సంపాదించుకోగలిగితే, మీ పిల్లలు మీలా బతకాల్సిన అవసరం ఉండదు. వాళ్ళను బడికి పంపవచ్చు. వారి జీవితాలు బాగుపడతాయి’’ అని నచ్చజెప్పాను. పితృస్వామ్య వ్యవస్థ పాతుకుపోయిన బిహార్‌ లాంటి రాష్ట్రంలో మహిళలకు సాధికారత కల్పించడం అంత సులువు కాదు. గ్రామస్తులు దుర్భాషలాడినా పట్టించుకోకుండా... నా ప్రయత్నాలను కొనసాగించాను. మెల్లగా మార్పు వచ్చింది. క్రమంగా మహిళలు ముందుకురావడం ప్రారంభించారు. అణగారిన మహిళల కోసం నేను పడుతున్న తపనను ఒక సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి గమనించి, ప్రోత్సహించారు. ‘భోజ్‌పూర్‌ మహిళా కళా కేంద్ర’ను ఒక సొసైటీగా రిజిస్టర్‌ చేయించారు. దీంతో ప్రభుత్వం నుంచి సహాయం పొందడానికి వీలు కలిగింది. దాంతో గ్రామీణ మహిళలకు హస్తకళల్లో శిక్షణ కార్యక్రమాలు చేపట్టాం. వారు చేసిన ఆభరణాలను వివిధ ఉత్సవాలు, మేళాల్లో విక్రయిస్తున్నాం. ఢిల్లీ, ముంబయి, పుణే తదితర నగరాల్లోని దుకాణాలకు కూడా సరఫరా చేస్తున్నాం. మా సంస్థ ద్వారా మా ప్రాంతంలోని మహిళలకు విద్యతోపాటు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కూడా కల్పించాం. తరువాత పొరుగు గ్రామాలకు విస్తరించాం. వాటి ద్వారా ఆరోగ్య తనిఖీ శిబిరాలు, వొకేషనల్‌ ట్రైనింగ్‌, వయోజన విద్య, నీటి వినియోగం, పారిశుధ్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. ఇప్పటివరకూ యాభై వేల మందికి పైగా మహిళలు మా సంస్థ నుంచి శిక్షణ పొందారు. పదివేల మందికి ఉపాధిని సృష్టించగలిగాం. కొన్ని స్వచ్ఛంద, కార్పొరేట్‌ సంస్థలు కూడా మాకు అండగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం మా సంస్థ కార్యకలాపాలు... బిహార్‌, ఝార్ఖండ్‌ రాష్ట్రాల్లోని 11 జిల్లాల్లో కొనసాగుతున్నాయి.


ఆ రోజులు గుర్తొస్తాయి...

ఈ ప్రయాణంలో నాకు ఎన్నో పురస్కారాలు లభించాయి. ‘నీతి ఆయోగ్‌’ నుంచి ‘ఉమెన్‌ ట్రాన్ఫార్మింగ్‌ ఇండియా’ పురస్కారం, కేంద్ర ప్రభుత్వం నుంచి ‘నారీ శక్తి ’ పురస్కారం కూడా వీటిలో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం రెండేళ్ళ క్రితం ప్రకటించిన ‘నారీశక్తి’ పురస్కారాన్ని ఈ ఏడాది రాష్ట్రపతి చేతులమీదుగా అందుకున్నాను. అయితే ఇదంతా నా ఘనత కాదు. మార్పు సాధించి, జీవితాన్ని చక్కగా తీర్చిదిద్దుకోవాలన్న మహిళల తపనే దీనంతటికీ కారణం. వేలాది మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్నావని ఎవరైనా ప్రశంసిస్తే... ఒకప్పుడు... ఇళ్ళలోకి రావద్దంటూ నా ముఖం మీదే తలుపులు వేసిన రోజులు గుర్తుకొస్తాయి. అలాంటి ఇళ్ళలో ఇప్పటికీ మగ్గిపోతున్న మహిళలకు చేయూతనివ్వాలనే నా సంకల్పం మరింత బలపడుతూ ఉంటుంది.’’

Read more