ఈ పరుగు ఆగదు

ABN , First Publish Date - 2022-02-23T05:30:00+05:30 IST

సామాజిక కట్టుబాట్లు గడప దాటనివ్వకపోయినా... వివాహ బంధం ప్రతిబంధకంగా మారినా... ఆమె పరుగు ఆగలేదు. పెళ్లయ్యి... ...

ఈ పరుగు ఆగదు

సామాజిక కట్టుబాట్లు గడప దాటనివ్వకపోయినా... వివాహ బంధం ప్రతిబంధకంగా మారినా... ఆమె పరుగు ఆగలేదు. పెళ్లయ్యి... బిడ్డకు తల్లయ్యి... మూడు పదులు దాటిన వయసులో మళ్లీ బరిలో దిగి... ఎన్నో జాతీయ అంతర్జాతీయ పతకాలు సాధించిన ‘ట్రాక్‌’ రికార్డ్‌ నీలూ మిశ్రాది.  ప్రస్తుతం తనలాంటి ఔత్సాహికులు... స్థోమత లేని అథ్లెట్లకు అండగా నిలిచి... వారిని మెరికల్లా తీర్చిదిద్దే బాధ్యతను భాజానికెత్తుకున్న నీలు... అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌గానూ సేవలు అందిస్తున్నారు. 


అది 1994. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి. మర్చంట్‌ నేవీ ఇంజనీర్‌ ఆనంద్‌ దుబెతో నీలూ మిశ్రా పెళ్లి జరిపించారు పెద్దలు. ఆ ఆనంద క్షణాలు ఆమె జీవితాన్ని ఊహించని మలుపు తిప్పాయి. ఎంతో కష్టపడి నిర్మించుకున్న ఆమె అథ్లెటిక్‌ కెరీర్‌ అర్థంతరంగా ఆగిపోయింది. కుటుంబ కట్టుబాట్ల నేపథ్యంలో అత్తింటివారు ఇక ‘ట్రాక్‌’లోకి వెళ్లొద్దన్నారు. చేసేది లేక నీలు ఇంటికే పరిమితమయ్యారు. ఏడేళ్ల తరువాత ఆమె ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా దిగజారింది. ఊబకాయం, ఆస్థమా, మధుమేహం, హైపర్‌టెన్షన్‌... ‘ఇక పరుగు అన్నది నా జీవితంలో లేద’నే నిర్ణయానికి వచ్చేశారు. 


కొడుకు స్ఫూర్తితో... 

నీలు కొడుకు ఆకా్‌షకు కిక్రెట్‌ అంటే పిచ్చి. అంత చిన్న వయసులో అతడికి ఆటపై ఉన్న మక్కువ చూసి ఆమె మంత్రముగ్ధులయ్యారు. ‘‘వాడు బ్యాట్‌ పట్టుకున్నప్పుడల్లా వదిలేసిన నా పరుగును గుర్తు చేస్తున్నట్టు అనిపించేది. మావారు కూడా నన్ను ప్రోత్సహించారు. వారిద్దరి ప్రేరణతో 35 ఏళ్ల వయసులో తిరిగి నా కెరీర్‌ ప్రారంభించాలని నిర్ణయించుకున్నా’’ అంటూ గతాన్ని గుర్తు చేసుకున్నా నీలు... ఆ తరువాత ఎనభైకి పైగా జాతీయ, అంతర్జాతీయ పతకాలు గెలుచుకున్నారు. ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతున్నా... వాటితో పోరాడుతూనే మైదానంలో పోటీపడ్డారు. ప్రస్తుతం ఆమె యువ అథ్లెట్లను తీర్చిదిద్దే పనిలో నిమగ్నమయ్యారు. ముఖ్యంగా ఆర్థికంగా వెనకబడినవారికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. 

ఓటర్లకు అవగాహన... 

నీలు అథ్లెటిక్స్‌తో పాటు ‘ఇంటిగ్రేటెడ్‌ చైల్డ్‌ డెవల్‌పమెంట్‌ స్కీమ్‌’ (ఐసీడీఎస్‌) కింద అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నారు. ప్రధాని మోది నియోజకవర్గమైన వారణాసిలో ‘భారత ఎన్నికల కమిషన్‌’కు బ్రాండ్‌ అంబాసిడర్‌గానూ వ్యవహరిస్తున్నారు. ‘సిస్టమేటిక్‌ ఓటర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ఎలక్టోరల్‌ పార్టిసిపేషన్‌’ (ఎస్‌వీఈఈపీ)పై ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుతం యూపీలో జరుగుతున్న ఎన్నికల్లో... ఓటు హక్కు వినియోగించుకొనేలా ఓటర్లను పోలింగ్‌ బూత్‌లవైపు నడిపిస్తున్నారు. అలాగే ట్రాన్స్‌జెండర్స్‌ కోసం ప్రత్యేకంగా పబ్లిక్‌ టాయిలెట్‌ ఉండాలని పట్టుబట్టి సాధించారు. అంతేకాదు... పలు ప్రభుత్వ పథకాలు నిజమైన లబ్ధిదారులకు అందేలా కృషి ్ఢ

చేస్తున్నారు.   


అథ్లెట్లకు మెరుగులు... 

నీలూ మిశ్రా టైమ్‌టేబుల్‌ ఖాళీ లేకుండా ఉంటుంది. గడప దాటి బయటకు వెళితే ఒక్క క్షణం తీరిక దొరకదు. ఇప్పుడామె ‘వారణాసి హాకీ అసోసియేషన్‌’, ‘వారణాసి అథ్లెటిక్‌ క్లబ్‌’, ‘జిల్లా రోయింగ్‌ అసోసియేషన్‌’లకు అధ్యక్షురాలు. ‘ఉత్తరప్రదేశ్‌ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌’కు జాయింట్‌ సెక్రటరీ. నిస్వార్థంగా, నిజాయతీగా స్థానిక ప్రతిభను నీలు ప్రోత్సహిస్తున్నారు. అత్యున్నత ప్రమాణాలతో శిక్షణనిస్తున్నారు. 


వాళ్ల ప్రోత్సాహంతోనే...

‘‘ఇరవయ్యేళ్ల కిందట నా జీవితంలో ఉన్నది భరించలేని బాధ మాత్రమే. దీర్ఘకాలంగా వాడిన యాంటిబయోటిక్స్‌ నా శరీరంపై తీవ్ర ప్రభావం చూపాయి. ట్రాక్‌లోకి మళ్లీ అడుగుపెడతానని కలలో కూడా అనుకోలేదు. అప్పటి నా పన్నెండేళ్ల కొడుకు నాలో స్ఫూర్తినింపాడు. వాడితోపాటు మావారి అండతో తిరిగి 2008లో పరుగు మొదలుపెట్టగలిగాను’’ అంటూ గుర్తు చేసుకున్నారు నీలు. మళ్లీ ‘ట్రాక్‌’లో పడడం కోసం ఆమె కొద్ది నెలల్లోనే దాదాపు పదిహేను కిలోల బరువు తగ్గారు. 100 మీటర్లు, 200 మీటర్లు హర్డిల్స్‌తో పాటు లాంగ్‌ జంప్‌, హైజంప్‌ పోటీల్లోనూ సత్తా చాటారు. జాతీయ, అంతర్జాతీయ వేదికల్లో పోడియం ఫిని్‌షలు ఎన్నో సాధించారు.
గర్వంగా ఉంటుంది...

‘‘అమ్మను చూసినప్పుడు నాకు ఎంతో గర్వంగా ఉంటుంది. 35 ఏళ్ల వయసులో మళ్లీ అథ్లెటిక్స్‌లోకి అడుగుపెట్టడమంటే సాధారణ విషయం కాదు. అందులోనూ వస్తూనే హైజం్‌పలో అమ్మ కాంస్య పతకం సాధించింది. అది నాకు అత్యంత మధురమైన ఘట్టం. ఆ పతకం గెలిచి వారణాసికి వచ్చినప్పుడు స్థానికులు అమ్మకు ఘనస్వాగతం పలికారు. ఆ దృశ్యాలు ఇంకా నా కళ్లల్లో మెదులుతున్నాయి’’ అంటాడు 26 సంవత్సరాలు నీలూ మిశ్రా కుమారుడు ఆకాష్‌. 

Read more