రాజ విరాగం

ABN , First Publish Date - 2022-11-24T22:36:31+05:30 IST

మధ్వ సంప్రదాయంలో శ్రీమధ్వాచార్యులు ఆది గురువు, జగద్గురువు. ఆయన ప్రపంచానికి పరిచయం చేసిన భగవత్‌ తత్త్వాన్ని, ఆయన కృతులను సిద్ధాంతాన్ని విశదీకరిస్తూ, విస్తరిస్తూ...

రాజ విరాగం

మధ్వ సంప్రదాయంలో శ్రీమధ్వాచార్యులు ఆది గురువు, జగద్గురువు. ఆయన ప్రపంచానికి పరిచయం చేసిన భగవత్‌ తత్త్వాన్ని, ఆయన కృతులను సిద్ధాంతాన్ని విశదీకరిస్తూ, విస్తరిస్తూ... ఎందరో దైవాంశ సంభూతులైన యతివరేణ్యులు ఉద్భవించారు. జయతీర్థ, పద్మనాభ తీర్థ, నరహరి తీర్థ, మంత్రాలయ రాఘవేంద్ర స్వామి లాంటి ఎందరో మహిమాన్వితులతో కూడిన మధ్వ పరంపరలో... శ్రీ మాదనూరు విష్ణుతీర్థులు ఒకరు. ఆయనను ‘అడవి ఆచార్యులు’, ‘అరణ్యకాచార్యులు’ అని కూడా వ్యవహరిస్తారు. ఆయన చేసిన రచనలలో ‘భాగవత సారోద్ధారం’ విలక్షణమైనది. అందులో 30 ప్రకరణలు ఉన్నాయి. ఆ ప్రకరణలకు విష్ణు తీర్థులవారు 30 పేర్లు నిర్ణయించడం వెనుక ఉన్న విశిష్టతే ఆ గ్రంథం ప్రత్యేకత. వాటిలో రెండవ ప్రకరణకు ఆయన పెట్టిన పేరు ‘రాజ విరాగ ప్రకరణ’. పరీక్షిత్‌కు కలిగిన వైరాగ్యానికి సంబందించి భాగవత శ్లోకాలన్నీ ఈ ప్రకరణలో పొందుపరచి ఉన్నాయి.

అత్యంత భాగవతోత్తముడైన పరీక్షిత్‌ రాజు... వేట నుంచి తన రాజభవనానికి వచ్చాక, శమీక ఋషి పట్ల తాను వ్యవహరించిన తీరు గుర్తుకువచ్చింది. తాను అహంకారంతో కళ్ళు మూసుకొనిపోయి, చచ్చిన పామును గాఢ తపస్సులో ఉన్న ఆ ఋషి మెడలో వేసివచ్చానని పరీక్షిత్తు వేదన చెందాడు. పశ్చాత్తాపంతో... ఆ క్షణమే అఖండమైన రాజ్యాన్ని, సంపదను, వైభవాన్ని త్యజించి ప్రాయోపవేశం చేయాలని నిశ్చయించుకున్నాడు. అంతలోనే శమీక ఋషి శిష్యులు వచ్చి... తమ గురుపుత్రుడైన శృంగి ఇచ్చిన శాపం గురించి తెలియజేశారు. మరొక వారం రోజులలో తక్షకుడి కాటుకు పరీక్షిత్తు మరణిస్తాడని చెప్పారు. ఇక ఆ ఏడు రోజులను వ్యర్థం చేయకూడదనుకున్న పరీక్షిత్‌... రాజ లాంఛనాలన్నిటినీ త్యజించాడు. నార వస్త్రాలు ధరించాడు. జటాధారియైు గంగా తీరానికి వెళ్ళాడు. ఇది పరీక్షిత్‌ రాజుకు కలిగిన వైరాగ్యం. అందుకే విష్ణుతీర్థులు ఆ ప్రకరణాన్ని ‘రాజ విరాగ ప్రకరణ’ అని పిలిచారు. ఈ పదానికి ‘రాజుకు కలిగిన వైరాగ్యం’ అని సాధారణ అర్థం. అయితే జాగ్రత్తగా గమనిస్తే.. వైరాగ్యం తాలూకు విశిష్టత అవగతం అవుతుంది. పరీక్షిత్‌ రాజుకు కలిగిన వైరాగ్యం కనుక ‘పరీక్షిత్‌ విరాగం’ లేదా ‘పరీక్షిత్‌ రాజవిరాగం’ అని పేరు నిర్ణయించవచ్చు. కానీ ‘రాజ విరాగం’ అనే ప్రయోగం చేశారు. దీని వెనుక ఔచిత్యాన్ని గ్రహించాలి. ‘రాజ’ అనే పదానికి ‘శ్రేష్టమైనది’ అనే అర్థం ఉంది. మనం ఒక ప్రదేశానికో ప్రవచనానికో వెళ్లి, అక్కడ సామాన్య వస్త్రాన్ని లేదా వస్తువును మరిచి వస్తే దాని పట్ల ఉదాసీనత చూపిస్తాం. మళ్లీ అంత దూరం వెళ్లి దాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నించం. ‘పోతే పోనీ’ అనుకుంటాం. ఇది సామాన్య వైరాగ్యం. అదే ఒక విలువైన పట్టు వస్త్రాన్ని లేదా బంగారు పాత్రను మరిచి వస్తే కూడా అదే స్థాయి ఉదాసీనత చూపిస్తే.. అప్పుడది రాజ విరాగం అవుతుంది. మన దగ్గర లక్ష రూపాయలు ఉన్నప్పుడు పది రూపాయలు దానం చేసివస్తే అది సామాన్య విరాగం. మన స్వార్థం చూసుకోకుండా దాచుకున్న మొత్తం సత్కార్యానికి, సద్భావనతో ఫలాపేక్ష లేకుండా దానం చేసి, దాన్ని మరిచిపోతే... అది రాజవిరాగం అనిపించుకుంటుంది. పరీక్షిత్‌ రాజుకు వచ్చిన ఈ విరాగం సామాన్యమైనది కాదు, అది శ్రేష్టమైనది అని తెలియచేసేందుకు ‘రాజ విరాగం’ అనే పదాన్ని విష్ణుతీర్థులు విశేషించి ఎన్నుకొన్నారు.

విరాగం, వైరాగ్యం అనే పదాలు ఒకే అర్థాన్ని ఇచ్చే శబ్దాలుగా పైకి కనబడినా, లోతుగా విశ్లేషించి చూస్తే... భగవంతుని ప్రార్థనలో ఏ పద ప్రయోగం భక్తుడికి మిక్కిలి ప్రయోజనకరంగా ఉంటుందో స్పష్టమవుతుంది. రాగం అంటే అభిమానం, ప్రేమ, కోరిక. విరాగము అంటే కోరిక, అభిమానం లాంటివి లేకపోవడం. వైరాగ్యం అన్నా ఇదే అర్థం వస్తుంది. ‘పూర్ణ వైరాగ్యం వచ్చింది అంటే కేవలం లౌకిక భోగ విషయాల పట్లనే కాదు... ఆధ్యాత్మిక విషయాల పట్ల కూడా’’ అని కొంతమంది కుతర్కం చేస్తారు. బహుశా అందుకే విష్ణు తీర్థులు ‘వైరాగ్యం’ అని కాకుండా ‘విరాగం’ అనే పదాన్ని వాడారని వ్యాసరాజ మఠ ప్రవచనకారులు విశ్లేషించారు. విరాగంలో ‘వి’ అనే శబ్దానికి ‘భగవంతుడు’, ‘భగవత్పరమైన విషయాలు’ అనే అర్థం వస్తుంది. ఈ దృష్టితో చూసినప్పుడు... ‘విరాగం’ అంటే భగవంతుని పట్ల రాగం, భగవత్‌ భక్తుల పట్ల రాగం, భగవత్‌ చింతన పట్ల రాగం... అంటే ఇష్టం, ప్రీతి కలిగి ఉండడం. అదేవిధంగా ‘విరాగం’ అంటే ‘వైరాగ్యం’ అనే అర్థం తీసుకున్నప్పుడు... ‘భగవతేతర వస్తువుల పట్ల, విషయాల పట్ల విగత రాగం... అంటే వైరాగ్యం కలిగి ఉండాలి’ అని స్పష్టత రావడానికి ‘విరాగం’ అని విష్ణుతీర్థులు ప్రత్యేకించి ప్రయోగించారు. అంటే భగవంతుని పట్ల రాగం, భగవతేతర లౌకిక విషయాల పట్ల వైరాగ్యం. పరీక్షిత్‌ రాజుకు వచ్చిన వైరాగ్యం సామాన్యమైనది కాదు. అది అతి విశిష్టమైనది. అందువల్లే దాన్ని ‘రాజ విరాగం’ అన్నారు. అది ఎంత విశిష్టమైనదంటే.. వ్యాసభగవానుల పుత్రుడు, రుద్రాంశ సంభూతుడైన శుకముని తనంతట తానుగా పరీక్షిత్‌ రాజు వద్దకు భగవదాజ్ఞను అనుసరించి వచ్చారు. అంతటి వైరాగ్యం మనలో కలిగినప్పుడు అత్యంత కరుణసాగరుడైన ఆ పరమాత్మ తనకు తానుగా అటువంటి గురువులను, యోగులను మన వద్దకు... మన యోగ్యతానుసారం పంపించి, మనల్ని ఉద్ధరిస్తాడు. శ్రీ మధ్వాచార్యులు తమ సూత్రభాష్యాలలో, అణువ్యాఖ్యానంలో ‘వైరాగ్యతో భక్తి ధార్డ్యః తేనాప్రోక్ష యథా భవేత్‌’ అంటారు. అంటే ‘వైరాగ్యం వస్తేనే మన భక్తి దృఢమవుతుంది’ అని అర్థం. ‘వైరాగ్యం’ అనే పునాది ఎంత దృఢంగా ఉంటే ‘భక్తి’ అనే సౌధం అంత స్థిరంగా ఉంటుంది. అది రాజ విరాగమై ఉండాలి. దాన్ని పొందాలని ప్రతి ఒక్కరు ఆపేక్షించాలి. అటువంటి రాజవిరాగమైన వైరాగ్యాన్ని పొందడానికి సద్గురువులను ఆశ్రయించాలి.

రవీంద్రనాథ్‌, శ్రీమధ్వ ప్రచార పరిషత్‌

Updated Date - 2022-11-24T22:36:31+05:30 IST

Read more