పొన్నియన్‌ స్వర్ణమే

ABN , First Publish Date - 2022-09-29T09:48:50+05:30 IST

ఆనాటి చరిత్రను ప్రముఖ దర్శకుడు మణిరత్నం ‘పొన్నియన్‌ సెల్వన్‌’గా తెరమీదకు ఎక్కించారు.

పొన్నియన్‌ స్వర్ణమే

భారతదేశ చరిత్రలో చోళరాజుల పాలన ఒక స్వర్ణయుగం. 

నాటి చరిత్రను ప్రముఖ దర్శకుడు మణిరత్నం ‘పొన్నియన్‌ సెల్వన్‌’గా తెరమీదకు ఎక్కించారు. ఈ పాత్రల చిత్రీకరణలో అత్యంత క్లిష్టమైనది వారి ఆభరణాల తయారీ. దీన్ని ఒక సవాల్‌గా తీసుకొని వేల ఆభరణాలను తయారుచేసిన సంస్థ... హైదరాబాద్‌కు చెందిన కిషన్‌దాస్‌ అండ్‌ కంపెనీ. ఈ ఆభరణాల తయారీ గురించి 


ఆ సంస్థ క్రియేటివ్‌ డైరక్టర్‌ ప్రతీక్ష ప్రశాంత్‌ ‘నవ్య’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలలోకి వెళ్తే...


ఈ చిత్రానికి ఆభరణాలు తయారుచేయటం అంత కష్టమంటారా?

చోళుల కాలం నాటి దుస్తుల గురించి కానీ, అప్పటి ప్రజలు ధరించే ఆభరణాల గురించి కానీ సమాచారం మన దగ్గర లేదు. ఎటువంటి పుస్తకాలు, స్కెచ్‌లు లేవు. ఆ కాలంలో నిర్మించిన ఆలయాలలో ఉన్న శిల్పాలే మనకు ఆధారం. అయితే ఈ సినిమా ప్రారంభించాలనుకున్నప్పుడు దర్శకుడు మణిరత్నానికి చెందిన మద్రాసు టాకీస్‌ సంస్థ... కొందరు చరిత్రకారుల దగ్గర నుంచి సమాచారాన్ని సేకరించింది. అదే విధంగా ఈ సినిమాకు మూలమైన రచయిత కల్కి కృష్ణమూర్తి పుస్తకం నుంచి కూడా కొన్ని స్కెచ్‌లను తీసుకోవటం జరిగింది. ఇది ఒక కోణం. ఇక ఆభరణాల తయారీకి వస్తే- ఆ కాలంలో ఆభరణాలు ఎలా ఉండేవో మనకు తెలియదు. రాజ వంశీకులు, ఉన్నతాధికారులు, ధనవంతులు బంగారు ఆభరణాలు ఽధరించేవారని తెలుసు. మధ్యతరగతి వారు వెండి ఆభరణాలు, సామాన్యులు రాగితో చేసిన చిన్న చిన్న ఆభరణాలు ధరించేవారనే ఊహతో ఈ ఆభరణాలు తయారుచేశాం. ఇక ఆభరణాలలో పొదిగిన రాళ్ల విషయానికి వస్తే- చోళుల కాలంలో ఇతర దేశాలతో వ్యాపార సంబంధాలు ఉండేవి. ఉదాహరణకు ప్రస్తుతం రంగూన్‌ నుంచి అనేక నౌకలు వచ్చి, పోతూ ఉండేవి. ఆ సమయంలో దాన్ని ‘బర్మా’ అని పిలిచేవారు. బర్మాలో రూబీలు చాలా ప్రసిద్ధి. వాటిని చోళులు కచ్చితంగా వాడి ఉంటారనే ఉద్దేశంతో... వాటిని ఎక్కువగా వాడాం. వజ్రాలు, ఎమరాల్డ్స్‌ తక్కువ ఉండేవి. అందువల్ల వాటిని కూడా తక్కువగా ఉపయోగించాం. ఈ సినిమాలో కనిపించేవన్నీ అసలైన బంగారు ఆభరణాలే!


ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?

ప్రతి సంస్కృతికి కొన్ని చిహ్నాలు ఉంటాయి. ఆ విషయంలో ఎటువంటి పరిస్థితిలోనూ తప్పు చేయకూడదు. ఉదాహరణకు చోళ రాజులు శైవ భక్తులు. వారు వైష్ణవ నామాలను, ఇతర చిహ్నాలను వాడే అవకాశమే లేదు. అందువల్ల ఆభరణాలపై వాడే చిహ్నాలలో పాములు, రకరకాల జంతువులు, పక్షులను ఎక్కువగా ఉపయోగించాం. ఇక ఈ సినిమాలో ప్రతి వ్యక్తికీ ఒక వ్యక్తిత్వం ఉంటుంది. వారు ఉపయోగించే ఆభరణాలు కూడా దానికి తగినట్లే ఉండాలి. ఉదాహరణకు చోళ రాజుల చిహ్నం సింహం. రాజులు కూడా చాలా శక్తిమంతులు. అందువల్ల వారి ఆభరణాలలో పులిగోర్ల తరహా డిజైన్లను ఉపయోగించాం. వారి కత్తుల మీద కూడా ఈ తరహా చిహ్నాలే ఉంటాయి. 


ఆభరణాల తయారీకి ఎలాంటి లోహాలు ఉపయోగించారు?

సమయంలో ఎవరెవరు ఎలాంటి ఆభరణాలు ధరించేవారో మనకు తెలియదు. కానీ ఆ సామ్రాజ్యం చాలా శక్తిమంతమైనది.. ఆర్థికంగా చాలా బలమైనది కాబట్టి- అందరు ప్రజలు ఆభరణాలు ధరించే ఉంటారు. అయితే మణి సార్‌ తీస్తున్నది ఒక డాక్యుమెంటరీ కాదు. ఆ కాలంలోని కొన్ని పాత్రల ఆధారంగా నిర్మిస్తున్న ఒక సినిమా. అందువల్ల ఈ ఆభరణాలు ఆకర్షణీయంగా ఉండాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మొత్తం పాత్రలను మూడుగా విభజించాం. సినిమాలోని ముఖ్యమైన 15 పాత్రలకు బంగారంతో చేసిన ఆభరణాలు రూపొందించాం. వారి పక్కన ఉండే దాసులు, ఇతర అధికారులకు వెండితో ఆభరణాలు చేశాం. ఇక చిత్రంలో కనిపించే ఇతర సామాన్యమైన ప్రజలకు రాగితో చేసిన ఆభరణాలు, తావీదుల లాంటివి రూపొందించాం. ఎందుకంటే వీరి సంఖ్య వందల్లో ఉంటుంది. అంతమందిని వెండి ఆభరణాలతో అలంకరించటం సాధ్యం కాదు. వీటన్నిటినీ చేతితోనే తయారుచేశారు. 


అతి ఖరీదైన నగలేవి?

పట్టాభిషేకం సమయంలో రాజు ధరించే హారం, ఆయన కిరీటం చాలా ఖరీదైనవి. అదే విధంగా ఐశ్వర్యారాయ్‌ (నందిని) పాత్రకు వేసిన నెక్ల్‌సలు, త్రిష (కుందవై) పాత్రకు వేసిన నగలు చాలా ఖరీదని చెప్పాలి. కొన్ని దృశ్యాల్లో వీరిద్దరు ఒకరికొకరు ఎదురపడే సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పుడు వీరు ధరించే రాజాభరణాల ఖరీదు చాలా చాలా ఎక్కువ. ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పాలి. రాణుల పాత్రకు వాడిన ఆభరణాలలో చాలా వైవిధ్యం కనిపిస్తుంది. ఒక పాత్రను పూర్తిగా అలంకరించాలంటే (పాపిడిబిళ్ల, చెంప స్వరాలు, ఉంగరాలు వంకీ, నెక్లె్‌సలు, గాజులు వడ్డాణం, కాళ్లకు పట్టీలు)... మొత్తం 25 ఆభరణాలు అవసరమయ్యాయి. ఇవి కూడా ఏ ఇద్దరికి ఒకే విధంగా ఉండకూడదు. మేము ఎంత ఖరీదు అవుతుందనే విషయాన్ని పట్టించుకోలేదు. 


మొత్తం ప్రాజెక్టుకు ఎంత సమయం పట్టింది?

మమ్యల్ని 2019 మార్చిలో వారు సంప్రదించారు. ఈ చిత్రానికి డ్రస్‌ డిజైనర్‌ ఏకా లఖానీ రిఫరెన్స్‌ మీద మద్రాసు టాకీస్‌ మమ్మల్ని సంప్రతించింది. అప్పటికి వారికి ఎలాంటి ఆభరణాలు కావాలో మాకు తెలియదు. దీనితో రకరకాల లుక్‌ టెస్ట్‌లు చేశాం.ఉదాహరణకు మా దగ్గర కొన్ని నెక్లె్‌సలు ఉన్నాయి. వాటిని వడ్డాణాలుగా కూడా వాడవచ్చు. ఈ సినిమా షూటింగ్‌ 2019, డిసెంబర్‌లో ప్రారంభమయింది. అప్పటి నుంచి ఆభరణాలను అందిస్తూ పోయాం. ఈ ప్రాజెక్టులో ఉన్న సంక్లిష్టత ఏమిటంటే- ప్రతి పాత్రకు సందర్భోచితంగా 10 నుంచి 12 లుక్స్‌ ఉంటాయి. వీటన్నింటికీ కావాల్సిన ఆభరణాలు అందించాలి. ఇక్కడ మణిసార్‌ గురించి కూడా చెప్పాలి. ఆయన చిన్న చిన్న విషయాల మీద కూడా చాలా శ్రద్ధ చూపిస్తారు. ఉదాహరణకు ఒక చీరకు పెట్టే క్లిప్‌ ఎలా ఉందనే విషయాన్ని కూడా గమనిస్తారు. 


మీరు ఎదుర్కొన్న సవాళ్లు ఏమిటి?

ఈ ఆభరణాలన్నీ చాలా బరువుగా ఉంటాయి. వాటిని ధరించటం చాలా కష్టం. అందువల్ల వాటిని వీలైనంత తేలికగా చేయటానికి ప్రయత్నించాం. అంతేకాకుండా కొన్ని చోట్ల ఆధునిక పద్ధతులను కూడా వాడాం. ఉదాహరణకు వడ్డాణాలను తీసుకుందాం. వాటిని నేరుగా పెడితే మచ్చలు పడే అవకాశముంటుంది. అందువల్ల వాటిని దుస్తులపైనే అమర్చటానికి ప్రయత్నించాం. ఆభరణాల తయారీలో అనేక ఆధునిక పద్ధతులు వచ్చాయి. వాటన్నిటినీ వాడుకున్నాం. ఇక మగవాళ్లు ధరించే ఆభరణాలు తయారుచేయటం పెద్ద సవాలనే చెప్పాలి. వీటిని ఎలా తయారుచేయాలో మాకు కూడా తెలియదు. ముందు కొన్ని డమ్మీ ఆభరణాలు చేసి, ఆ తర్వాత అసలైన ఆభరణాలు తయారుచేయాల్సి వచ్చింది. 


ఐశ్వర్య, త్రిషలకు లుక్‌ టెస్ట్‌లు చేశారా?

మణిసార్‌ ఈ విషయంలో చాలా శ్రద్ధ వహిస్తారు. ఈ పాత్రలపై షూటింగ్‌ చేసే ముందు,,, మేకప్‌, దుస్తులు, ఆభరణాలు... ఇలా అన్ని విభాగాలను ఒక చోటకు చేర్చి ఐశ్వర్య, త్రిష సహా ఇతర పాత్రధారులపై నాలుగైదు సార్లు లుక్‌ టెస్ట్‌ చేసిన తర్వాతే ప్రారంభించారు.

సివిఎల్‌ఎన్‌ ప్రసాద్‌


‘‘ఆభరణాలు మన సంస్కృతిలో ఒక భాగం. హరప్పా, మొహంజదారో నుంచి మన దేశంలో ఆభరణాలను ఉపయోగిస్తాం. మొదట్లో బంగారంతో చేసిన ఆభరణాలనే ఎక్కువ వాడేవారు. ఆ తర్వాతి కాలంలో ముత్యాలు, రత్నాలు, కెంపులు, మణులను వాడటం మొదలుపెట్టారు. మన చర్మపు రంగుకు వీటి రంగులు అదనపు  ఆకర్షణగా నిలుస్తాయి..’’

Read more