చదువే కాదు... సమాజమూ ముఖ్యమే!

ABN , First Publish Date - 2022-12-01T00:47:02+05:30 IST

డిగ్రీ ఒక్కటే కాదు... ఈ సమాజాన్ని కూడా చదువుతోంది 21 ఏళ్ల రిషిత జాలాది. వెనుకబడిన వర్గాల పిల్లలకు పాఠాలు చెబుతూ... లింగ సమానత్వం వంటి అంశాలపై అవగాహన కల్పిస్తూ... నేటి తరంలో చైతన్యం రగిలిస్తోంది.

చదువే కాదు... సమాజమూ ముఖ్యమే!

డిగ్రీ ఒక్కటే కాదు... ఈ సమాజాన్ని కూడా చదువుతోంది 21 ఏళ్ల రిషిత జాలాది. వెనుకబడిన వర్గాల పిల్లలకు పాఠాలు చెబుతూ... లింగ సమానత్వం వంటి అంశాలపై అవగాహన కల్పిస్తూ... నేటి తరంలో చైతన్యం రగిలిస్తోంది. ఇటీవల అమెరికాలో ‘ఎడ్యుకేషన్‌ అండ్‌ ఫ్యూచర్‌ ఆఫ్‌ వర్క్‌’ అంశంపై అధ్యయనం చేసే అరుదైన అవకాశం దక్కించుకున్న రిషిత... ‘నవ్య’తో ఆ విశేషాలు పంచుకుంది...

‘‘అవి నేను పదో తరగతి చదివే రోజులు. విజయవాడ దగ్గర గన్నవరంలోని సెయింట్‌ జాన్స్‌ హైస్కూల్‌. అప్పుడే కేంద్రం స్వచ్ఛభారత్‌ తీసుకువచ్చింది. అది నన్ను బాగా ఆకర్షించింది. ఆ స్ఫూర్తితోనే 2016 నుంచి సామాజిక సేవ మొదలుపెట్టాను. ఒక పక్క చదువుకొంటూనే ఆరేళ్లుగా దాన్ని కొనసాగిస్తున్నాను. విజయవాడ పక్కనే ఉన్న నిడమానూరు గ్రామం మాది. నాన్న నాన్న రామచంద్రరావు ఎల్‌ఐసీ ఏజంట్‌. అమ్మ రాజశ్రీ గృహిణి. తమ్ముడు సికిందర్‌ ఇంజనీరింగ్‌ చదువుతున్నాడు.

అలామొదలై...

‘స్వచ్ఛభారత్‌’ కార్యక్రమంలో భాగంగా తొలుత చుట్టుపక్కల ప్రాంతాలను పరిశుభ్రం చేశాను. ఇక అప్పటి నుంచి ఏదోఒక కార్యక్రమం చేస్తూ వస్తున్నా. విజయవాడ రైల్వే స్టేషన్‌కు ఎదురుగా గాంధీ హిల్‌... దానిపై గాంధీజీ నిలువెత్తు విగ్రహం ఉంటుంది. అక్కడి నుంచి చూస్తే నగరం మొత్తం మన పాదాల కింద ఉన్నట్టు ఉంటుంది. అదో అద్భుతమైన అనుభూతి. ఏటా ఆ కొండపై గాంధీ జయంతి నిర్వహిస్తారు. ఇక్కడ జరిగే సాంస్కృతిక కార్యక్రమాలకు అమ్మా నాన్న నన్ను తీసుకెళ్లేవారు. ఒకసారి అనుకోకుండా ఆ వేదికపై ప్రసంగించే అవకాశం వచ్చింది. ఆ ప్రసంగం విన్న రోటరీ క్లబ్‌ ప్రతినిధి కేశవరావు గారు నన్ను అభినందించారు. ‘మీ అమ్మాయి చాలా బాగా మాట్లాడుతోంది. మంచి స్పీకర్‌ అవుతుంది’ అని మా అమ్మా నాన్నలతో అన్నారు. తరువాత నుంచి రోటరీ క్లబ్‌ విజయవాడలో ఏ కార్యక్రమం నిర్వహించినా నా ప్రసంగం ఉండేది.

చదువుతూనే...

విద్యతో పాటు మన చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా అర్థం చేసుకోవడం అవసరం అనేది నా అభిప్రాయం. దీని కోసం ‘నెహ్రూ యువ కేంద్ర సంఘటన్‌, రోటరీ, లయన్స్‌ క్లబ్‌లు, ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ, వికాస వాహిని’లతో కలిసి పని చేయడం ప్రారంభించాను. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు కెరీర్‌, స్కిల్‌, ఎడ్యుకేషన్‌, పర్సనాలిటీ డెవల్‌పమెంట్‌ శిక్షణ ఇస్తున్నా. లైంగిక విద్య, లింగ సమానత్వం, డ్రగ్‌ ఎడిక్షన్‌ వంటి అంశాలపై అవగాహన తరగతులు నిర్వహిస్తున్నా. ఇవన్నీ నేను చదువుకొంటూనే చేస్తున్నా. ప్రస్తుతం నేను కేఎల్‌యూలో ఎంబీయే చదువుతున్నా.

మాటల్లో చెప్పలేను...

చిన్నప్పటి నుంచి నా చుట్టూ ఉన్నవారితో మమేకమవ్వడం, వారి స్థితిగతులు తెలుసుకోవడం వల్ల పలు అంశాలపై అవగాహన కలిగింది. ఏ వేదిక మీదైనా సరే అనర్గళంగా మాట్లాడుతున్నానంటే... అదే కారణం. నా జీవితంలో మరిచిపోలేని సందర్భం... గత ఏడాది ‘యూనివర్సల్‌ బేసిక్‌ ఇన్‌కమ్‌’ అంశంపై మన పార్లమెంట్‌లో ప్రసంగించడం. ‘నెహ్రూ యువ కేంద్ర సంఘటన్‌’ దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి యువతను ఎంపిక చేసి, పార్లమెంట్‌కు తీసుకెళ్లింది. అందులో నా ప్రసంగాన్ని ప్రధాని మోదీ అభినందించారు. ఆ మధురానుభూతిని మాటల్లో చెప్పలేను.

ఐదు లక్షలమందిలో...

విజయవాడ స్టెల్లా కాలేజీలో బీఎస్సీ మూడో సంవత్సరం చదువుతున్నప్పుడు ‘స్టడీ ఆఫ్‌ యునైటెడ్‌ స్టేట్స్‌ ఇనిస్టిట్యూషన్‌’ ఆధ్వర్యంలో వాషింగ్‌టన్‌ యూనివర్సిటీ నిర్వహించే ‘ఎడ్యుకేషన్‌ అండ్‌ ఫ్యూచర్‌ ఆఫ్‌ వర్క్‌ ఎక్స్చేంజ్‌ ప్రోగ్రామ్‌’ నోటిఫికేషన్‌ వచ్చింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశాను. ఐదు దశల్లో ఎంపిక ఉంటుంది. 2020-21లో కొవిడ్‌ వల్ల ఈ ప్రక్రియ అంతా వర్చువల్‌గా జరిగింది. మొదటి దశలో అమెరికన్‌ ఎంబసీ వాళ్లు కమ్యూనిటీ సర్వీస్‌, లాంగ్వేజ్‌ ఫ్లూయన్సీ, ప్రభుత్వం నుంచి ఎలాంటి గుర్తింపు వచ్చింది, ఇతర యాక్టివిటీలపై కొన్ని ప్రశ్నలు వేస్తారు. తర్వాత టెలిఫోనిక్‌ ఇంటర్వ్యూ. మూడో దశలో ఎంచుకున్న అంశంపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇవ్వాలి. రెలిజియస్‌, ప్లూరలిజం, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌, సివిక్‌ మేనేజ్‌మెంట్‌, ఎడ్యుకేషన్‌ అండ్‌ ఫ్యూచర్‌ అంశాలపై ప్రజంటేషన్‌ ఇచ్చాను. నాలుగో దశలో పర్సనల్‌ ఇంటరాక్షన్‌ కోసం ఎంబసీ ప్రతినిధులు మా కాలేజీకి వచ్చి, ఇంటర్వ్యూ చేశారు. చివరి దశలో మన డాక్యుమెంట్ల వెరిఫికేషన్‌ తరువాత సియాటెల్‌లో జరిగే ఎక్స్ఛేంజ్‌ ప్రోగ్రామ్‌కు ఎంపిక చేశారు. ఈ ప్రాజెక్టుకు దేశ వ్యాప్తంగా ఐదు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో నాతో కలిపి నలుగురిని ఎంపిక చేశారు.

విద్యా వ్యవస్థలపై అధ్యయనం...

మాకు యూఎస్‌ ప్రభుత్వ ప్రతినిధులు, యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌ ప్రొఫెసర్లు, నాన్‌ ప్రాఫిట్‌ ఆర్గనైజేషన్ల సీఈవోలు ఆన్‌లైన్‌లో క్లాస్‌లు తీసుకున్నారు. నవంబర్‌ 1 నుంచి 12 వరకు సియాటెల్‌లో నిర్వహించిన ఎక్ఛ్సేంజ్‌ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం వచ్చింది. అన్ని దేశాల్లో యువతలో నాయకత్వ లక్షణాలు పెంచడానికి రూపొందించిన కార్యక్రమం ఇది. అక్కడి ప్రభుత్వ, ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌ను సందర్శించాం. దాదాపుగా 40 దేశాల విద్యా వ్యవస్థలను అధ్యయనం చేసే అవకాశం ఈ ప్రోగ్రామ్‌ ద్వారా మాకు లభించింది.

మనదే ఉత్తమం...

అవన్నీ చూసిన తరువాత మన దేశంలోని విద్యా విధానమే నాకు ఉత్తమంగా అనిపించింది. సియాటెల్‌లోని స్కూల్స్‌లో క్లాస్‌రూమ్‌ యాక్టివిటీలు ఉంటాయి. అక్కడ క్లాస్‌రూమ్‌లు చాలా కలర్‌ఫుల్‌. విద్యార్థులు టీచర్లపై ఆధారపడరు. విద్యార్థులు ఏదో ఒక యాక్టివిటీని కచ్చితంగా సబ్జెక్టుగా తీసుకోవాలి. ఒక క్లాస్‌రూమ్‌లో వివిధ అంశాల్లో ప్రతిభావంతులైన విద్యార్థులను తయారు చేయడం దీని ముఖ్యఉద్దేశం. ప్రాక్టికల్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. మన దగ్గర ప్రతి విద్యార్థిపై ఉపాధ్యాయుల వ్యక్తిగత పర్యవేక్షణ ఉంటుంది. ఈ పరిస్థితి అమెరికాలో కనిపించదు. నా దృష్టిలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం 2020 అత్యుత్తమమైనది. కానీ ఇదిప్పటి వరకు అమలుకాపోవడం దురదృష్టకరం. ఇది ఆచరణలోకి వస్తే మన దేశ విద్యావిధానానికి తిరుగు ఉండదు.

అవార్డులూ వచ్చాయి...

విద్య, సామాజిక రంగాల్లో నా ప్రయత్నానికి మెచ్చి రాష్ట్ర ప్రభుత్వం 2018లో ‘జ్ఞానభేరి’ అవార్డునిచ్చింది. దీని కింద లక్ష రూపాయల నగదు అందుకున్నాను. ఆ మరుసటి ఏడాది గవర్నర్‌ నుంచి ప్రత్యేక ప్రోత్సాహక అవార్డు లభించింది. వీటితోపాటు మరికొన్ని పురస్కారాలు కూడా దక్కాయి. ఇవన్నీ నాకు ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయి.’’

గుడాల శ్రీనివాస, విజయవాడ

ఫొటోలు: చందు

Updated Date - 2022-12-01T00:47:44+05:30 IST