God's dream: ఈ సృష్టి దేవుడి స్వప్నం

ABN , First Publish Date - 2022-11-18T02:54:26+05:30 IST

అందరికీ కలలు రావడం వేరు. దేవుడు ఒక అందమైన కలగనడం వేరు. మనిషికి కలిగే కల నిజం కాకపోవొచ్చు. ఆ దేవుని కల నిజమైతే? ఆ అందాల స్వప్నమే ఈ వాస్తవిక జగత్తు... ఈ సృష్టి.

God's dream: ఈ సృష్టి దేవుడి స్వప్నం

దైవమార్గం

అందరికీ కలలు రావడం వేరు. దేవుడు ఒక అందమైన కలగనడం వేరు. మనిషికి కలిగే కల నిజం కాకపోవొచ్చు. ఆ దేవుని కల నిజమైతే? ఆ అందాల స్వప్నమే ఈ వాస్తవిక జగత్తు... ఈ సృష్టి. దేవుడు ఒక మహా కావ్యం రాశాడు. అత్యంత రహస్యమూ, క్లిష్టమూ అయిన ఆ కావ్యానికి ఈ సృష్టి... ఈ ప్రకృతి ఒక వ్యాఖ్యాన గ్రంథం. ఆయన మధురమైన, మహాద్భుతమైన మనసుకు ఈ జగత్తు ప్రతిబింబం.

దేవుడికి రూపం లేదంటారు కొందరు. ఆయన అంతటా ఉన్నాడంటారు మరికొందరు. ఇవి పరస్పర విరుద్ధమైన భావాలు కావా? ఆయన రూపం ఈ ప్రకృతి ద్వారా కనిపిస్తుంది. ఆయన మనసులోని మాట... ఈ ప్రకృతి ద్వారానే వినిపిస్తూ ఉంటుంది. అందుకే దేవుణ్ణి ‘జగత్స్వరూపుడు’ అంటారు. ప్రకృతి అంటే కంటికి కనిపించే దృశ్యాలు... అంటే నింగీ-నేల, పశు పక్ష్యాదులు, చెట్టు-చేమ, వాగు-వంక... ఇవి మాత్రమే కావు. కనిపించని మనో భావాలు కూడా ప్రకృతే. వీటన్నిటి ద్వారా దేవుడు మనతో అనునిత్యం మాట్లాడుతూనే ఉన్నాడు. ‘నిన్ను విడువను, ఎడబాయను’ అన్నప్పుడు, ‘.నా ఆత్మ మీ మధ్య ఉన్నది , భయమేల మీకు?’ అని అభయం ఇస్తున్నప్పుడు... దేవుడు అంతటా ఉన్నాడనే కదా అర్థం.

ఇక, దేవుడు కనిపించనివాడు అనుకోవడం వెర్రితనం. మంచి వ్యక్తుల ద్వారా కనిపిస్తూనే ఉంటాడు. మంచి కార్యాల ద్వారా మాట్లాడుతూనే ఉంటాడు. ఆయన ఈ ప్రకృతిలా అంతటా వ్యాపించాడని అనుకుంటే, ఈ అఖిల విశ్వం అంతా ఆయన నివాసమే అనుకుంటే... సృష్టి మొత్తం దైవ మందిరమే అవుతుంది. మరి ఈ ఆరాధనా మందిరాల సంగతేమిటి? ఇవి కేవలం ఆయనపై ఏకాంత దృష్టి పెట్టడానికి ఉద్దేశించిన ప్రదేశాలు. మనసు కేంద్రీకృతం కావడానికి , ఒంటరిగా దైవాన్ని ధ్యానించుకోవడానికి ఈ మందిరాలు కావాలి. అక్కడ సమావేశాలు, ఆరాధనలు జరుగుతాయి. ఇవన్నీ సామూహికంగా నిర్వహించేవి. ప్రార్థనలు సామూహికంగా, వ్యక్తిగతంగా... ఈ రెండు రకాలుగానూ సాగుతాయి.

‘దేవునితో మాట్లాడడం’ అనే ఏకాంత ప్రార్థన చాలా బలమైనది. అలాగే ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసే ఆచారం ఉంది. అది సదవగాహనను, సమైక్యతను, ఒకరిపట్ల మరొకరు సానుభూతిని , ప్రేమభావాన్ని పెంపొందించుకోడానికి దోహద పడుతుంది. అక్కడ గుమికూడిన ప్రజలు ఒకే జపం వల్లిస్తారు. ఒకే వాక్యం వింటారు. ఒక క్రమం పాటిస్తారు. వివిధ మనస్తత్వాలు ఒకే స్వరమై... సమైక్య భావనతో కనిపిస్తాయి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కలిసి ఒక చోట గుమికూడి తన గురించి, తన వాక్యం గురించి, చేయవలసిన సేవల గురించి, సాటి వ్యక్తిని ప్రేమించడం గురించి చర్చించుకుంటారో... ‘అక్కడ నేనుంటాను’ అని ప్రభువు చెప్పాడు. ఆయన తన సృష్టిలో తానే అందరిలా... తోటి సమాజంలా కనిపిస్తున్నాడు. ఆయన అంతటా ఉన్నాడు. కాబట్టి అందరూ ప్రేమ భావంతో మెలగాలి. అందరం ఆ దైవ సృష్టిలోని సమాన భాగస్థులం అనేది అర్థం చేసుకోవాలి. తదనుగుణంగా ప్రవర్తన మార్చుకోవాలి.

-డాక్టర్‌ దేవదాసు బెర్నార్డ్‌ రాజు

9866755024

Updated Date - 2022-11-18T02:54:27+05:30 IST