Shriji Maharaj: విశ్వాసమే రక్ష

ABN , First Publish Date - 2022-11-18T02:45:09+05:30 IST

ఉత్తరభారత దేశంలో శ్రీ స్వామినారాయణ్‌ భగవాన్‌ను శ్రీకృష్ణుడి అవతారంగా భక్తులు భావిస్తారు. శ్రీజీ మహరాజ్‌గా ఆరాధనలు అందుకుంటున్న ఆయన తన భక్తులను, శిష్యులను ఆపదలలో ఆదుకున్న కథలెన్నో ప్రచారంలో ఉన్నాయి.

Shriji Maharaj: విశ్వాసమే రక్ష

సద్బోధ

ఉత్తరభారత దేశంలో శ్రీ స్వామినారాయణ్‌ భగవాన్‌ను శ్రీకృష్ణుడి అవతారంగా భక్తులు భావిస్తారు. శ్రీజీ మహరాజ్‌గా ఆరాధనలు అందుకుంటున్న ఆయన తన భక్తులను, శిష్యులను ఆపదలలో ఆదుకున్న కథలెన్నో ప్రచారంలో ఉన్నాయి.

వాటిలో ఇది ఒకటి:

శ్రీజీ మహరాజ్‌కు దోసాభాయ్‌ అనే భక్తుడు ఉండేవాడు. అతను వ్యాపారి. ఒక రోజు దోసాభాయ్‌ ఇంటికి భగవాన్‌ అతిథిగా వచ్చారు. ఆయనకు దోసాభాయ్‌ దంపతులు ఘనంగా మర్యాదలు చేశారు.

‘‘నీ ఇంట్లో ఏమేమి ఉన్నాయి? నీకు ఎంత సంపద ఉందో అంతా బయటకు తీసుకురా’’ అన్నారు శ్రీజీ మహరాజ్‌. ఆ మాటలను శిరసావహిస్తూ తన దగ్గరున్న డబ్బునూ, బంగారు నగలనూ తీసుకువచ్చి, ఆయన ముందుంచాడు దోసాభాయ్‌.

‘‘వాటన్నిటినీ మూట కట్టు’’ అన్నారు మహరాజ్‌. ఆ తరువాత ‘‘ఆ మూటను నీ తలమీద పెట్టుకొని బయలుదేరు’’ అని ఆజ్ఞాపించారు. దోసాభాయ్‌ కానీ, అతని భార్య కానీ ఎందుకని ప్రశ్నించలేదు.

మహరాజ్‌ వెంట మూటతో దోసాభాయ్‌ నడిచాడు. వారిద్దరూ పట్టణంలోంచి ప్రయాణించి, శివార్లు దాటి, కొన్ని మైళ్ళ దూరంలో ఉన్న అడవిలాంటి ప్రాంతానికి చేరారు. అక్కడ పాడుపడిన ఒక బావి దగ్గర మహరాజ్‌ ఆగారు. ‘‘మూటను ఆ బావిలోకి విసిరెయ్‌’’ అన్నారు.

ఏమాత్రం సంకోచించకుండా... తన తలమీద ఉన్న మూటను ఆ బావిలోకి దోసాభాయ్‌ విసిరేశాడు.

మహరాజ్‌ నవ్వుతూ ‘‘నీ సంపదంతా నూతి పాలైపోయింది’’ అన్నారు.

‘‘మహరాజ్‌! అది నా సంపద కాదు, మీదే. అది నా గురువుది. నేను నా గురువుకి సేవకుణ్ణి మాత్రమే. గురువు చెప్పినట్టు చెయ్యడమే నా విధి. ఆ సంపదను మూట కట్టమన్నారు, కట్టాను. దాన్ని నూతిలో విసిరెయ్యమన్నారు. విసిరేశాను. అంతే!’’ అన్నాడు దోసాభాయ్‌.

‘‘సరే! ఇంటికి వెళ్దాం పద. రేపు మళ్ళీ వద్దాం. నూతిలోంచి ఆ మూటను తీసుకుందాం’’ అన్నారు.

‘‘మీ ఆదేశాన్ని శిరసావహిస్తాను మహరాజ్‌’’ అన్నాడు దోసాభాయ్‌

వారిద్దరూ తిరిగి వచ్చేసరికి... దోసాభాయ్‌ ఇల్లంతా చిందరవందరగా ఉంది. పెట్టెలన్నీ విరగ్గొట్టి ఉన్నాయి. అది చూసి దోసాభాయ్‌ ఆశ్చర్యపోయాడు.

‘‘మీరు వెళ్ళిన తరువాత మన ఊర్లో దొంగలు పడ్డారు. ప్రతి ఇంటినీ దోచుకున్నారు. బంగారం, డబ్బు, నగలు... అన్నీ పట్టుకుపోయారు. మన ఇంటికి కూడా వచ్చారు, పెట్టెలు బద్దలుగొట్టారు, అన్ని మూలల్లో వెతికారు. కానీ వాళ్ళకి ఏదీ దొరకలేదు’’ అన్నది దోసాభాయ్‌ భార్య.

తన గురువు ఇదంతా ఎందుకు చేశారో దోసాభాయ్‌కి అర్థమయింది.

మరునాడు గురువుతోపాటు నూతి దగ్గరకు వెళ్ళి, తన సంపద ఉన్న మూటను దోసాభాయ్‌ తిరిగి తెచ్చుకున్నాడు. ‘‘ఇదంతా మీ గొప్పతనమే మహరాజ్‌’’ అన్నాడు.

‘‘కాదు దోసాభాయ్‌! అది నీవు నా మీద ఉంచిన విశ్వాసం తాలూకు గొప్పతనం. నిన్ను రక్షించింది నీ విశ్వాసమే. ఎవరు దైవానికీ, గురువుకూ పూర్తి విధేయులై ఉంటారో... వారు దేనికీ విచారించవలసిన అవసరం ఉండదు’’ అన్నారు శ్రీజీ మహరాజ్‌.

Updated Date - 2022-11-18T02:48:57+05:30 IST