పశ్చాత్తాపంతోనే ప్రక్షాళన

ABN , First Publish Date - 2022-09-16T05:30:00+05:30 IST

మానవులు గతంలో చేసిన ప్రతి పాపానికీ... అది చిన్నదైనా, పెద్దదైనా... కచ్చితంగా పశ్చాత్తాపం చెందాలి. ఆ వ్యక్తి పాపం అతనికే పరిమితమై, వేరే వ్యక్తుల హక్కులకు ఎలాంటి భంగం కలిగించనిదైతే..

పశ్చాత్తాపంతోనే ప్రక్షాళన

మానవులు గతంలో చేసిన ప్రతి పాపానికీ... అది చిన్నదైనా, పెద్దదైనా... కచ్చితంగా పశ్చాత్తాపం చెందాలి. ఆ వ్యక్తి పాపం అతనికే పరిమితమై, వేరే వ్యక్తుల హక్కులకు ఎలాంటి భంగం కలిగించనిదైతే.. ఆ వ్యక్తి పశ్చాత్తాపాన్ని అల్లాహ్‌ అంగీకరిస్తాడు. అయితే ఏ పాపం చేశానని ఆ వ్యక్తి పశ్చాత్తాపం చెందుతున్నాడో... దానికి అతను పూర్తిగా స్వస్తి పలకాలి. జరిగిన పాపానికి అల్లాహ్‌ ముందు పశ్చాత్తాపం వ్యక్తం చెయ్యాలి. భవిష్యత్తులో ఇంకెప్పుడూ ఆ పాపం చెయ్యనని గట్టిగా నిర్ణయించుకోవాలి. పాప ప్రక్షాళన చేసేది పశ్చాత్తాపమే. ‘‘విశ్వాసులారా! మీరందరూ పశ్చాత్తాపభావంతో అల్లాహ్‌ వైపు మరలండి.


క్షమాభిక్ష కోసం అల్లాహ్‌ను వేడుకోండి. పశ్చాత్తాపంతో క్షమాపణ కోరుకొని, సత్యాన్ని విశ్వసించి, సదాచార సంపన్నుడై, సన్మార్గంలో జీవితాంతం నడిచే వ్యక్తిని నేను తప్పకుండా క్షమిస్తాను’’ అని ‘దివ్య ఖుర్‌ఆన్‌’లో అల్లాహ్‌ తెలిపారు. ‘‘నేను రోజుకు డెబ్భై కన్నా ఎక్కువసార్లు మన్నింపు నిమిత్తం అల్లా్‌హను వేడుకుంటాను. పాపాల గురించి పశ్చాత్తాపం చెందుతాను. ఒక మనిషి దగ్గర లోయనిండా బంగారం ఉన్నప్పటికీ, అతను దాంతో సంతృప్తి చెందకుండా, రెండోదాని కోసం అర్రులు చాస్తాడు. చివరికి మట్టి మాత్రమే అతని నోటిని నింపగలదు. తన పాపాలకు పశ్చాత్తాపం చెందేవాడి వైపు అల్లాహ్‌ మరలుతాడు. అతని పశ్చాత్తాపాన్ని అంగీకరిస్తాడు’’ అని దైవ ప్రవక్త మహమ్మద్‌ వివిధ సందర్భాల్లో వెల్లడించారు.                         


మహమ్మద్‌ వహీదుద్దీన్‌

Read more