దేవర కోసం జైత్రయాత్ర

ABN , First Publish Date - 2022-09-30T05:48:46+05:30 IST

ఆంధ్ర, కర్ణాటక సరిహద్దు గ్రామాల భక్త జనానికి ‘దసరా’ అనగానే గుర్తుకొచ్చేది దేవరగట్టు. ఇది రాక్షసులపై దేవతలు సాధించిన విజయానికి గుర్తుగా జరిపేజైత్రయాత్ర (బన్ని). నిశిరాత్రి వేళ... కాగడాల వెలుగులో...

దేవర కోసం జైత్రయాత్ర

ఆంధ్ర, కర్ణాటక సరిహద్దు గ్రామాల భక్త జనానికి ‘దసరా’ అనగానే గుర్తుకొచ్చేది దేవరగట్టు. ఇది రాక్షసులపై దేవతలు సాధించిన విజయానికి గుర్తుగా జరిపేజైత్రయాత్ర (బన్ని). నిశిరాత్రి వేళ... కాగడాల వెలుగులో... ‘డిర్ర్‌ర్ర్‌ర్ర్‌ గోపరాక్‌ (బహుపరాక్‌)’ అంటూ వేలాది మంది తమ ఇష్ట దైవం శ్రీమాళా సమేత మల్లేశ్వరస్వామి రక్షణార్థులై సాగించే ఈ మహోత్సవంలో కర్రలు ఖడ్గాల్లా విన్యాసాలు చేస్తాయి. నెత్తురు ధారలు కడుతుంది.


కర్నూలు జిల్లా ఆలూరు పట్టణానికి 15 కి.మీ దూరంలో దేవరగట్టులో కొలువైన దైవం శ్రీమాళ మల్లేశ్వర స్వామి. ‘దేవర’ అంటే దేవుడు. ‘గట్టు’ అంటే కొండ. ఈ ప్రాంతంలో దేవతలు నివసించేవారనీ, అందుకే దీనికి ‘దేవరగట్టు’ అనే పేరు వచ్చిందని పెద్దలు చెబుతారు. స్థల పురాణం ప్రకారం... త్రేతాయుగంలో ఇక్కడ నివసించే మునులు నిత్యం నిర్వహించే యజ్ఞయాగాదులతో ఈ క్షేత్రం విలసిల్లేది. మణిమల్లాసుర అనే రాక్షసుడు అసూయతో ఆ యజ్ఞాలను భగ్నం చేయడమే కాక ఋషులను హింసించేవాడు. ఆ రాక్షసుడి నుంచి తమకు రక్షణ కల్పించాలని వారు శివ, పార్వతులను వేడుకోగా... పార్వతీ సమేతుడైన శివుడు ఆ రాక్షసుడిపై యుద్ధం చేశాడు.. విజయదశమి రోజున అసురుడిని సంహరించి, విజయోత్సవ యాత్ర నిర్వహించాడు. ఆ విజయ యాత్రే... నేటికి భక్తులు నిర్వహించే ‘జైత్రయాత్ర’ (బన్ని) ఉత్సవమని పెద్దలు చెబుతారు. అయితే మరణం లేని ఆ రాక్షసుడు... శివుడి ఆజ్ఞతో మృత్యువును సమ్మతిస్తూనే... ఏటా తనకు నరబలి ఇవ్వాలని కోరాడట. దానికి సమ్మతించని శివుడు... విజయదశమి రోజున తన భక్తులలో (గొరవయ్యలు) ఒకరు పిడెకెడు రక్తం ధారపోస్తారని అభయం ఇవ్వడంతో రాక్షసుడు మరణించాడట. అప్పటి నుంచి విజయదశమి రోజున కర్రల సమరం కొనసాగుతోందని స్థలపురాణం చెబుతోంది.


ఆ ఆనవాయితీని అనుసరించి... దసరా రోజున నెరణికి, నెరణికి తాండ, కొత్తపేట గ్రామాల భక్తజనం అర్థరాత్రి వేళకు డొళ్లబండ వద్దకు చేరుకుంటారు.  అన్నదమ్ముల్లా ఉత్సవాలు దిగ్విజయం చేద్దామని ప్రమాణాలు చేసుకొని, దేవరగట్టు ఆలయానికి వస్తారు. పూజారులు శ్రీమాళ మల్లేశ్వరుల కల్యాణ మహోత్సవం నిర్వహించి, ఉత్సవ మూర్తులను పల్లకీలో కొండ దిగువన సింహాసన కట్ట వద్దకు చేర్చి, మహామంగళ హారతి ఇస్తారు. అప్పటికే  పలు గ్రామాల భక్తులు కర్రలు, కాగడాలతో సిద్దంగా ఉంటారు. వారి మధ్య బన్ని (కర్రల సమరం) మొదలవుతుంది. ఇష్టదైవం రక్షణార్థులై నెరిణికి, నెరిణికి తాండ, కొత్తపేట గ్రామస్తులు పల్లకి చుట్టు చేరుతారు. దేవుణ్ణి తమ వశం చేసుకోవాలని ఎల్లార్తి, సులావాయి, విరుపాపురం, అరికేర, అరికేర తాండ, బిలేహాలు, కురకుంద, ముద్దనగేరి గ్రామాల భక్తులు ఓ వర్గంగా ఏర్పడి వారిని అడ్టుకుంటారు. తమ చేతిలోని పట్టుడు కర్రను తలలపై గిర్రున తిప్పుతారు. కాగడాలను కాళ్లకు అడ్డంగా పెడతారు. ఆ సమయంలో పలువురికి కర్రలు తగిలి, తలలు పగిలి రక్తం చిందుతుంది.. దేవుడి కోసం పోటీ పడినా... సంప్రదాయం ప్రకారం నెరిణికి, నెరిణికి తాండ, కొత్తపేట గ్రామస్తులే దేవుడి సంరక్షణలో విజయం సాధించడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం. తలకు ఎంత పెద్ద గాయమైనా దేవుని ‘బండారు’ (పసుపు) రాసుకుంటే తగ్గిపోతుందని వారి విశ్వాసం. బండారు చల్లుకుంటూ అటవీ ప్రాంతంలోని రక్షపడ వరకూ ఉత్సవమూర్తుల పల్లకితో సహా వారు చేరుకొని పూజలు చేస్తారు. రక్షపడ దగ్గర నెరణికి గ్రామానికి చెందిన గొరవయ్య ఒకరు కాలికి రంధ్రం చేసుకొని, 16 మీటర్ల నులక (దారం) ఆ రంధ్రంలో దూర్చి రక్తార్పణం చేస్తారు. భక్తులు బన్నికట్ట చేరుకొని, జమ్మి వృక్ష పూజలు చేసి, మరుసటి రోజు ఉదయం బసవన్న గుడికి వస్తారు. ఆలయ ప్రధాన పూజారి కార్ణీకం (దైవవాణి) వినిపిస్తారు. అనంతరం పల్లకి సింహాసన కట్ట పైకి చేర్చడంతో జైత్రయాత్ర ముగుస్తుంది. 25 కిలోమీటర్ల దట్టమైన అడవుల్లో, కారుచీకట్లలో కాలినడకన ఈ ఉత్సవం నిర్వహించడం ఆచారం. విద్యావంతులు, ఉన్నతోద్యోగులు సైతం కర్ర చేతపట్టి బన్నీ ఆడుతారు. ఇక్కడి వారు ఎక్కడ స్థిర పడినా ఈ ఉత్సవాలకు దేవరగట్టుకు చేరుకుంటారు. ఉత్సవాలకు కీలకమైన గ్రామాల ప్రజలు... ఉత్సవ దినాల్లో మద్య, మాంసాలకు, దాంపత్య జీవనానికి దూరంగా ఉంటారు. 



పది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు నేటి నుంచి (శుక్రవారం) ప్రారంభవుతాయి. అక్టోబరు అయిదున విజయదశమి నాడు కళ్యాణోత్సవం, జైత్రయాత్ర, రక్త తర్పణం, శమీవృక్ష పూజ, ఆరున దైవ వాణి, ఏడున మహా రథోత్సవం ప్రధాన కార్యక్రమాలు. అక్టోబరు తొమ్మిదిన శ్రీమాళా సహిత మల్లేశ్వర స్వామిని నెరణికి గ్రామం చేర్చడంతో ఉత్సవాలు ముగుస్తాయి.


గోరంట్ల కొండప్ప, కర్నూలు

ఫోటోలు: ఇ.నాగరాజు గౌడ్‌, హోళగుంద

Updated Date - 2022-09-30T05:48:46+05:30 IST