Guru Nanak Jayanti: పాలు-నెత్తురు

ABN , First Publish Date - 2022-11-04T05:22:54+05:30 IST

సిక్కుల తొలి గురువైన గురునానక్‌ తరచూ దేశ సంచారం చేసేవారు. నానక్‌ వెంట బాలా, మర్దానా అనే అనుయాయులు ఉండేవారు. ఒకసారి వారు పర్యటన చేస్తూ... విశ్రాంతి కోసం ఒక మారుమూల గ్రామంలో ఆగారు. నానక్‌ రాక గురించి తెలుసుకున్న ప్రజలు ఆయనను దర్శించుకోవడానికి తండోపతండాలుగా వచ్చారు.

Guru Nanak Jayanti: పాలు-నెత్తురు
Guru Nanak Jayanti

సద్బోధ

8న గురునానక్‌ జయంతి

సిక్కుల తొలి గురువైన గురునానక్‌ తరచూ దేశ సంచారం చేసేవారు. నానక్‌ వెంట బాలా, మర్దానా అనే అనుయాయులు ఉండేవారు. ఒకసారి వారు పర్యటన చేస్తూ... విశ్రాంతి కోసం ఒక మారుమూల గ్రామంలో ఆగారు. నానక్‌ రాక గురించి తెలుసుకున్న ప్రజలు ఆయనను దర్శించుకోవడానికి తండోపతండాలుగా వచ్చారు. వారిలో చిన్న పనులు చేస్తూ జీవించే నిరుపేద అయిన లాలో కూడా ఉన్నాడు. నానక్‌ బోధలు విన్న లాలో... ఆయనకు ఆతిథ్యం ఇవ్వాలనుకున్నాడు. అతను నానక్‌ను సమీపించి, ‘‘బాబాజీ! మీ దర్శనంతో నా జన్మ పునీతం అయింది. మీరు నా ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించాలి’’ అని కోరాడు.

ఆ కోరికను నానక్‌ మన్నిస్తూ... లాలో ఇంటికి వెళ్ళారు. రొట్టెలు, పప్పు, అన్నం, పెరుగుతో సాధారణమైన భోజనాన్ని లాలో భార్య వడ్డించింది. నానక్‌, ఆయన అనుయాయులూ సంతృప్తిగా భోజనం చేశారు. ఆ తరువాత లాలో దంపతులను ఆశీర్వదించి, తన బసకు నానక్‌ వెళ్ళిపోయారు.

అదే గ్రామంలో మాలిక్‌ భాగో అనే సంపన్నుడు ఉన్నాడు. ఆ ప్రాంతానికి పాలనాధికారి కూడా అయిన అతను స్వార్థపరుడు, అహంకారి. ప్రజలను వేధిస్తూ ఉండేవాడు. కానీ ఏడాదికి ఒకసారి దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి పెద్ద ఉత్సవం నిర్వహించేవాడు. ఆ సమయంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచీ తెప్పించిన అపురూపమైన పదార్థాలతో వంటలు చేయించి, సంతర్పణ జరిపించేవాడు. తమ ఊరికి నానక్‌ వచ్చినట్టు తెలుసుకున్న భాగో... తన ఇంటికి విందుకు రావాల్సిందిగా సేవకుడితో కబురు పంపించాడు.

‘‘నేను రాలేనని చెప్పు’’ అన్నారు నానక్‌.

ఆ సేవకుడు భయపడుతూ ‘‘అయ్యా! నాతో మీరు విందుకు రాకపోతే నా యజమాని నన్ను తీవ్రంగా దండిస్తారు’’ అని చెప్పాడు.

ఒక్క క్షణం ఆలోచించిన నానక్‌ ‘‘సరే, పద’’ అన్నారు.

భాగో ఇంట్లో రకరకాల వంటలను సిద్ధం చేశారు. నానక్‌ను ఆహ్వానించి వడ్డించారు. అయితే ఒక మెతుకైనా ఆయన ముట్టలేదు.

అంతకుముందు రోజే లాలో ఇంటికి నానక్‌ వెళ్ళి, కడుపారా భోజనం చేసినట్టు భాగో విని ఉన్నాడు. తన ఇంట ఆయన భోజనం చేయకపోవడం అవమానంగా భావించి, ఆగ్రహంతో ‘‘బాబా! ఇన్ని పదార్థాలున్నా ఏదీ మీరు ఎందుకు తినడం లేదు? ఇవన్నీ ఎంతో రుచికరమైన, ఎంతో ఖరీదైన పదార్థాలు. నిన్న తక్కువ జాతి వాడి ఇంట్లో తిన్న నాసిరకం భోజనం కన్నా ఇది తీసిపోయిందా?’’ అని ప్రశ్నించాడు.

‘‘ఎందుకు తినలేదో నీకు చూపిస్తాను’’ అన్నారు నానక్‌. అక్కడ ఉన్న వారిలో ఒకరిని పిలిచి... లాలో ఇంట్లోంచీ ఏవైనా పదార్థాలు తీసుకురమ్మని చెప్పారు. అలా తెచ్చిన వాటిలో రొట్టెను ఒక చేత్తో తీసుకున్నారు. భాగో విందు భోజనం లోంచీ ఒక రొట్టెను మరో చేత్తో తీసుకున్నారు. వాటిని పిండడం మొదలుపెట్టారు. లాలో రొట్టె నుంచి పాలు కారుతున్నాయి. భాగో రొట్టె నుంచి రక్తం చిమ్ముతోంది. అది చూసి అందరూ దిగ్ర్భాంతి చెందారు.

అయినా అహంకారం తగ్గని భాగో ‘‘ఇంతకీ మీరేం చెప్పదలచుకున్నారు?’’ అని అడిగాడు వెటకారంగా.

‘‘లాలో కష్టపడి పని చేస్తున్నాడు. నిజాయితీగా సంపాదిస్తున్నాడు. అతని భార్య ప్రేమగా వండి, భక్తితో వడ్డించింది. ఆధ్యాత్మిక జీవనం గడిపే నాలాంటి వాడికి ఆ ఆహారం పాలలాంటిది. ఇక నీ ఇంట్లో నీ సేవకులు భయంతో వంట చేశారు. ఏదైనా పొరపాటు జరిగితే నువ్వేం చేస్తావోననే ఆందోళనతో వడ్డించారు. అందుకే నీ ఇంటి భోజనం నెత్తుటి కూడు. ప్రేమతో, భక్తితో పెట్టే ఆహారం... అమృతం లాంటిదని గుర్తించు’’ అని హితోపదేశం చేశారు నానక్‌.

ఆ మాటలతో భాగో కళ్ళు తెరుచుకున్నాయి. ఏడాది పొడుగునా ప్రజల్ని వేధిస్తూ, భయపెడుతూ... ఒక్క రోజు ఉత్సవాలు, విందులు చేస్తే దేవతలు మెచ్చరని గ్రహించాడు. ప్రతి ఒక్కరినీ సమానంగా చూడడం ప్రారంభించాడు. జీవితాంతం నానక్‌ చూపిన మార్గంలో పయనించి... మంచివాడనే పేరు తెచ్చుకున్నాడు.

Updated Date - 2022-11-04T16:14:47+05:30 IST
Read more