భయం ఎవరికంటే...

ABN , First Publish Date - 2022-09-16T05:30:00+05:30 IST

ఆ రోజుల్లో బౌద్ధ భిక్షువులు కొందరు ఒంటరిగా అడవుల్లో, కొండ గుహల్లో ఉంటూ ఉండేవారు. అలా ఉండేవారిలో కొందరు ఒంటరితనానికి భయపడి, తిరిగి వచ్చేసేవారు. అక్కడ ఉండే ప్రశాంతత, నిశ్శబ్దం కూడా వారిని భయపెట్టేవి.

భయం ఎవరికంటే...

ఆ రోజుల్లో బౌద్ధ భిక్షువులు కొందరు ఒంటరిగా అడవుల్లో, కొండ గుహల్లో ఉంటూ ఉండేవారు. అలా ఉండేవారిలో కొందరు ఒంటరితనానికి భయపడి, తిరిగి వచ్చేసేవారు. అక్కడ ఉండే ప్రశాంతత, నిశ్శబ్దం కూడా వారిని భయపెట్టేవి. ఇంకా రకరకాల భయాలు వారిని వెంటాడేవి. కానీ కొందరు అక్కడ నిర్భయంగా గడిపి, ఎనలేని ప్రశాంతతను పొందివచ్చేవారు. బుద్ధుడు భయరహితుడు. భయం అనేది ఆయన దరిదాపులకు కూడా వచ్చేది కాదు. వందమందిని హతమార్చిన అంగుళీమాలుని దగ్గరకు... ఆ నిర్భయత వల్లనే ఒంటరిగా వెళ్లాడు. బుద్ధుడి నిర్భీతి చూసి అంగుళీమాలుడే భయపడ్డాడు.


శ్రావస్తి సమీపంలో అనాథపిండికుడు నిర్మించి, బహూకరించిన జేతవనంలో ఒకసారి బుద్ధుడు ఉన్నాడు. అప్పుడు జానుస్సోణుడు అనే పండితుడు ఆయన దగ్గరకు వచ్చాడు. వారిద్దరూ సంభాషించుకుంటూ ఉండగా... ఒక భిక్షువును తీసుకొని... కొందరు భిక్షువులు బుద్ధుని దగ్గరకు వచ్చారు. ఆ భిక్షువు అడవి నుంచీ భయంతో తిరిగి వచ్చిన విషయం చెప్పి, వారందరూ ఒక పక్కన కూర్చున్నారు. 


ఇది చూసిన జానుస్సోణుడు ‘‘భగవాన్‌! మీ ధర్మాన్ని విని ఎందరో భిక్షువులుగా మారుతున్నారు. వారిలో కొందరు అరణ్యాలలో ఏకాంతవాసం చేస్తున్నారు. ఒంటరిగా అడవుల్లో ఉండడం చాలా కష్టం కదా! భయపడడం సహజమే కదా! భయపడుతూ ఉన్నవారు సంతోషంగా ఎలా గడపగలరు? సాధన ఎలా సాగించగలరు?’’ అని అడిగాడు.


అప్పుడు బుద్ధుడు ‘‘జానుస్సోణా! కొందరు మాత్రమే భయపడతారు. కొందరు భయపడకుండా ఉంటారు. ఏకాగ్రత సాధిస్తారు’’ అన్నాడు.

‘‘భగవాన్‌! ఎవరు భయపడతారు? ఎవరు భయపడరు? వివరించండి’’ అని ప్రార్థించాడు జానుస్సోణుడు.


‘‘అపరిశుద్ధ కర్మలు ఎవరు చేస్తారో వారు భయపడతారు. చేయనివారు భయపడరు. భయం ఎరుగరు. జానుస్సోణా! లోభి, కామ దురాచారి, ద్రోహి, దుష్ట స్వభావి, సోమరి, స్థిరత్వం లేనివాడు, అశాంతితో గడిపేవాడు, నిశ్చితమైన అభిప్రాయం లేని ద్వైదీభావి, అనుమానపు రోగి, తన గొప్ప తాను చెప్పుకుంటూ... ఇతరుల్ని నిందించేవారు, సత్కార్యాలమీద ఆశ, కీర్తి కండూతి కలవారు, పరిపూర్ణ జ్ఞానం లేనివారు, చపల చిత్తులు, నిగ్రహంలేని కోపధారులు, బుద్ధిహీనులు, గొర్రెలా తోక వెనుకే ఉండిపోయేవారు... వీరంతో ఎప్పుడో ఒకసారి, ఎక్కడో ఒకసారి భయపడతారు. వీరి జ్ఞానం, జీవన విధానం, ప్రవర్తన... మనో వ్యాకులతను కలిగించి భయపెడతాయి. చివరకు తమను చూసి తామే భయపడతారు. ఇలాంటివారు నిర్భయంగా బతకలేరు. ఏకాగ్రత సాధించలేరు’’ అన్నాడు.


అరణ్యంలో క్రూరమృగాలకో, విష జంతువులకో లేదా ప్రకృతి ప్రకోపాలకో భయపడతారని అనుకొనే జానుస్సోణునికి అసలు భయం అనేది మన ప్రవర్తన, మన నడతలోనే ఉందని అర్థమైంది. మెరుగైన జీవన విధానం ఎంత ధైర్యాన్ని ఇస్తుందో కూడా తెలిసింది. కత్తిని చేపట్టిన మహారాజుల కన్నా... కరుణను చేపట్టిన బుద్ధుడు ఎంతటి ధైర్యశాలో కూడా తేటతెల్లం అయింది. 


బుద్ధుడు ఎప్పుడూ చెప్పే కథనే అక్కడ ఉన్న భిక్షువులకు మరోమారు చెప్పాడు. ఆ కథ ఇది:

ఒక తాటి వనంలో ఒక కుందేలు ఉంది. అది ఒక రోజు చాలా భయపడింది. వచ్చి ఓ తాటి చెట్టు కింద పొదలో పడుకుంది. దానికి మాగన్నుగా కునుకు పట్టింది. అంతలో పెద్ద శబ్దం వినపడడంతో, లేచి పరుగులు తీసింది. దారిలో నక్క దాన్ని ఆపి ‘‘ఎందుకు అంత భయంగా పరుగులు తీస్తున్నావు?’’ అని అడిగింది.

 

‘‘అక్కడ భూమి బద్దలైంది’’ అని చెప్పింది కుందేలు.

‘‘అలాగా’’ అంటూ నక్క పరుగు పెట్టింది. 

ఆ తరువాత వాటికి దారిలో జింక, ఎద్దు, గుర్రం, ఖడ్గమృగం, ఏనుగు... ఇలా చాలా జంతువులు ఎదురయ్యాయి. ‘భూమి బద్దలైపోయింది’ అనే మాట విని అన్నీ పరుగులు తీశాయి. అడవిలో జంతువులన్నీ అలా భయంతో పరుగు పెట్టడం మృగరాజైన సింహం చూసింది. ఆ జంతువులు అడవి చివర ఉన్న లోయవైపు పోతున్నాయి. అవి లోయలో పడి చనిపోతాయేమోనని... 


ఆ సింహం పరుగు పరుగున వచ్చి వాటిని ఆపింది. విషయం అడిగింది. 

‘‘భూమి బద్దలైపోయిందట’’ అంది ఏనుగు.

‘‘నీవు చూశావా?’’ అని అడిగింది సింహం.

‘‘లేదు. నాకు ఖడ్గమృగం చెప్పింది.’’

‘‘నాకు గుర్రం చెప్పింది’’ అంది ఖడ్గమృగం.


ఇలా... చివరికి కుందేలు వంతు వచ్చింది. ‘‘నాకు నిద్దట్లో పెద్ద శబ్దం వినిపించింది. భూమి బద్దలైందేమో అనుకున్నాను. భయంతో పరుగులు తీశాను’’ అని చెప్పింది కుందేలు.

జంతువులన్నిటినీ వెంటబెట్టుకొని, కుందేలు నిద్రపోయిన చెట్టు దగ్గరకు వెళ్ళింది సింహం. అక్కడ చూస్తే... ఎండిపోయిన తాటాకు మీద తాటికాయ రాలి పడింది... అంతే!


‘‘మనో వ్యాకులత ఉండి, సరైన జ్ఞానం, విచక్షణ లేకపోవడం వల్లే ఈ భయం’’ అని చెప్పాడు బుద్ధుడు. ‘భయం’ అనేది మనసులో పుట్టేదే కానీ బయట నుంచి వచ్చిపడేది కాదని ఆ భిక్షువుకు అర్థమైంది. తనను తాను సంస్కరించుకొని, ఈసారి నిర్భీతిగా వెళ్ళి... ఏకాగ్రత సాధించాడు.             


బొర్రా గోవర్ధన్‌

Read more