పాప కోసం కాలి ఎముకనిచ్చిన అపర శిబి... ఓంకార్ స్వామి

ABN , First Publish Date - 2022-09-11T14:04:07+05:30 IST

ఓంకార్ స్వామీజీ తన శరీరం నుంచి కాలి వెముకను దానం ఇచ్చారు.

పాప కోసం కాలి ఎముకనిచ్చిన అపర శిబి... ఓంకార్ స్వామి

ఎవరీ ఓంకార్ స్వామి? యుగాలనాటి శిబి చక్రవర్తికి ఈయనకి పోలికేంటి? ఒక బాలిక కోసం కాలి ఎముక దానం చేసిన ఓంకార్ స్వామి గురించి తెలుసుకునే ముందు పావురాన్ని కాపాడేందుకు తనని తాను అర్పించుకునేందుకు సిద్ధపడిన శిబి చక్రవర్తి గురించి ముందుగా తెలుసుకుందాం.


శిబి చక్రవర్తి గొప్ప దాత, దయా గుణం కలవాడు. అతని దయా గుణం గురించి విని ఇంద్రుడు శిబి చక్రవర్తిని పరీక్షించాలనుకున్నాడు. ఒకరోజు కూర్చుని ఉన్న శిబి చక్రవర్తి ఒడిలోకి ఒక పావురం వచ్చి వాలింది. "నన్ను ఒక డేగ తరుముకొస్తుంది. నాకు ప్రాణభిక్ష పెట్టు" అని దీనంగా వేడుకుంది. శిబి చక్రవర్తి పావురాన్ని ప్రేమగా నిమురుతూ, "నిన్ను కాపాడే బాధ్యత నాది." అని హామీ ఇచ్చాడు. అంతలో అక్కడికి డేగ వచ్చి." మహారాజా! ఈ పావురం నా ఆహారం. తప్పించుకుని మీ శరణుజొచ్చింది. దానిని నాకు వదలిపెట్టండి" అంది.


"ఈ పావురానికి నేను అభయమిచ్చాను. ఆడినమాట తప్పను. నీ ఆకలి తీరడానికి ఏ ఆహారం కావాలో చెప్పు. పావురాన్ని మాత్రం వదలను. శరణన్న వారిని రక్షించటం రాజ ధర్మం" అన్నాడు.


"నేను కోరిన ఏ ఆహారమైనా ఇస్తారా?... అలాగైతే నీ శరీరం నుంచి పావురమంత మాంసాన్ని కోసివ్వు" అంది డేగ. శిబి చక్రవర్తి  పదునైన కత్తితో తన శరీరం నుంచి మాంసాన్ని కోసి త్రాసులో వేశాడు. అది పావురం బరువుకు సరికాలేదు. మరింత మాంసం కోసి వేశాడు. అయినా సరిపోలేదు. రాజు శరీరం రక్తమోడుతోంది. చివరకు పళ్ళెంలో తానే కూర్చుని, తనను తానే సమర్పించుకున్నాడు.


అప్పుడు ప్రత్యక్షమయ్యారు - ఇంద్రుడు, అగ్ని. "రాజా! నీ దానగుణం నిరుపమానం. నీవంటి ఉత్తముడు ఇంతవరకూ పుట్టలేదు. నీ ఔదార్యాన్ని పరీక్షించడానికి నేను డేగగా, అగ్ని పావురంగా వచ్చాము. నీ కీర్తి చిరస్థాయిగా వర్ధిల్లుతుంది" అని ఆశీర్వదించాడు ఇంద్రుడు.


తనని తాను దానం ఇచ్చుకోవడం అనేది పురాణాల్లో, కథల్లో మాత్రమే చూసాం. విన్నాం. మరి మానవుల్లో కూడా శిబి చక్రవర్తికి ఉన్నంత దానగుణం ఉన్నవారు ఉన్నారు. ఆయనే పూజ్య శ్రీ ఓంకార్ స్వామీజీ. మరణానంతరం శరీర దానం చేసినవారు, అవయవదానం చేసిన వారిని ఎందరినో చూసాం. మరి బ్రతికుండగానే శరీరంలో నుంచి ఒక భాగాన్ని తీసి ఇవ్వడం అంటే మాటలా..?


ఓంకార్ స్వామీజీ అలానే తన శరీరం నుంచి కాలి ఎముకను దానం ఇచ్చారు. ఆయన ఎవరంటే... ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా తోటపల్లిలో శాంతి మిషన్- శ్రీ శాంతి ఆశ్రమ వ్యవస్థాపకులు. మానవజాతి సంక్షేమం, ప్రపంచ శాంతి, సర్వమత సామరస్యాలను దృష్టిలో ఉంచుకుని 1917లో స్థాపించిన ఆశ్రమం ఇది. మల్లికార్జున ధార దగ్గరిలో తోటపల్లి  చిన్న గ్రామం. చుట్టూ కొండలు, ప్రశాంతమైన ప్రదేశం, ఆహ్లాదకరమైన వాతావరణాల మధ్య మంత్రముగ్దులను చేసే ప్రకృతి నడుమ శాంతి ఆశ్రమం ఉంది. 


ఒకనాడు తన దగ్గరకు వచ్చిన సందర్శకులలో ఒక తండ్రీ కూతుళ్ళను చూసిన స్వామీజీ.... ఎందుకు ఆ పాపను ఎత్తుకుని తిప్పుతున్నారు. స్వేచ్ఛగా వదిలేయండి అన్నారట. దానికి పాప తండ్రి ఆమె నడవలేదని, ప్రమాదంలో కాలు నలిగిపోయిందని. వైద్యం చేయిస్తున్నామని చెప్పాడు. స్వామి పాప గురించి ఆమె ఆరోగ్యం గురించి చాలా వివరాలు తెలుసుకున్నారు. ఎవరైనా దాతలు వారి కాలి ఎముకలోనుంచి చిన్న భాగాన్ని ఇవ్వగలిగితే ఆపరేషన్ ద్వారా దానిని పాపకు అమర్చవచ్చని డాక్టర్స్ చెప్పారని తన బాధను చెప్పుకొచ్చాడు. ఎవరు మాత్రం నడిచే తమ కాలిలోని ఎముకను ఇవ్వడానికి ముందుకు వస్తారు. కాబట్టి మా ఆశలన్నీ వదులుకున్నాం అన్నాడట. 


దానికి ఓంకార్ స్వామీజీ నేను మీ పాపకు నా కాలి ఎముకను ఇవ్వగలను. అని అభయం ఇచ్చారు. ఈ మాటను అతను నమ్మలేదు సరికదా... ఆశ్రమం నుంచి వెళ్ళాక స్వామీజీ అన్న మాటలను కూడా మరిచిపోయాడు. కానీ ఇచ్చిన మాటను స్వామీజీ మరిచిపోలేదు. ఆపరేషన్ కు ఏర్పాట్లు చేసుకోమని పాపతండ్రికి ఉత్తరం రాసారు. అప్పుడు నమ్మడట. ఎందరో స్వామిజీ భక్తులు, శ్రేయోభిలాషులు వద్దని చెపుతున్నా ఇచ్చిన మాటకు కట్టుబడి స్వామీజీ ఆపరేషన్ కు సిద్ధం అయ్యారు. ఆపరేషన్ జరుగుతున్నంత సేపూ స్వామిజీ మత్తు కూడా ఇవ్వనివ్వలేదు. పాపకు కాలు తిరిగి వచ్చింది. ఆమె చెంగు చెంగున తిరుగుతూ ఉంటే స్వామి మనసులో ఎంతో ఆనందించారు. 


"ఆకాశంలో ఎగిరే పక్షుల నుండి మానవుడు ఎంతో నేర్చుకోవాల్సి ఉంది. అవి ఎంతో స్వేచ్ఛగా, సంతోషంగా, ఎంతో సహజంగా ప్రవర్తిస్తాయి. పక్షులు విత్తనాలు నాటి, పంటలను పండించలేవు. ధాన్యాన్ని ప్రోగుచేసి బిడ్డలందరి కోసమూ జాగ్రత్త చేయలేవు. పరమేశ్వరుడు అందరిపట్లా శ్రద్ధ తీసుకుంటాడు. పక్షులయినా, పశువులయినా, సృష్టిలోని అతి చిన్న ప్రాణి ఏదైనా సరే అన్నిటి యోగక్షేమాలను పరమాత్మ చూసుకుంటాడు. పరమ కారుణ్యమూర్తి అయిన ఆ దైవం పట్ల మానవుడు కృతజ్ఞత కలిగి ఉండాలని... మనలో అంతర్యామిగా కొలువైన ఈశ్వరుడి పట్ల కనీసం ఆవగింజంతైనా విశ్వాసం కలిగి ఉండాలని ఓంకార్ స్వామి భక్తులకు చెప్పేవారు.


శాంతి ఆశ్రమానికి వచ్చే సందర్శకులు ఇక్కడి ఏకాంతాన్ని, నిశ్శబ్దాన్ని ఎంతో ఇష్టపడతారు. ఈ ఆశ్రమానికి స్వామి నారాయణ్, స్వామి రామతీర్థ, డివైన్ లైఫ్ సొసైటీ వ్యవస్థాపకులు స్వామి శివానంద, స్వామి చిదానంద, యోగదా సత్సంగ సొసైటీ వ్యవస్థాపకులు పరమహంస యోగానంద, ఇంకా అనేకమంది మఠాధిపతులు, ఆధ్యాత్మికవేత్తలు, ఆశ్రమానికి విచ్చేశారు. భూదానోద్యమకర్త వినోబా భావే, మాజీ రాష్ట్రపతులు సర్వేపల్లి రాధాకృష్ణన్,  వివి గిరి.... ఇంకా కేంద్ర, రాష్ట్ర ప్రముఖులు, మరెందరో విశిష్ట వ్యక్తులు శాంతి ఆశ్రమాన్ని సందర్శించి, ఎన్నో ప్రశంసలు కురిపించారు. అనేక దేశాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడి శాంతిని అనుభవించి ప్రశాంతమైన అనుభూతిని పొందుతారు.


సుందరమైన ఈ శాంతి ఆశ్రమాన్ని సందర్శించి ఆధ్యాత్మిక సాధకులు, నిష్ణాతులైన పండితులు, భక్తులు ఆశ్రమ కార్యక్రమాలలో భాగస్తులై తోడ్పాటునందిస్తున్నారు. అలా క్రమక్రమంగా ఈ ఆశ్రమం విస్తరించి నేడు దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో అనేక ఫలపుష్ప వృక్షాలతో భూవిపై స్వర్గంలా కనువిందు చేస్తోంది.


ఈ ఆశ్రమం పేదలతో పాటు వృద్ధులకు, జైలు జీవితాన్ని అనుభవిస్తున్న ఖైదీలకు మరెన్నో వర్గాల వారికి ఎన్నెన్నో సేవలను అందిస్తోంది. స్వామి ఓంకార్ జీ వారసురాలిగా మాతాజీ జ్ఞానేశ్వరి ఆధ్వర్యంలో ఆశ్రమం సమర్థవంతంగా నిర్వహించబడుతోంది. మాతాజీ నిరాడంబర ఆధ్యాత్మిక జీవనం ఆశ్రమ సందర్శకులకు ఎంతో దివ్యానుభూతిని పంచుతోంది. ఈ ఆశ్రమం కాకినాడ, పిఠాపురం, విశాఖపట్టణం, తమిళనాడులోని కోటగిరిలో కూడా శాఖలతో విరాజిల్లుతోంది.

- శ్రీశాంతి మెహెర్.

Updated Date - 2022-09-11T14:04:07+05:30 IST