సాఫల్యానికి సోపానం

ABN , First Publish Date - 2022-09-16T05:30:00+05:30 IST

బాధామయమైన ఈ ప్రపంచాన్ని సంతోషభరితం చెయ్యడానికి దైవకుమారుడైన ఏసు క్రీస్తు ఈ భూమిపై అవతరించాడు. మహోన్నతమైన జీవన విధానాన్ని ప్రబోధించడమే కాదు, దాన్ని స్వయంగా ఆచరించాడు.

సాఫల్యానికి సోపానం

బాధామయమైన ఈ ప్రపంచాన్ని సంతోషభరితం చెయ్యడానికి దైవకుమారుడైన ఏసు క్రీస్తు ఈ భూమిపై అవతరించాడు. మహోన్నతమైన జీవన విధానాన్ని ప్రబోధించడమే కాదు, దాన్ని స్వయంగా ఆచరించాడు. సామాన్యులలో సామాన్యుడై బతికాడు. అందుకే సామాన్యుల హృదయాలను ఆయన స్పృశించగలిగాడు. దీనికంతటికీ కారణం... మనుషులపై ఆయనకు ఉన్న అపారమైన ప్రేమ. అది ఎలాంటి లెక్కలకూ అందని, విశ్వమంత విస్తారమైన ప్రేమ. ఆవేదన, ఆవేశం, నిరాశ, నిస్పృహా, నిట్టూర్పు, బాధ, దుఃఖం, అజ్ఞానం... ఇవన్నీ మానవుల్లో సాధారణంగా ఉండే గుణాలే. వాటి నుంచి విముక్తి పొందే మార్గాన్ని ఏసు చూపించాడు. అనాథలకూ, పేదలకూ, దీనులకూ ఆపన్నహస్తమై నిలిచాడు. కష్టాల్లో ఉన్నవారి కన్నీళ్ళు తుడిచాడు. కొండంత గుండె ధైర్యాన్ని ఇచ్చి, వెన్ను తట్టి ముందుకు నడిపించాడు. రోగులను అక్కున చేర్చుకొని... స్వస్థత కలిగించాడు. దారి తప్పినవారికి హితవు చెప్పి, నీతిగా బతకమనీ, పరులకోసం పాటుపడమనీ ఆదేశించాడు.


దుఃఖపడేవారు ఎందుకూ పనికిరానివారేమీ కాదనీ, ధన్యులై దేవుని రాజ్యంలో తిరిగేది వాళ్ళేననీ చాటి చెప్పాడు. మానవులు ఎలా ఉండాలో తన ప్రవర్తన ద్వారా ఆయన చూపించి, ఆదర్శంగా నిలిచాడు. లోతైన కఠిన వేదాంత సూత్రాలు కాకుండా... ఆచరణాత్మకమైన మామూలు మాటలతోనే ఆయన తన ఉపదేశాలు చేశాడు. అవి మానవాళికి ఏ కాలానికైనా మార్గదర్శకాలే. వాటిని అనుసరించడమే జీవన సాఫల్యానికి సోపానం.                                 


  డాక్టర్‌ దేవదాసు బెర్నార్డ్‌ రాజు, 9866755024

Read more