తమలపాకు వైద్యం!

ABN , First Publish Date - 2022-09-10T05:30:00+05:30 IST

భోజనం తర్వాత తాంబూలం వేసుకుంటే నోరు పండడమే కాదు, అజీర్తి కూడా తలెత్తకుండా ఉంటుంది. తమలపాకులకు

తమలపాకు వైద్యం!

భోజనం తర్వాత తాంబూలం వేసుకుంటే నోరు పండడమే కాదు, అజీర్తి కూడా తలెత్తకుండా ఉంటుంది. తమలపాకులకు అంతటి ఔషధ గుణాలు ఉంటాయి. అంతే కాదు. తమలపాకుల్లో పలు రకాల రుగ్మతలకు విరుగుడుగా పనిచేసే సుగుణాలూ ఉంటాయి.


తమలపాకుల్లో యాంటీఆక్సిడెంట్లు, వృద్ధాప్య లక్షణాలను నియంత్రించే గుణాలు ఉంటాయి. ప్రమాదకర కొవ్వుల ప్రభావాన్ని తగ్గించే లక్షణం తమలపాకులకు ఉంటుంది. శరీరంలో బ్యాక్టీరియా పెరుగుదలను అడ్డుకునే చెవికాల్‌ అనే నూనె తమలపాకుల్లో ఉంటుంది. అయితే తమలపాకులకు వ్యసనంగా మారే అవకాశమూ లేకపోలేదు. క్రమం తప్పకుండా రెండేళ్లపాటు రోజుకు 8 నుంచి 10 తమలపాకులను తినేవారు వాటికి వ్యసనపరులయ్యే అవకాశం ఉంటుంది. పిల్లలు కనే వయసులో ఉన్న మహిళలు తమలపాకులను తినేటప్పుడు ఆకుల తొడిమలు తీసి తినాలని వైద్యులు సూచిస్తూ ఉంటారు. వీటిలో పునరుత్పత్తి వ్యవస్థను కుంటుపరిచే గుణాలు ఉంటాయి. అధిక రక్తపోటు కలిగినవాళ్లు కూడా ఆకులను ఈ విధంగానే తినాలి.  పొగాకుతో కలిపి తమలపాకులను తింటే, నోటి కేన్సర్‌ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి తమలపాకులు, వాటి వాడకం గురించి తెలుసుకుని వాటి ఔషధగుణ ఫలాలను పొందాలి.


తమలపాకు ఆరోగ్య ప్రయోజనాలు

తమలపాకుల్లోని ఔషధ గుణాలు పలు రకాల రుగ్మతలకు విరుగుడుగా పని చేస్తాయి. అవేంటంటే....

ఊబకాయం: తమలపాకులు, మిరియాలు కలిపి తింటే అధిక బరువు తగ్గుతుంది. బరువును తగ్గించే గుణాలు ఈ రెండింటి సమ్మేళనంతో సమకూరతాయి. ఫలితం 8 వారాల్లో కనిపిస్తుంది. 

ఏనుగు కాలు: ఏడు తమలపాకులను ఉప్పు, నీరు చేర్చి మెత్తగా రుబ్బి క్రమం తప్పకుండా ప్రతి రోజూ తీసుకుంటే మార్పు కనిపిస్తుంది.

చర్మ సమస్యలు: స్వర్ణ క్షీరి, విదంగ, ఇంగ్లీకం, గంథకం, చక్రమర్ద, చెంగల్వ కస్తు, సింధూరం, ఉమ్మెత్త ఆకులు, వేప బెరడు, తమలపాకులు కలిపి మెత్తగా నూరి చర్మానికి పూస్తే అన్ని రకాల చర్మ సమస్యలు అదుపులోకి వస్తాయి.

కళ్లకలక: తమలపాకుల రసం, మునగాకు రసం, గన్నేరు రసం, దిరిసిన పత్త, తేనె కలిపి కళ్ల మీద రాస్తే కళ్లకలక తగ్గుతుంది.

జలుబు, దగ్గు: తమలపాకుల రసం, తులసి రసం, అల్లం రసం, మిరియాల పొడి, తేనె కలిపి కొద్ది రోజులపాటు తీసుకుంటే జలుబు, దగ్గు తగ్గుతాయి. ఛాతీలో కఫం కరగాలంటే, తమలపాకులు, ఆముదం కలిపి ఛాతీ మీద పట్టు వేయాలి.

తలనొప్పి: నుదుటి మీద తమలపాకులు పరుచుకుంటే తలనొప్పి తగ్గుతుంది. తమలపాకుల నూనెతో మర్దన చేసుకున్నా తగ్గుతుంది.

మలబద్ధకం: పిల్లల్లో మలబద్ధకం తలెత్తితే, ఆముదంలో ముంచిన తమలపాకుల రసంతో ఎనీమా ఇవ్వాలి. ఇది వైద్యు పర్యవేక్షణలో జరగాలి.

అజీర్తి: తమలపాకుల్లో యాంటీబయాటిక్‌ గుణాలు ఉంటాయి. ఇవి కఫాన్ని కరిగిస్తాయి. వాపులను తగ్గిస్తాయు. ఆగని దగ్గును అదుపు చేస్తాయి. అలాగే జీర్ణశక్తినీ పెంచుతాయి. దంతాలు, చిగుళ్ల ఆరోగ్యానికీ తోడ్పడతాయు.

కోపం: అకారణంగా అదుపు చేయలేనంత ఆవేశానికి, కోపానికి లోనయ్యేవారు తమలపాకు రసంలో తేనె కలిపి తీసుకోవాలి.

గుండె లయ: గుండె లయ తప్పితే ఒక చెంచా తమలపాకు రసం క్రమం తప్పకుండా ప్రతి రోజూ తీసుకోవాలి.

గుండె బలహీనత: తమలపాకు రసం, చక్కెర కలిపి తీసుకుంటే గుండె బలపడుతుంది.

శ్రావ్యమైన కంఠం: తమలపాకు తీగ బెరడు తీసుకుని నోట్లో పెట్టుకుని, రసం మింగుతూ ఉండాలి. పాటలు పాడేవాళ్లకు ఈ చిట్కా ఉపయోగకరం.

మొటిమలు: ముఖాన్ని శుభ్రంగా కడగాలి. ఐదు తమలపాకులను పావు లీటరు నీళ్లలో మరిగించాలి. ఆకులు గోధుమరంగుకు మారేవరకూ నీటిని మరిగించాలి. తర్వాత ఈ ఆకులను మెత్తగా నూరి, ముఖానికి పూసుకోవాలి. 15 నిమిషాల తర్వాత వేడి నీటిలో తడిపి పిండిన తువ్వాలుతో ముఖం శుభ్రం చేసుకోవాలి. 

తీరని దాహం: ఎంత నీళ్లు తాగినా దాహం తీరకపోతూ ఉంటే, తమలపాకును నమలాలి.

గాయాలు, దెబ్బలు: తమలపాకులతో గాయాలు, దెబ్బలకు పట్టు వేస్తే త్వరగా మానతాయి.

తమలపాకులను చెవుల మీద పట్టు వేసుకుంటే వాతం తగ్గి తలనొప్పి తగ్గుతుంది. తమలపాకుల రసం ముక్కులో వేసుకుంటే జలుబు కారణంగా తలెత్తే తలనొప్పి నుంచి ఉపశమనం దొరుకుతుంది.

ఆరోగ్యకరమైన అలవాట్లలో పరిమిత తమలపాకుల సేవనం ఆరోగ్యకరం అని చరకసంహితం, శుశృతసంహితంలో చెప్పారు. కాబట్టి తమలపాకులలోని సుగుణాలు పొందాలంటే అతిగా కాకుండా పరిమితంగా తీసుకుంటూ ఉండాలి.


ఇలా పనిచేస్తుంది!

తమలపాకుల రసం సున్నంలోని క్యాల్షియంను శరీరం శోషించుకునేలా చేస్తే, వక్కపొడి నోట్లో లాలాజలం ఊరేలా చేసి, అరుగుదలకు తోడ్పడుతుంది. 

Updated Date - 2022-09-10T05:30:00+05:30 IST