సీనియర్‌ ఎన్టీఆర్‌ టైటిల్‌తో నాగార్జున సినిమా

ABN , First Publish Date - 2022-12-03T23:35:19+05:30 IST

సీనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా జానపద బ్రహ్మ విఠలాచార్య జానపద సినిమాలే కాదు రెండు మూడు సాంఽఘిక చిత్రాలు కూడా తీశారు. వాటిల్లో ‘నిన్నే పెళ్లాడతా’ ఒకటి.

సీనియర్‌ ఎన్టీఆర్‌ టైటిల్‌తో నాగార్జున సినిమా

సీనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా జానపద బ్రహ్మ విఠలాచార్య జానపద సినిమాలే కాదు రెండు మూడు సాంఽఘిక చిత్రాలు కూడా తీశారు. వాటిల్లో ‘నిన్నే పెళ్లాడతా’ ఒకటి. తన సొంత బేనర్‌లో విఠలాచార్య ఈ సినిమా నిర్మించారు. అయితే ఎన్టీఆర్‌ ఇమేజ్‌ కు సరితూగక పోవడంతో అప్పట్లో ఆ సినిమా హిట్‌ కాలేదు. ఓ ప్లాప్‌ సినిమా టైటిల్‌ తో సినిమా తీయడానికి సాధారణంగా ఎవరూ ముందుకు రారు. కానీ నాగార్జున హీరోగా తను తీసే చిత్రానికి దర్శకుడు కృష్ణ వంశీ నిన్నే పెళ్ళాడతా టైటిల్‌ పెట్టడం అందర్నీ ఆశ్చర్య పరచింది. కృష్ణవంశీకి ఇది రెండో సినిమా. 1996లో పెళ్లి బ్యాక్‌ డ్రాప్‌ లో తయారై సూపర్‌ హిట్‌ అయిన చిత్రాలు రెండు ఉన్నాయి. ఒకటి ‘పెళ్లి సందడి’, రెండో సినిమా ‘నిన్నే పెళ్ళాడతా’.

‘కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ‘గులాబీ’ చిత్రం చూసి నాగార్జున ఇంప్రస్‌ అయి, తనతో సినిమా చేయడానికి అవకాశం ఇచ్చారు. మొదట ఓ మంచి యాక్షన్‌ కథను నాగార్జునకు వినిపించారు కృష్ణవంశీ. అది ఆయనకు నచ్చింది కూడా. వెంటనే షూటింగ్‌ ప్రారంభించమని చెప్పడంతో లొకేషన్స్‌ చూడడం కోసం వైజాగ్‌ వెళ్లారు కృష్ణవంశీ. అక్కడ ఓ వ్యక్తి ఎదురై కృష్ణవంశీని గుర్తు పట్టి ‘ మీ గురువు రామ్‌గోపాల్‌ వర్మలా బాగా తీశారు’ అని ప్రశంసించారు. తన మీద గురువు వర్మ ముద్ర ఉండకూడదని నిర్ణయించుకున్న కృష్ణవంశీ వెంటనే నాగార్జునకు ఫోన్‌ చేసి ‘ఇంతకుముందు మీకు చెప్పిన కథతో నేను సినిమా చేయడం లేదు’ అని చెప్పారు. నాగార్జున షాకయి ‘నీకు పిచ్చి పట్టలేదు కదా’ అని అడిగారు. ‘అదేమీ లేదండీ. రేపు మిమ్మల్ని వచ్చి కలుస్తా’ అని చెప్పి ఫోన్‌ పెట్టేశారు కృష్ణవంశీ. ఆ మర్నాడు నాగార్జునని కలసి ‘నిన్నే పెళ్లాడతా’ కథ వినిపించారు. ఆ సమయంలో బాలీవుడ్‌లో ‘హమ్‌ ఆప్‌ హై కౌన్‌’, ‘దిల్‌ వాలే దుల్హనియా లే జాయేంగే’ చిత్రాలు సూపర్‌ హిట్‌ అయి, సరికొత్త ట్రెండ్‌ సృష్టించాయి. ఆ చిత్రాల ప్రేరణతో ‘నిన్నే పెళ్లాడతా’ కథ తయారు చేశారు కృష్ణవంశీ.

తెలుగు నేటివిటీ, స్వచ్ఛమైన అనుబంధాలు, ఆప్యాయతలు.. ఈ చిత్ర విజయానికి ప్రధాన కారణం. సాధారణంగా స్టార్స్‌తో తీసే ఏ సినిమాలోనైనా పాటలన్నీ హీరో హీరోయిన్ల మీదే ఉంటాయి. కానీ ‘నిన్నే పెళ్ళాడతా’ చిత్రంలోని ఏడు పాటల్లో మూడే మూడు ద్యూయట్లు. మిగిలిన నాలుగు పాటలూ సినిమాలోని అన్ని పాత్రల మీద చిత్రీకరించడం ఈ సినిమాలో మరో విశేషం. ముఖ్యంగా ‘గ్రీకు వీరుడు’ పాటతో నాగార్జున యువతి కలల రాకుమారుడయ్యారు. టబు హీరోయిన్‌గా నటించిన ‘నిన్నే పెళ్ళాడతా’ చిత్రం ఘన విజయం సాధించింది.

Updated Date - 2022-12-03T23:35:20+05:30 IST