కచ్చా మ్యాంగోతో మస్తు మజా!

ABN , First Publish Date - 2022-05-07T05:30:00+05:30 IST

కచ్చా మ్యాంగోతో మస్తు మజా!

కచ్చా మ్యాంగోతో మస్తు మజా!

మార్కెట్లో మామిడికాయలు నోరూరిస్తున్నాయి. పచ్చి మామిడికాయలు ఇప్పుడే దొరుకుతాయు కాబట్టి వాటితో రకరకాల వంటలు తయారుచేసుకుని జిహ్వచాపల్యం తీర్చుకోవచ్చు. అలాంటి కొన్ని కచ్చా మ్యాంగో రెసిపీలు ఇవి...


మామిడికాయ పులిహోర


కావలసిన పదార్థాలు 

అన్నం - ఒక కప్పు, పచ్చి మామిడికాయ - ఒకటి, ఆవాలు - ఒక టీస్పూన్‌, మినప్పప్పు - అరటీస్పూన్‌, శనగపప్పు - అరటీస్పూన్‌, వేరుశెనగలు - ఒకటీస్పూన్‌, పచ్చిమిర్చి - రెండు, కరివేపాకు - ఒకకట్ట, పసుపు - అర టీస్పూన్‌, నువ్వుల నూనె - మూడు టీస్పూన్లు, ఇంగువ - చిటికెడు, ఉప్పు - రుచికి తగినంత. 

తయారుచేయు విధానం 

స్టవ్‌పై ఒక పాత్రను పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఆవాలు వేయాలి. తరువాత మినప్పప్పు, శనగపప్పు, పచ్చిమిర్చి వేసుకోవాలి. కరివేపాకు, ఇంగువ, పసుపు వేసి కలుపుకోవాలి. 

ఇప్పుడు మామిడికాయ తురుము బాగా కలియబెట్టుకోవాలి. 

ఈ మిశ్రమాన్ని సిద్ధంగా పెట్టుకున్న అన్నంలో కలుపుకోవాలి. రుచికి తగిన ఉప్పు వేసుకొని సర్వ్‌ చేసుకోవాలి.


మామిడికాయ రసం

కావలసిన పదార్థాలు

మామిడికాయ - ఒకటి, టొమాటో - ఒకటి, కందిపప్పు - ఒక టేబుల్‌స్పూన్‌, ఉప్పు - తగినంత, కరివేపాకు - ఒకకట్ట, ఎండుమిర్చి - ఒకటి, మిరియాలు - నాలుగైదు, ధనియాలు - ఒక టీస్పూన్‌, జీలకర్ర - ఒక టీ స్పూన్‌, అల్లం వెల్లుల్లి - కొద్దిగా, ఆవాలు - ఒక టీస్పూన్‌, పసుపు - ఒక టీస్పూన్‌, నూనె - ఒక టీస్పూన్‌, ఇంగువ - చిటికెడు.


తయారుచేయు విధానం 

ముందుగా పచ్చిమామిడికాయ పొట్టు తీసి కుక్కర్‌లో వేసి ఉడికించాలి. ఆవిరి పోయాక తీసి గుజ్జును తీసుకుని మిక్సీలో వేసి కొద్దిగా మ్యాంగో ప్యూరీ తయారుచేసుకోవాలి.

అలాగే కందిపప్పును ఉడికించుకుని మెత్తగా రుబ్బుకుని పక్కన పెట్టుకోవాలి.

మిరియాలు, ధనియాలను వేయించి పొడి చేసుకోవాలి. 

స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. పసుపు, కరివేపాకు, ఇంగువ, ఎండుమిర్చి, అల్లం వెల్లుల్లి  వేయాలి.

తరువాత మ్యాంగో ప్యూరీ, టొమాటో ముక్కలు వేయాలి. 

మిరియాల పొడి, ధనియాల పొడి వేయాలి. ఉడికించి పెట్టుకున్న పప్పు వేసి కలుపుకోవాలి. తగినంత ఉప్పు వేయాలి.

సరిపడా నీళ్లు పోసి పదినిమిషాల పాటు మరిగించుకుంటే రసం రెడీ.కైరీ మ్యాంగో కర్రీ

కావలసిన పదార్థాలు

మామిడికాయలు - అరకేజీ, ఆవాల నూనె - మూడు టేబుల్‌స్పూన్లు, జీలకర్ర - ఒక టీస్పూన్‌, సోంపు - ఒక టీస్పూన్‌, బిర్యానీ ఆకులు - రెండు, ఇంగువ - అర టీస్పూన్‌, శనగపిండి - రెండు టేబుల్‌స్పూన్లు, పసుపు - అర టీస్పూన్‌, కారం - ఒక టీస్పూన్‌, ధనియాల పొడి - ఒక టీస్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత, బెల్లం - ఒక టేబుల్‌స్పూన్‌, కొత్తిమీర - ఒకకట్ట.

తయారీ విధానం

ముందుగా మామిడికాయలను శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. 

స్టవ్‌పై కడాయిపెట్టి ఆవాల నూనె వేసి కాస్త వేడి అయ్యాక జీలకర్ర, సోంపు వేయాలి.

తరువాత బిర్యానీ ఆకు, పసుపు, ఇంగువ, కారం, ధనియాల పొడి, శనగపిండి వేసి కలుపుకోవాలి.

ఇప్పుడు సిద్ధంగా పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసి అరకప్పు నీళ్లు పోసి ఉడికించాలి. 

తగినంత ఉప్పు వేసి చిన్నమంటపై పదినిమిషాలు ఉడికించుకోవాలి.

తరువాత బెల్లం వేసి పూర్తిగా కరిగే వరకు ఉంచుకుని దింపుకోవాలి.

సర్వింగ్‌ డిష్‌లోకి మార్చుకుని కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకోవాలి.


మామిడికాయ పచ్చడి

కావలసిన పదార్థాలు

మామిడికాయలు - రెండు, బెల్లం - కొద్దిగా, పచ్చిమిర్చి - రెండు, ఉప్పు - రుచికి తగినంత, పసుపు - ఒక టీస్పూన్‌, నూనె - ఒక టేబుల్‌స్పూన్‌, ఎండుమిర్చి - రెండు, ఆవాలు - అర టీస్పూన్‌, ఎండుమిర్చి - మూడు. 

తయారుచేయు విధానం 

 మామిడికాయల పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి.

 తరువాత వాటిని కుక్కర్‌లో వేసి బెల్లం, పసుపు, పచ్చిమిర్చి, తగినన్ని నీళ్లు పోసి మూడు విజిల్స్‌ వరకు ఉడికించాలి.

 ఆవిరి పోయిన తరువాత మిశ్రమాన్ని ఒక బౌల్‌లోకి మార్చుకోవాలి.

 స్టవ్‌పై ఒక పాన్‌ పెట్టి నూనె వేసి ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. ఎండు మిర్చి వేసుకోవాలి. కరివేపాకు వేయాలి. 

ఇప్పుడు బౌల్‌లో ఉన్న పచ్చడి వేసి కలుపుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. 

కాసేపు ఉడికించుకున్న తరువాత దింపుకొంటే పచ్చడి రెడీ. 


మామిడికాయ హల్వా

కావలసినవి

మామిడికాయలు- రెండు, సగ్గుబియ్యం - అరకప్పు, పంచదార - రెండు కప్పులు, కొబ్బరిపాలు - రెండు కప్పులు, నెయ్యి - అరకప్పు, యాలకుల పొడి - అర టీస్పూన్‌, జాజికాయ పొడి - పావు టీస్పూన్‌,  ఫుడ్‌ కలర్‌ - కొద్దిగా, ఉప్పు - చిటికెడు, జీడిపప్పు - ఐదారు పలుకులు. 

తయారీ విధానం

మామిడికాయల పొట్టు తీసేసి, మిక్సీలో వేసి పేస్టులా తయారుచేసుకోవాలి.

సగ్గు బియ్యాన్ని శుభ్రంగా కడిగి ముందురోజు రాత్రి నానబెట్టుకోవాలి.

స్టవ్‌పై పాన్‌ పెట్టి నెయ్యి వేసి పేస్టులా పట్టుకున్న మామిడికాయ గుజ్జు వేసి వేయించాలి.

తరువాత కొబ్బరిపాలు పోయాలి. సగ్గు బియ్యం వేసి ఉడికించాలి.

ఇప్పుడు పంచదార వేసి కలుపుకోవాలి. యాలకుల పొడి, జాజికాయ పొడి, ఫుడ్‌ కలర్‌, కాస్త ఉప్పు వేయాలి.

 మిశ్రమం చిక్కగా అవుతున్న సమయంలో కొద్దిగా నెయ్యి వేయాలి. 

 ఒక ప్లేట్‌కు నెయ్యి రాసి పెట్టుకోవాలి.

 మిశ్రమం ఉడికిన తరువాత ప్లేట్‌లోకి పోసుకోవాలి. జీడిపప్పు పలుకులతో గార్నిష్‌ చేసుకోవాలి.

 చల్లారిన తరువాత ముక్కలుగా కట్‌ చేసుకుని సర్వ్‌ చేయాలి.

Read more