అందుబాటులోకి ఆధునిక క్యాన్సర్‌ చికిత్సలు

ABN , First Publish Date - 2022-10-11T09:46:07+05:30 IST

క్యాన్సర్‌ వ్యాధులకు సంబంధించి కొత్త ఆధునిక చికిత్సలు అందుబాటులోకి వస్తున్నాయి.

అందుబాటులోకి ఆధునిక క్యాన్సర్‌ చికిత్సలు

క్యాన్సర్‌ వ్యాధులకు సంబంధించి కొత్త ఆధునిక చికిత్సలు అందుబాటులోకి వస్తున్నాయి. సాధారణంగా క్యాన్సర్‌ చికిత్స వ్యాధి దశ, రోగి వయసు, ఆరోగ్య చరిత్ర, రోగి శరీర తత్వాల ఆధారంగా చికిత్స చేయవలసిన అవసరం ఉంటుంది. 


ఆధునిక చికిత్సలు

ప్రస్తుతం క్యాన్సర్‌ వ్యాధులకు సెల్‌ టార్గెటెడ్‌ థెరపీ, ఇమ్యునోథెరపీ, హైపర్‌థర్మియా, స్టెమ్‌ సెల్‌ థెరపీ, ఫొటోడైనమిక్‌, లేజర్‌ థెరపీ, మాలిక్యులర్‌ టార్గెటెడ్‌ థెరపీ వంటి ఆధునిక చికిత్సా విధానాలు అందుబాటులోకి వస్తున్నాయి. చివరి దశలోని క్యాన్సర్‌ రోగులకు నొప్పి, బాధల నుంచి ఉపశమనం కలిగించే పాలియేటివ్‌ కేర్‌  కూడా అందుబాటులోకి వచ్చింది.


ఈ వ్యాధిగ్రస్థులకు మరింత కేర్‌ అవసరం

గుండె, మూత్రపిండాలు, కాలేయం తదితర వ్యాధుల నుంచి క్యాన్సర్‌  సోకిన రోగుల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. సాధారణంగా క్యాన్సర్‌ మందులు ఇతరత్రా అవయవాల మీద కూడా ప్రభావం చూపుతాయి. కాబట్టి వైద్యుల సలహా మేరకు రక్త పరీక్షలు, అవయవాల పనితీరును తెలిపే పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. కాబట్టే ఇతర ఆరోగ్యవంతమైన కణాలు, అవయవాలు దెబ్బతినకుండా, దుష్ప్రభావాలు తక్కువగా ఉండే సెల్‌ టార్గెటెడ్‌ థెరపీ, విఎంఎటి రేడియేషన్‌ థెరపీ, తక్కువ కోతతో కూడిన కీ హోల్‌ సర్జరీలు అందుబాటులోకి వచ్చాయి.


శస్త్రచికిత్సలో కొత్త పద్ధతులు

బ్లడ్‌ క్యాన్సర్‌ మినహా అన్ని రకాల క్యాన్సర్లకూ సర్జరీ అవసరం ఉంటుంది. ప్రారంభ దశలోని క్యాన్సర్‌ను సర్జరీతో ఇతర అవయవాలకు వ్యాపించకుండా నియంత్రించవచ్చు. ప్రస్తుత క్యాన్సర్‌ సర్జరీలు డే కేర్‌ ప్రొసిజర్ల మాదిరిగానే జరుగుతున్నాయి. 

ముందస్తు సర్జరీలు

క్యాన్సర్‌ లక్షణాలు లేకున్నా, పెద్ద పేగు చివరి భాగంలో పాలిప్స్‌ ఉంటే, మందస్తుగానే తొలగిస్తారు. రక్తసంబంధీకుల్లో రొమ్ము క్యాన్సర్‌ ఉంటే, బిఆర్‌సిఎ-1, బిఆర్‌సిఎ-2 వంటి జీన్‌ మ్యుటేషన్‌ పరీక్షలతో క్యాన్సర్‌ వచ్చే అవకాశాన్ని ముందుగానే కనిపెట్టి, రొమ్మును తొలగిస్తారు. పాప్‌స్మియర్‌ పరీక్షలో తేడాలుంటే, హిస్టరెక్టమీతో గర్భాశయాన్ని తొలగిస్తారు. 

క్యురేటివ్‌ సర్జరీలు

ప్రారంభ దశలో వ్యాధిని గుర్తిస్తే, మొదట సర్జరీ, తర్వాత కీమో, రేడియేషన్‌లతో వ్యాధిని నయం చేసే క్యురేటివ్‌ సర్జరీలు చేస్తారు. కొన్ని సందర్భాల్లో సర్జరీ చేసే సమయంలోనే రేడియేషన్‌ కూడా ఇవ్వడం జరుగుతుంది.

పాలియేటివ్‌ కేర్‌

చివరి దశ క్యాన్సర్‌లో కణితి పరిమాణాన్ని తగ్గించి, నొప్పి, బాధల నుంచి ఉపశమనం కోసం అందించే చికిత్స ఇది. కొన్ని సందర్భాల్లో ఇతర చికిత్సలను అందించడానికి వీలుగా సపోర్టివ్‌ సర్జరీలు కూడా చేయడం జరుగుతుంది. 

రీకన్‌స్ట్రక్టివ్‌ సర్జరీ

క్యాన్సర్‌ చికిత్సలో భాగంగా చేసే సర్జరీలో వ్యాధి సోకిన రొమ్ము, నోటి భాగాలను తొలగించినప్పుడు, ఇతర శరీర భాగాల నుంచి సేకరించిన కణజాలం, ఎముకలు, ఇతర మెటల్‌, ప్లాస్టిక్‌తో చేసిన ప్రాస్థటిక్స్‌ను ఉపయోగించి రీకన్‌స్ట్రక్టివ్‌ సర్జరీలు చేయడం జరుగుతుంది.

కీమో థెరపి

ఈ థెరపీ ఫలితంగా రోగుల్లో వాంతులు, వికారం, బరువు తగ్గడం, అలసట, గొంతు రంగు మారడం, జుట్టు రాలిపోవడం లాంటి దుష్ప్రభావాలు ఉంటాయి. ఇవన్నీ తాత్కాలికమే! చికిత్స తర్వాత పరస్థితి మెరుగు పడుతుంది.

రేడియేషన్‌ థెరపి

పూర్వం అరగంటకు పైగా సాగే ఈ చికిత్సను, ప్రస్తుతం కొన్ని నిమిషాల్లోనే ముగించే పరిస్థితి ఉంది. కొన్ని రకాల క్యాన్సర్లకు రేడియేషన్‌తోనే చికిత్స చేయవలసి ఉంటుంది. త్రీడైమెన్షనల్‌, స్టీరియోటాక్టిక్‌, బ్రాకీ థెరపీలతో తక్కువ వ్యవధిలో, తక్కువ దుష్ప్రభావాలతో చికిత్సను ముగించే వీలుంది.

Updated Date - 2022-10-11T09:46:07+05:30 IST