Happy Children’s Day 2022: సామాజిక మాధ్యమాల ఉచ్చులో బాల్యం..!

ABN , First Publish Date - 2022-11-14T09:59:09+05:30 IST

పిల్లలే దేశ భవిష్యత్తు, సమాజానికి పునాది.

Happy Children’s Day 2022: సామాజిక మాధ్యమాల ఉచ్చులో బాల్యం..!
Happy Children’s Day

ప్రతి సంవత్సరం, భారతదేశ మొదటి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ పుట్టినరోజును నవంబర్ 14న బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. నెహ్రూ బాలల హక్కు కోసం విజ్ఞానం అందరికీ అందుబాటులో ఉండే విధంగా కృషి చేసిన గొప్ప న్యాయవాది. పిల్లలే దేశ భవిష్యత్తు, సమాజానికి పునాది. విద్యారంగంలోనూ, కళలు, క్రీడలలోనూ పిల్లలు ఎదగాలని, మంచి పౌరులుగా ఉండాలనేది ఆయన ఆకాంక్ష. మంచి పౌరులుగా పాఠశాలలో గురువులు తీర్చిదిద్దితే, గొప్ప వ్యక్తులుగా తల్లిదండ్రులు తయారు చేయాలి.

పిల్లల్లో సామాజిక దృక్పథం పెరగాలి..

ఏదైనా సాధించాలనే పట్టుదల, దాన్ని అందుకునేందుకు తగిన కృషి పిల్లలకు కావాలి. పట్టుదల ఉంటే విద్యార్థులు ఎంచుకున్న రంగాల్లో రాణించగలుగుతారు. ఉన్నత శిఖరాలను అందుకోగలుగుతారు. చాచా నెహ్రూ ఆశించిన విధంగా గొప్ప పౌరులుగా నిలుస్తారు.

సేవా తత్వం కూడా ప్రతి పిల్లల్లో అవసరమే..

నలుగురికి సాయం చేయాలనే ఆలోచన అప్పటికప్పుడు రాదు. అది బాల్యంలో నుంచే అబ్బాలి. ఎదుటివారికి సాయంచేసే గుణాన్ని పిల్లల్లో కలిగించాల్సింది తల్లిదండ్రులే. ఇవ్వడంలో ఉండే ఆనందాన్ని వారికి నేర్పాలి. చిన్నతనంలో పెట్టే గుణం పిల్లల్లో ఉంటే పెద్దయ్యాకా మంచి పౌరులుగా సేవా తత్వంతో ఎదుగుతారు. సమాజానికి చేయూతగా నిలుస్తారు.

సామాజిక మాధ్యమ ఉచ్చులో బాల్యం..

ప్రస్తుతం మానవ జీవితాల్లో సామాజిక మాధ్యమాలు ఎలాంటి కీలక పాత్ర పోషిస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. మరోవైపు వీటి వినియోగం కూడా విపరీతంగానే ఉంది. ముఖ్యంగా పిల్లలు, యువత కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్ల వలలో చిక్కుకుని యాంత్రికమైన జీవితానికి అలవాటు పడుతున్నారు. పుస్తకాలు చదివే అలవాటు తగ్గిపోయింది.. సామాజిక మాధ్యమాలోనే కాలం వెళ్లబుచ్చుతున్నారు. పిల్లల బాల్యం నుంచే మంచి నడవడిక అలవర్చడం ప్రధానంగా ప్రతి తల్లిదండ్రుల బాధ్యత.

happy-children's-day.jpg

నేటి బాల సాహిత్యం చదివించండి.

పిల్లల్లో సాహిత్యం పట్ల అవగాహన, అభిరుచి పెంచే భాద్యత ప్రతి తల్లితండ్రులది. రోజూ కథలు చెప్పే సమయం ఎలాగో లేకపోతుంది. ఇక పుస్తకం చదివే అలవాటునన్నా పిల్లల్లో పెంచాలి. వారికి మంచి మంచి కథలు, పాఠాలు చెప్పాలి. పిల్లల్లో విజ్ఞానాన్ని పెంచాలి. తెలుగు బాలసాహిత్యం తొలి నుంచి నీతులు ప్రధానంగా నడిచింది. కుమార శతకం, కుమారీ శతకం... నీతి కథా మంజరి వంటివి ప్రధానంగా చాలాకాలం బాల పఠనీయ సాహిత్యంగా ఉన్నాయి. ఇవన్నీ పిల్లల నడవడికను ప్రభావితం చేసేవే.

Updated Date - 2022-11-14T10:37:12+05:30 IST