ఊదారంగు తాబేలు

ABN , First Publish Date - 2022-09-22T05:44:34+05:30 IST

ఒక అడవిలో రెండు తాబేళ్లుండేవి. ఒకటి మామూలు తాబేలు. ఇంకోటి ఊదారంగు తాబేలు. రెండు స్నేహితులు.

ఊదారంగు తాబేలు

క అడవిలో రెండు తాబేళ్లుండేవి. ఒకటి మామూలు తాబేలు. ఇంకోటి ఊదారంగు తాబేలు. రెండు స్నేహితులు. ఒక రోజు ఉదయం లేస్తూనే ఊదారంగు తాబేలుకి ఓ సీతాకోక చిలుక కనిపించింది. ఏడుస్తూ గాలిలో తిరుగుతోంది. ‘రక్షించండి’ అంటూ ఊదారంగు తాబేలుపైన వాలింది. అసలే ఊదారంగు తాబేలుది మంచి మనసు. ‘నీకు ఏమైంది?’ అని ఆరా తీసింది. ‘మీరు మా ప్రాంతానికి రండి. ఓ ఎలుగుబంటి వచ్చింది. సన్నటి వలతో సీతాకోకచిలుకలను పట్టి ఒక సీసాలో బంధిస్తోంది. ఏమి చేయాలో అర్థం కాలేదు. మా వాళ్లను రక్షించండి’ అంటూ ఏడ్చింది. ‘నేను కేవలం తాబేలును. నా మాట ఎలుగు వింటుందా?’ అంటూ వెటకారంగా మాట్లాడింది ఆ ఊదారంగు తాబేలు. ‘దయచేసి మా స్నేహితులను రక్షించండి’ అంటూ ప్రాథేయపడింది. కాదనలేక ఊదారంగు తాబేలు ఆ సీతాకోక చిలుకను అనుసరిస్తూ వెళ్లింది.

పూల చెట్లు.. అందమైన గడ్డితో ఆ ప్రాంతం హాయిగా ఉంది. సీతాకోకచిలుకలను చిన్న వలతో ఎలుగు బంటి పడుతోంది. పట్టిన వాటిని జాడీలో వేస్తోంది. తాబేలు, సీతాకోకచిలుక దాని ముందుకు వెళ్లాయి. ‘సీతాకోక చిలుకలను ఎందుకు పడుతున్నారు. ఆ జాతి మీద మీకెందుకింత వైరం. ఎవరినీ ఏమీ అనవు. ప్రకృతికెంతో సహాయకారులు’ అన్నది తాబేలు. ‘నీ పని నువ్వు చూసుకో’ అన్నది ఎలుగు. ‘నీవు జూలో బంధించబడితే ఎలా ఉంటావో ఊహించు. మరి ఆ సీతాకోకచిలుకలు జాడిలో అలానే విలవిలలాడుతుంటాయి కదా?నీకు భావ్యమా’ అన్నది తాబేలు. ఒక్క క్షణంలో ఎలుగు తనకు తాను ఆ స్థితిని ఊహించుకుంది. పాపం.. అనుకుంది. ‘నేను తినను వీటిని. ఏదో సరదాకు చేస్తున్నా. జాడిలో బంధిస్తే పాపం.. ఎలా ఉంటాయి’ అంటూ ఆ జాడీని తెచ్చి సీతాకోకచిలుకలను వదిలేసింది. సీతాకోకచిలుకలన్నీ ఎలుగుతో పాటు తాబేలుకి ధన్యవాదాలు చెప్పాయి.

Read more