Miniature Punganur Cows : చిట్టి పొట్టి ఆవులే... ఆత్మీయ నేస్తాలు

ABN , First Publish Date - 2022-11-23T23:29:34+05:30 IST

ఒంటరితనాన్ని దూరం చేసుకోవడానికి తమ ఇంటికి తెచ్చిన పొట్టి ఆవులు... పిల్లలు దూరంగా ఉన్న లోటును తీరుస్తున్నాయంటున్నారు పాకలపాటి సుభద్రాదేవి. కాకినాడ జిల్లా ఏలేశ్వరంలోని ఆమె ఇంట్లో...

Miniature Punganur Cows : చిట్టి పొట్టి ఆవులే... ఆత్మీయ నేస్తాలు
Pakalapati Subhadra

ఒంటరితనాన్ని దూరం చేసుకోవడానికి తమ ఇంటికి తెచ్చిన పొట్టి ఆవులు... పిల్లలు దూరంగా ఉన్న లోటును తీరుస్తున్నాయంటున్నారు పాకలపాటి సుభద్రాదేవి. కాకినాడ జిల్లా ఏలేశ్వరంలోని ఆమె ఇంట్లో... అత్యంత అరుదైన మీనియేచర్‌ పుంగనూరు ఆవుల సందడి... సందర్శకులను ముగ్ధుల్ని చేస్తోంది.

‘‘రాము, సీత... ఇవి మా పిల్లల పేర్లు కావు. మా పిల్లలు ఉద్యోగరీత్యా బెంగళూరు, అమెరికాల్లో స్థిరపడిన తరువాత... మాకు తోడుగా ఉన్న ఆవులు. ఇప్పుడు అవే మాకు కాలక్షేపం. మన భారతీయ జీవన విధానంలో గోవుకు ఉన్న ప్రాధాన్యం ఎనలేనిది. గోవులను పూజించడం వల్ల సుఖ సంతోషాలు, సౌభాగ్యం కలుగుతాయని భావించేవారు. అందుకే గోవులను పెంచుకునేవారు. ఇళ్ళలో, వ్యవసాయ క్షేత్రాల్లో ప్రత్యేకంగా వాటి పెంపకానికి స్థలాన్ని కేటాయించేవారు. కాలక్రమేణా అపార్ట్‌మెంట్‌ కల్చర్‌ పెరిగింది. ఇళ్లలోనూ, పొలాల్లోనూ గోవుల సందడి లేకుండా పోయింది. పల్లెలు వదిలి, పట్నానికి వచ్చాక... గోవులతో అనుబంధం దూరమయింది. ఇప్పుడు పుంగనూరు ఆవులు మాకు ఆ లోటును తీరుస్తున్నాయి.

22ELM11.jpg

ఫ్యాన్‌ కిందే పడక...

కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలంలోని కొండతిమ్మాపురం గ్రామంలో మా సమీప బంధువు, నాడీపతి వైద్యుడు పెనుమత్స కృష్ణంరాజు తన వ్యవసాయ క్షేత్రంలో అరుదైన దేశీయ రకం పుంగనూరు ఆవులను పెంచుతున్నారు. పుంగనూరు జాతి ఆవులు... ప్రపంచంలోనే అత్యంత అరుదైన, పొట్టి రకం ఆవులుగా పేరు పొందాయి. వాటిని చూడగానే... నేనూ, మావారు విశ్వనాథరాజు ముచ్చట పడ్డాం. వాటిలో కొన్నిటిని ఏలేశ్వరంలోని దత్తనగర్‌లో ఉన్న మా అపార్ట్‌మెంట్‌కు తెచ్చుకున్నాం. మా పిల్లల్లా పెంచుకుంటున్నాం. ముద్దుగా పొట్టిపొట్టి ఆకారాలతో... అందంగా ఆకర్షణీయంగా కనిపించే ఈ ఆవులు చూపరులను ఇట్టే కట్టిపడేస్తున్నాయి. కేవలం అడుగు నుంచి రెండు అడుగుల మేర ఎత్తు కలిగిన ఈ ఆవులు మనుషులతో చాలా స్నేహంగా ఉంటాయి. ఇల్లంతా తిరుగుతూ సందడి చేస్తాయి. మా కుటుంబ సభ్యులతో కలసి అవి మంచాలమీద... ఫ్యాన్ల కింద పడుకుంటాయి. మా భోజనాల టేబుల్‌ దగ్గరే వాటికి ప్రత్యేకంగా ఒక డైనింగ్‌ టేబుల్‌ను ఏర్పాటు చేశాం. ముక్కలుగా కోసిన గడ్డిని ఆహారంగా అందిస్తున్నాం. ప్రతి ఏడాదీ వాటికి పుట్టినరోజులు జరుపుతూ ఉంటాం. ఆ సందర్భంలో... గోశాలలోని ఆవుల్ని కూడా తీసుకొస్తాం. అవన్నీ ఇల్లంతా కలయతిరుగుతూ, అద్దంలో తమను చూసుకొని మురిసిపోతూ ఉంటాయి. మాలాగే... పెనుమత్స సీతాదేవి, నారాయణ, శివాజీరాజు దంపతులు కూడా తమ అపార్ట్‌మెంట్లలో పొట్టి ఆవులను పెంచుకుంటున్నారు.

cows.jpg

ప్రయాణాల్లోనూ మాతోనే...

ఈ ఆవులు 20 నుంచి 25 కిలోల వరకు మాత్రమే బరువుంటాయి. ఆపార్ట్‌మెంట్లలో మార్బుల్స్‌, టైల్స్‌ నేల మీద సైతం జారిపోకుండా పరిగెత్తుతూ ఉంటాయి. వీటిని మొదటిసారి చూసినవారు అవి దూడలా లేదా ఆవులా అని తికమక పడుతుంటారు. వీటి నిర్వాహణ చాలా సులువు. మా కుటుంబ సభ్యులం ఇతర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు... వీటిని కుక్కపిల్లల మాదిరిగా మా వెంట తీసుకుపోతూ ఉంటాం. ఇవి తినే పచ్చగడ్డి పరకలు, దాణా చాలా తక్కువ పరిమాణంలో ఉండడం వల్ల... కుక్కల కన్నా వీటి పెంపకం ఖర్చు చాలా తక్కువ. అంతేకాదు... పుంగనూరు ఆవులు ఎంతో విశిష్టమైనవి. వాటి పాలు, మూత్రం, పేడలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. వాటిని ఆలింగనం చేసుకోవడం వల్ల మన శరీరంలోని ఒత్తిడి, ఆందోళన తొలగి, మనసుకు ప్రశాంతత కలిగి, వ్యాధులు తగ్గిపోతాయనే భావన ఉంది. అవి విసర్జనల్ని ఇంటి ఆవరణలోని ఖాళీ ప్రదేశంలో చేస్తాయి. కనుక పరిసరాలు పాడయ్యే పరిస్థితి చాలా తక్కువే.’’

సత్యనారాయణ, ఏలేశ్వరం

Updated Date - 2022-11-24T12:50:32+05:30 IST

Read more