Kantarao: సాయం పొందినవారే మరచిపోయారు

ABN , First Publish Date - 2022-11-22T22:25:20+05:30 IST

జానపద చిత్రాలనగానే ప్రేక్షకుల మదిలో మెదిలే ఆనాటి మేటి కథానాయకుడు కాంతారావు. ‘తెలుగు సినీ పరిశ్రమకు ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ రెండు కళ్లయితే... కాంతారావు నొసటి తిలకమ’ని దర్శకరత్న దాసరి అభివర్ణించిన సందర్భాలెన్నో! పౌరాణికం, ..

Kantarao: సాయం పొందినవారే  మరచిపోయారు

లైఫ్‌

జానపద చిత్రాలనగానే ప్రేక్షకుల మదిలో మెదిలే ఆనాటి మేటి కథానాయకుడు కాంతారావు. ‘తెలుగు సినీ పరిశ్రమకు ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ రెండు కళ్లయితే... కాంతారావు నొసటి తిలకమ’ని దర్శకరత్న దాసరి అభివర్ణించిన సందర్భాలెన్నో! పౌరాణికం, సాంఘికం... జానర్‌ ఏదైనా తనదైన అభినయంతో విలక్షణ నటుడిగా జనాదరణ పొందిన ఆయన శత జయంత్యుత్సవాల సమయమిది. ఈ సందర్భంగా కాంతారావు కుమార్తె సుశీలా రావును ‘నవ్య’ పలకరించింది...

‘‘ఆత్మాభిమానం... నా కాళ్లపై నేను నిలబడగలిగేందుకు అక్షర జ్ఞానం... ఇవే మా నాన్న నాకు వారసత్వంగా ఇచ్చిన సంపద. అంతకు మించిన ఆస్తిపాస్తులు ఏముంటాయి! అందుకే విధి ఎన్ని విషమ పరీక్షలు పెట్టినా, నాన్నలానే నేను కూడా ఎన్నడూ ఎవరి వద్దా చెయ్యి చాచలేదు. నాకు ఇద్దరు అన్నయ్యలు, ఇద్దరు తమ్ముళ్లు. ఇంట్లో ఒక్కగానొక్క ఆడపిల్లను కావడంతో నాన్న నన్ను ఎంతో అబ్బురంగా పెంచారు. పైగా అదివరకే కాలం చేసిన ఆయన మొదటి భార్య పేరును నాకు ఇష్టంతో పెట్టారు. దాంతో నన్ను ఎప్పుడూ ‘అమ్మా... సుశీలా’ అనే పిలిచేవారు. మా చిన్నతనంలో నాన్న చాలా బిజీగా ఉండేవారు. రోజుకు మూడు షిఫ్టుల్లో పని చేసేవారు. దాంతో మాతో గడిపిన సమయం తక్కువే. అయినా, మమ్మల్ని క్రమశిక్షణతో పెంచారు. నిర్మాత డూండేశ్వరరావు గారి ఇంటికి తప్ప మరెక్కడికీ మమ్మల్ని వెళ్లనిచ్చేవారు కాదు.

ఓసారి సెలవు రోజున మా స్కూల్‌ స్నేహితులంతా వాళ్ల తల్లితండ్రులతో కలిసి పిక్నిక్‌ వెళ్లొచ్చారు.

అది విని... ‘నన్ను సినిమాకు తీసుకువెళ్ల’మని నాన్నతో గొడవ పడ్డాను. దాంతో ఆయన పనులన్నీ మానుకొని మరీ నన్ను ‘అపరాధ్‌’ హిందీ సినిమాకి తీసుకెళ్లారు. నాన్నతో నాకు అదొక మధుర జ్ఞాపకం.

నా కోసం షూటింగ్‌లు వదిలి...

చిన్నప్పుడు నాకు ఆరోగ్యం సరిగా లేకుంటే... నన్ను ఎంతమంది డాక్టర్లకు చూపించారో, ఎన్ని ఆస్పత్రులకు తిప్పారో లెక్కలేదు. ఆ సమయంలో రోజూ రాత్రిళ్లు నాన్న నా వద్దే నిద్ర కాసేవారు. నా కోసం ఒక్కోసారి షూటింగులనూ క్యాన్సిల్‌ చేసిన సందర్భాలున్నాయి. నేను త్వరగా కోలుకోవాలని ఎన్నో పూజలు చేశారు. స్వామీజీలను కలిశారు. నేనంటే నాన్నకు అంత ప్రేమ. ఆ ప్రేమే నన్ను మళ్లీ మామూలు మనిషిని చేసింది. నా పెళ్లి కూడా ఎంతో వైభవంగా చేశారు. తర్వాత నేను పురిటి నొప్పులతో బాధపడుతున్నప్పుడు పై అంతస్తు నుంచి నన్ను తన రెండు చేతులతో మోసుకొని కారులో కూర్చోబెట్టి ఆస్పత్రికి తీసుకెళ్లారు.

కంటే కూతురినే కనాలి...

ఓ సారి నాన్నను పలకరించడానికి తమ్మారెడ్డి కృష్ణమూర్తిగారు వచ్చారు. అప్పుడు ఆయనకు నన్ను పరిచయం చేస్తూ ‘‘మా అమ్మాయి సుశీల... కాదు, మా అమ్మ. చిన్నప్పుడు నాకు మా అమ్మ సీతారావమ్మ ఎలాంటి సపర్యలు చేసిందో... అవన్నీ ఇప్పుడు నాకు నా కూతురు చేస్తోంది. అందుకే కంటే కూతురినే కనాలి’’ అని కళ్ళనీళ్లు పెట్టుకున్నారు. మా అన్నయ్యలు, తమ్ముళ్లు కూడా అమ్మ, నాన్నను కంటికి రెప్పలా చూసుకున్నారు. మా చిన్న తమ్ముడు సత్యం అయితే మా అమ్మకు తాను అమ్మ అయ్యాడు.

సింహంతో పోరాటం...

నాన్నకు పట్టుదల ఎక్కువ. ‘ప్రతిజ్ఞ’ సినిమా పతాక సన్నివేశంలో కత్తి యుద్ధం ప్రాక్టీసు చేస్తున్నప్పుడు, ‘మీరు కత్తి తిప్పుతుంటే కర్ర తిప్పుతున్నట్టు ఉంద’ని దర్శకుడు హెచ్‌ఎం రెడ్డిగారు అన్నారట. దాంతో స్టంట్‌ మాస్టర్‌ సోమనాథన్‌ వద్ద రెండు రోజుల్లో కత్తి యుద్ధంలో టెక్నిక్స్‌ నేర్చుకున్నారట. విఠలాచార్య గారి సినిమా షూటింగ్‌కు ఓసారి మా నాన్న నన్నూ తీసుకెళ్లారు. ఆ వేళ సింహంతో నాన్న పోరాడే సన్నివేశాలు చూసి భయపడ్డాను. ‘గౌరీమహత్యం’ సినిమాలో శివుడి పాత్రలో నాన్న, నిజంగానే నాగుపామును మెడలో ధరించారు. మొదట బుసలు కొట్టిన ఆ పాము... నాన్న మచ్చిక చేసుకోవడంతో తర్వాత గమ్మునుండేదట. మా నాన్న పోషించిన అనేక వేషాల్లో నారదుడి పాత్రంటే నాకు చాలా ఇష్టం. నాన్న ఆత్మకథను ‘అనగనగా ఒక రాకుమారుడు’ పేరుతో క్రియేటివ్‌ లింక్స్‌వాళ్లు తీసుకొచ్చారు.

తిండికి లోటులేదు...

మద్రాసు రాఘవాచారి రోడ్డులో మాది మూడంతస్తుల ఇల్లు. అందులోనూ ఇంటి నిండా పనివాళ్లు, మూడు కార్లు (నాన్నకు ఫియట్‌, మాకు డార్జ్‌, ఇంటి అవసరాల కోసం అంబాసిడర్‌) రాజ వైభవాన్ని తలపించేది. మా అమ్మ హైమావతి పరమ సాత్వికురాలు. అంతకుమించి అమ్మ, నాన్నలు సంస్కారవంతులు. ఎంతంటే... పనివాళ్లను సైతం ఏకవచనంతో పిలిచేవారు కాదు. అల్లు రామలింగయ్య, రాజబాబు, రాజశ్రీ అప్పుడప్పుడు మా ఇంటికొచ్చేవారు. కష్టాలతో గుమ్మం తొక్కిన వాళ్లకు లేదనకుండా సహాయం చేయడం నాన్న స్వభావం. అలా ఆర్థికంగా చితికిపోయి, ఒంటి చీరతో మిగిలిన ఓ నటికి అమ్మ చీరలు కొనివ్వడం నాకు ఇంకా గుర్తుంది. మా నాన్న సొంతూరు కోదాడ దగ్గర ‘గుడిబండ’. ఆయన మొదట మాలీ పటేల్‌ (గ్రామాధికారి). అప్పుడు వారసత్వంగా నాన్నకు 600 ఎకరాల భూమి వచ్చింది. అందులో కొంత దానధర్మాలకు, మరికొంత నాన్న సినిమాలు, సరదాలకు కరిగిపోయింది. సొంతంగా సినిమాలు తీసి అప్పులపాలయ్యారు. దాంతో మిగిలిన 60 ఎకరాలు, మద్రాసులో ఇష్టంగా కట్టుకున్న మూడంతస్తుల భవనం అమ్మేశారు. 1990లో కట్టుబట్టలతో హైదరాబాద్‌ వచ్చారు. అయినా, కార్లు, బంగ్లాలు లేవని ఆయన ఎన్నడూ కుంగిపోలేదు. నాన్న చనిపోయేనాటికి ఒక్క పైసా అప్పులేదు. ఎన్నడూ వారికి తిండికి జరగకుండా లేదు. ముఖ్యంగా ఆయనను చివరి రోజుల్లో మనవళ్లు, మనుమరాలు కంటికి రెప్పలా చూసుకున్నారు.

నాకూ కష్టాలు తప్పలేదు...

మా నాన్న సమయపాలనకు అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. నాన్న నుంచి నేను నేర్చుకున్న ఈ విలువలతోనే కష్టాల సముద్రాన్ని ఈది గట్టున పడ్డాను. నా భర్త అప్పారావు వ్యాపారంలో నష్టపోయి యావదాస్తినీ పోగొట్టారు. దాంతో మా కుటుంబం రోడ్డున పడిన పరిస్థితి. ఆ సమయంలో ఇంటి బాధ్యతలు భుజానికెత్తుకున్నాను. బీఏ ఇంగ్లీష్‌ విద్యార్హత ఉన్న నేను, ఓ స్కూల్లో టీచర్‌గా పని చేస్తూ, నా ముగ్గురి పిల్లలను బాగా చదివించాను. వారిప్పుడు ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు. అనారోగ్యంతో నా భర్త చనిపోయి నెల కూడా పూర్తి అవ్వలేదు. ఇంటిపట్టునే ఉంటూ, ఇప్పుడు కొన్ని ప్రచురణ సంస్థలకు ఫ్రీలాన్స్‌ ఫ్రూఫ్‌ రీడర్‌గా పనిచేస్తున్నాను. ‘కాంతరావు గారి అమ్మాయి ఒక చిన్న అద్దె గదిలో ఉంటుంద’ని కొందరు నన్ను చూసి జాలి పడుతుంటారు. అలాంటి వారికి నేను చెప్పేది ఒక్కటే... కాంతారావు గారి అమ్మాయిగా పుట్టడమే ఒక అదృష్టం. అంతకు మించిన సంతోషం ఏముంటుంది! మా నాన్న నాకిచ్చిన ఆత్మాభిమానం, క్రమశిక్షణ, సంస్కారం... ఈ ఆస్తిపాస్తులు చాలవా జీవితాంతం ఓ మనిషిలా బతకడానికి! పైగా నేను తాత, తండ్రుల పేరును కాదు, స్వశక్తిని నమ్ముకున్నాను. అదే నాకు శ్రీరామరక్ష.

ఆమె మరచిన సాయం...

ఓ రోజు హైదరాబాద్‌లోని ‘వస్తాడె మా బావ’ అవుడోర్‌ సినిమా షూటింగ్‌ చూసేందుకు తండ్రితో కలిసి ఒకమ్మాయి వచ్చింది. ఆ సినిమాలో తండ్రి పాత్రలో నటిస్తున్న మా నాన్న ఆ అమ్మాయి కళ్లు బావున్నాయని, అప్పటికప్పుడు ఫొటో షూట్‌ చేయించారు. మద్రాసు తిరిగి వచ్చాక, ఆ ఫొటోలను మా పెద్దన్నయ్యతో దాసరి గారి వద్దకు పంపారు. అవి చూసిన ఆయన అమ్మాయికి ‘తూర్పు- పడమర’ సినిమాలో అవకాశం ఇచ్చారు. తర్వాత ఆమె పెద్ద హీరోయిన్‌ అయింది. ఆ నటి మరెవరో కాదు... నాటి హీరోయిన్‌ మాధవి. కానీ ఆమె తర్వాత ‘కాంతారావు అంటే ఎవరు’ అన్న తీరులో ప్రవర్తించింది. పైగా తాను పరిశ్రమకు పరిచయం చేయడంలో మా నాన్న పాత్రను ఎక్కడా చెప్పిన పాపాన పోలేదు. అలా కొందరికి నాన్న సినిమా అవకాశాల విషయంలో సహాయం చేశారు. మరొక పేరున్న పెద్ద హీరోయిన్‌ తొలినాళ్లలో మా ఇంటికి రిక్షాలో వస్తుండేది. తర్వాత ఆమెకు బాగా డబ్బు కూడింది. ఒకరోజు తను మా అమ్మకు ఫోన్‌ చేసి, ‘మీకు ఆర్థిక సహాయం చేసే శక్తి నాకుంది. కానీ చేయడానికి మనసు రావడంలేదు. మీ పిల్లలు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే’ అని దెప్పిపొడిచిందట. దాంతో అమ్మ బాగా కుమిలిపోయింది. మా సాయం పొందినవారందరూ ఆ తరువాత మమ్మల్ని మరచిపోయారు.

జీవిత, రాజశేఖర్‌ దంపతులు మాకు లక్ష రూపాయలు సహాయాన్ని ప్రకటించి, తర్వాత మౌనంగా ఉన్నారు. కానీ టి.సుబ్బిరామిరెడ్డి వంటి పెద్దలు మాత్రం మా నాన్న బతికుండగానే కాదు, ఆయన పోయిన తర్వాత కూడా ఆర్థిక సహాయం అందించారు. ఇప్పటికీ నాతో వాణిశ్రీ, కవిత, రాజశ్రీ, రోజారమణి ఫోన్‌ చేసి పలకరిస్తుంటారు. పరిశ్రమలో నాకు బెస్ట్‌ ఫ్రెండ్‌ అంటే... డూండి గారి అమ్మాయి సునందినీనే!

తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది...

‘‘బెల్లం చుట్టూ ఈగలు అన్నట్టు డబ్బుంటేనే సమాజంలో విలువ’’ అని మా నాన్న చివరి రోజుల్లో పదేపదే అంటుండేవారు. ఆయన్ను సోదరుడిగా ఆదరించిన ఎన్టీఆర్‌ స్మారక పురస్కారాన్ని అందుకోవాలని ఆశపడ్డారు. తనకంటూ సొంతిల్లు ఉండాలని పరితపించారు. అవి రెండూ తీరకుండానే నాన్న కన్ను మూశారు. మా అమ్మ కూడా సొంత గూటిలో తదిశ్వాస విడవాలనే కోరిక తీరకుండానే, రెండేళ్ల కిందట కాలం చేసింది. తెలంగాణ తొలి తరం కథానాయకుడిగా నాన్నను తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. అందుకు వారికి కృతజ్ఞతలు. అయితే, పది కాలాల పాటు మా నాన్న పేరు గుర్తుండేలా ప్రభుత్వం ఏమైనా స్మారక చిహ్నం నిర్మించినా, ఆయన పేరును ఏ సంస్థకైనా పెట్టినా... మరింత ఆనందిస్తాం. మా అమ్మ, నాన్నలను కనిపెట్టుకొని చివరి వరకు సేవలు చేసిన మా తమ్ముళ్లకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు ఒకటి హైదరాబాద్‌లో కేటాయిస్తే... ‘కాంతారావు కుటుంబం ఇక్కడుంటుంద’ని నలుగురూ చెప్పుకొంటారు. అలాగైనా నాన్న పేరు చిరకాలం గుర్తుంటుందనేది మా కుటుంబ సభ్యుల కోరిక.’’

కె.వెంకటేశ్‌

ఫొటోలు: గోపిశెట్టి శ్రీను

Updated Date - 2022-11-22T22:28:18+05:30 IST

Read more