Kandula Savitri: చిన్ననాటి కోరిక... ఆవిష్కరణలకు తెరతీసింది

ABN , First Publish Date - 2022-12-13T22:46:23+05:30 IST

నల్లమలలో ఒక కొండ శిఖరం మీద క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నాటి బౌద్ధ స్థూపాన్ని కనుగొన్న చరిత్ర పరిశోధకురాలిగా కందుల సావిత్రి ఇటీవల వార్తల్లోకి నిలిచారు.

 Kandula Savitri: చిన్ననాటి కోరిక...  ఆవిష్కరణలకు తెరతీసింది

నల్లమలలో ఒక కొండ శిఖరం మీద క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నాటి బౌద్ధ స్థూపాన్ని కనుగొన్న చరిత్ర పరిశోధకురాలిగా కందుల సావిత్రి ఇటీవల వార్తల్లోకి నిలిచారు. ప్రకాశం జిల్లా కంభం మండలంలోని భైరవ కొండమీదకు ఆమె చేసిన ప్రయాణం కొత్త చారిత్రక ఆవిష్కరణలకు నాంది పలికింది. రాతి బండల్లో... 13 వందల ఏళ్ల కిందటి తెలుగు శాసనాన్ని వెలికితీసిన ఆమె... ఆ ప్రాంతంలోనే ఆదిమానవుల ఆవాసాలనూ గుర్తించారు. ఆ ప్రాంతపు శాసనాల మీద మరింత పరిశోధనకు సిద్ధమవుతున్న సావిత్రి... ‘నవ్య’తో పంచుకున్న విశేషాలివి.

మా ప్రాంతంలో చిన్నప్పటి నుంచీ నేను వెళ్తున్న ఆలయాలను ఈసారి కొత్త చూపుతో సందర్శించాను. బోగోలు పాఠశాల వద్ద ఉన్న లక్ష్మణ్ణ దేవాలయంలో ఒక శాసనాన్ని, అక్కడికి సమీపంలోని పంట పొలంలో మరో శాసనాన్ని గుర్తించాను. మొత్తం ఆరు శాసనాలు సేకరించాను.

బండల మీద ఏవో అక్షరాలు ఉన్నాయి. ఫోటో తీసేప్పుడు కాస్త జారినా ప్రాణాలు దక్కవు. ఆ ప్రయత్నంలో నా కాలు బండల మీద నుంచి జారింది. మావాళ్లు పట్టుకోవడంతో బతికిపోయాను. ఆ ఫోటో ఒక చరిత్రకు సాక్ష్యం అవుతుందని అప్పుడు నాకు తెలీదు.

‘‘మాది ప్రకాశం జిల్లా కంభం మండలంలోని లింగాపురం. మా ఊరి నుంచి నల్లమల కొండలు కనిపిస్తూ ఉంటాయి. అంకళమ్మతిప్ప, ఽధనమ్మపిట్ట అనే రెండు కొండలు మా ఊరి దగ్గర్లోనే ఉండేవి. నల్లమల అడవుల్లోంచి నల్లవాగు, జంపలేరు మాకు సమీపంలోనే ప్రవహించేవి. శ్రీకృష్ణదేవరాయలు, ఆయన భార్య నిర్మించిన, దేశంలోనే అతి పెద్దదైన కంభం చెరువు ఉన్నదీ మా ఊళ్లోనే. అడవుల్లోని కోనలకు శివరాత్రికో, కార్తిక మాసంలోనో వెళ్లి నిద్ర చేసేవాళ్లం. ఆ సమయంలో కొండలమీద ఉన్న ఆలయాల గురించి పెద్దవాళ్లు ఎన్నో సంగతులు చెప్పేవారు. మా ఊరి నుంచి నడక మొదలు పెట్టి... మూడు కొండలు ఎక్కి దిగితే ఎదురయ్యే నాలుగో కొండ గురించి చెప్పిన కథలు నాలో నాటుకుపోయాయి. దాని పేరు ‘భైరవ కొండ’. ఆ కొండ శిఖరం మీద ఉన్న అద్భుతాల గురించి చిన్నప్పటి నుంచీ ఆలోచించేదాన్ని. ఎప్పటికైనా భైరవకొండ ఎక్కాలని అనుకొనేదాన్ని. అయితే దారులు సరిగ్గా లేని అడవుల్లోంచి నడవాలి. కొండలు దాటాలి. అదంత తేలికైన పని కాదు. చుట్టుపక్కల కొన్ని ఊళ్ల నుంచి కార్తిక మాసంలో కొందరు భైరవ కొండకు వెళ్లేవారు.

అనారోగ్యం... ఆందోళన

నేను నాగార్జున యూనివర్శిటీ క్యాంప్‌సలో హిస్టరీలో పీజీ చేశాను. వివిధ ప్రాంతాల్లో తాత్కాలిక అధ్యాపకురాలిగా పనిచేయడం, పెళ్లి, ఇద్దరు పిల్లలు, శ్రీకాళహస్తి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో లెక్చరర్‌గా ఉద్యోగం... అయినా భైరవకొండ నన్ను పిలుస్తూనే ఉండేది. నా పరిశోధక గురువు డాక్టర్‌ డి.వి.వెంకటే్‌షరెడ్డి పర్యవేక్షణలో భైరవకొండ మీది నిర్మాణాలను అధ్యయనం చేయాలనుకున్నాను. అయితే హఠాత్తుగా నా ఆరోగ్యం దెబ్బతింది. కిడ్నీ సంబంధమైన సమస్య నన్ను కుంగదీసింది. సర్జరీ అయ్యింది. దాంతో ‘భైరవకొండ ఎక్కలేనేమో?’ అనే ఆందోళన మొదలైంది. ఈలోగా కొవిడ్‌ కదలనివ్వలేదు. అన్నీ సర్దుకున్నాక... మా ఊళ్లో ఉన్న చిన్ననాటి మిత్రుల సాయం అడిగాను. వారు ‘సరే’ అన్నారు. మొత్తం 20మంది ఒక బృందంగా ఏర్పడ్డాం. కార్తిక మాసం కోసం ఎదురు చూశాం. ఈ ఏడాది నవంబర్‌ 7న... రెండో కార్తిక సోమవారం నాడు భైరవకొండకు బయలుదేరాం. చాలా శ్రమ పడి నాలుగో కొండ శిఖరం మీదికి చేరుకున్నాం. అక్కడ శిథిలావస్థలో ఉన్న మూడు చిన్న చిన్న ఆలయాలున్నాయి. అవి శివాలయం, అమ్మవారి గుడి, భైరవస్వామి ఆలయం అని మాఊరి వాళ్లు చెప్పారు. శివాలయం ఆకృతి భిన్నంగా ఉంది. ఇది ఇటుకలతో నిర్మించినట్టు తెలుస్తోంది. మిగిలిన రెండూ రాతి నిర్మాణాలు. అక్కడి పరిసరాలన్నీ పరిశీలించి ఫోటోలు తీశాను.

రాళ్లమీద అక్షరాలు

అక్కడ కొండ రాళ్లమీద కొన్ని అక్షరాలు కూడా కనిపించాయి. అవన్నీ ఏదో పురాతన చరిత్రను చెబుతున్నట్టు అనిపించింది. కానీ నా ఊహ మాత్రమే చరిత్ర కాదు కదా... శాస్త్రీయ నిర్ధారణ కావాలి. కాబట్టి ఆ ఫోటోలను మైసూర్‌లోని పురావస్తు శాఖ (ఎపిగ్రఫీ) డైరెక్టర్‌ మునిరత్నంరెడ్డి గారికి పంపించాను. దేశంలో ఎక్కడ ఏ పురాతన శాసనం దొరికినా ఆయన పరిశీలనకు పంపుతారు. నేను పంపిన ఫోటోల్లోని అక్షరాలు అస్పష్టంగా ఉన్నాయని, మరొకసారి అక్కడికి వెళ్లి... మరింత స్పష్టంగా ఫోటోలు తీసి పంపమని ఆయన సూచించారు. అప్పటికే బాగా అలసిపోయి ఉన్నాను. మా బృందంలో చాలామంది జ్వరాలు, ఒళ్లు నొప్పులతో ఉన్నారు. ‘వెంటనే మరో ప్రయాణం సాధ్యమేనా?’ అనే సందేహం కలిగింది. కానీ తప్పదు. కార్తిక మాసంలో అయితేనే మనుషులు వెంట వస్తారు.

రెండో ప్రయాణం

అందుకే నవంబరు 14న మళ్లీ ప్రయాణమయ్యాం. వెళ్లడానికి ఒక రోజు, రావడానికి ఒక రోజు పడుతుంది. తినడానికి కావలసినవి మోసుకెళ్లాలి. అనారోగ్యంతో ఉన్న నాకు సాయంగా వచ్చిన నా భర్త లక్ష్మారెడ్డి ఒక దశలో ముందుకు కదలలేకపోయారు. ఎత్తయిన ఆ కొండమీద ఆయనకు శ్వాస అందలేదు. ఆ రాత్రి కారడవిలోనే గడిపాం. తెల్లవారాక మళ్లీ కొండ మీదకు నడిచాం. మరింత శ్రద్ధగా ప్రతి అడుగూ పరిశీలించాం. గుడికి అర కిలోమీటరు దూరంలో రాళ్ల మధ్యన ఒక నీటి దొనను చేరుకున్నాం. దాన్ని మా వాళ్లు ‘శాసనాల దొన’ అంటారు. అక్కడ రాళ్ల మీద ఉన్న అక్షరాల వల్ల ఈ పేరు వచ్చి ఉండొచ్చు. ఆ దొన రాళ్ల మధ్య దాదాపు 50 అడుగుల లోతులో ఉంది. బండల మీద ఏవో అక్షరాలు ఉన్నాయి. ఫోటో తీసేప్పుడు కాస్త జారినా ప్రాణాలు దక్కవు. ఆ ప్రయత్నంలో నా కాలు బండల మీద నుంచి జారింది. మావాళ్లు పట్టుకోవడంతో బతికిపోయాను. ఆ ఫోటో ఒక చరిత్రకు సాక్ష్యం అవుతుందని అప్పుడు నాకు తెలీదు.

ఉత్పత్తి పిడుగు... ఏకాంత నివాసి

ఆ రాతి శాసనంలో ఉన్న అక్షరాలు 8వ శతాబ్దం నాటి తెలుగు లిపి అని కేంద్ర పురావస్తుశాఖ డైరెక్టర్‌ మునిరత్నంరెడ్డి గారు తేల్చి చెప్పారు. ‘ఉత్పత్తి పిడుగు ... ఏకాంత నివాసి’ అనే మాటలు దానిమీద చెక్కి ఉన్నాయి. ఈ అక్షరాలకు, బౌద్ధస్థూపాన్ని పోలిఉన్న శివాలయానికీ ఏదో సంబంధం ఉందని అర్ధమయింది. అదేమిటో కూడా ఆయన చెప్పారు. ఇప్పటిదాకా శివాలయంగా భావిస్తున్నది నిజంగానే బౌద్ధస్థూపం. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నాటిది. శైవమత వ్యాప్తి కాలంలో దీని మీద బహుశా దాడి జరిగి ఉండొచ్చు. ‘కాలముఖ’ అనే వీరశైవ భక్తులు దాన్ని శివాలయంగా మార్చారు. శాసనాల దొన రాతి బండల మీద ఉన్న అక్షరాలు చెబుతున్నది అదే. ‘‘పిడుగులా వచ్చి ఏకాంత నివాసి అయిన దైవం మీద మీద దాడి చేశారు’’ అనే సమాచారాన్ని రాతి మీద చెక్కి భద్రపరిచారు. ఆ అక్షరాల మీద చెక్కిన శివలింగం బొమ్మ దీన్ని నిర్ధారిస్తోంది. శివాలయంగా మారిన తర్వాత... దాని పక్కనే భైరవ, అమ్మవారి ఆలయాలను నిర్మించారని తెలుస్తోంది. బౌద్ధస్థూపం ముందర రెండు శాసనాలు ఉన్నాయి. సుమారు 20 నుంచి 30 వరకు తలలు నరికిన దేవతామూర్తుల విగ్రహాలున్నాయి. ఇవన్నీ పదమూడు వందల ఏళ్ల కిందట ఏం జరిగిందో సూచిస్తున్నాయి.

బయటపడిన ఆదిమానవ గుహ...

బౌద్ధస్థూపం నుంచి తూర్పు వైపు కిలోమీటరు ఎత్తున్న ఒక కొండ ఎక్కాం. ఒక గుహ కనిపించింది. పెద్ద బండరాయికి ఒకవైపు ప్రవేశ మార్గం ఉంది. మరోవైపుబయటకు వచ్చే దారి ఉంది. బాగా వంగి లోపలకు వెళ్లాలి. ఆ గుహ లోపల ఎంత దూరం ఉందో తెలీదు. మేం 15 అడుగులకు మించి వెళ్లలేకపోయాం. గుహలో ఉన్న అవశేషాలను బట్టి... అది వేల సంవత్సరాల నాటి ఆదిమానవుల ఆవాసంగా అనిపించింది. ఈ గుహ నుంచి శ్రీశైలం, మహానందితో పాటు ఐదు పుణ్యక్షేత్రాలకు సొరంగ మార్గాలు ఉన్నాయని ఇక్కడి ప్రజలు చెబుతూ ఉంటారు. గుహ లోపల పరిశోధనలు జరిపితే ఎన్నో అద్భుత విశేషాలు బయటపడవచ్చు.

పొలాల్లోనూ శాసనాలు

మా ప్రాంతంలో చిన్నప్పటి నుంచీ నేను వెళ్తున్న ఆలయాలను ఈసారి కొత్త చూపుతో సందర్శించాను. బోగోలు పాఠశాల వద్ద ఉన్న లక్ష్మణ్ణ దేవాలయంలో ఒక శాసనాన్ని, అక్కడికి సమీపంలోని పంట పొలంలో మరో శాసనాన్ని గుర్తించాను. మొత్తం ఆరు శాసనాలు సేకరించాను. వాటిలోని అక్షరాలు కొన్ని అస్పష్టంగా ఉన్నాయి. పరిశీలించి వాటి లోతుపాతులు తేల్చాల్సి ఉంది. మా కాలేజీ ప్రిన్సిపాల్‌ రాజశేఖర్‌ ప్రోత్సాహం ఈ పరిశోధన ప్రయాణంలో నాకు ధైర్యాన్ని ఇస్తోంది.’’

- వడ్లపూడి బాలసుబ్రహ్మణ్యం

Updated Date - 2022-12-13T22:46:24+05:30 IST