‘స్పృహ కోల్పోతుంటే..?’

ABN , First Publish Date - 2022-10-18T09:49:31+05:30 IST

స్పృహ తప్పటాన్ని వైద్య పరిభాషలో ‘సింకోప్‌’ అంటారు. స్పృహ తప్పటానికి కారణం ఏదైనా, ఆ సమయంలో శరీరంలో జరిగే మార్పులు ఒకే రకంగా ఉంటాయి.

‘స్పృహ  కోల్పోతుంటే..?’

ఎలాంటి రుగ్మతతో సంబంధం లేకుండా, కొందరు హఠాత్తుగా స్పృహ తప్పి పడిపోతూ ఉంటారు. ఈ లక్షణం ప్రాణాంతకమైనది కాకపోయినా ఈ పరిస్థితి పట్ల అవగాహన పెంచుకోవడం అవసరం. 


రక్తపోటు పడిపోతే?

స్పృహ తప్పటాన్ని వైద్య పరిభాషలో ‘సింకోప్‌’ అంటారు. స్పృహ తప్పటానికి కారణం ఏదైనా, ఆ సమయంలో శరీరంలో జరిగే మార్పులు ఒకే రకంగా ఉంటాయి. మెదడు పనిచేయకుండా మూత పడేంతగా దానికి చక్కెర, ఆక్సిజన్‌ సరఫరా పడిపోతుంది. నిద్రపోయినప్పుడు ఎలాగైతే మెదడు నిద్రాణంగా ఉండి కూడా గుండె కొట్టుకోవటం, ఊపిరి పీల్చుకోవటంలాంటి శరీర జీవక్రియలు సక్రమంగా జరుగుతూ ఉంటాయో, స్పృహ కోల్పోయినప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. 25 - 40ు మందిలో స్పృహ కోల్పోవటానికి కారణం ‘వాసోవాగల్‌ సింకోప్‌’. అంటే గుండె కొట్టుకునే తీరు, రక్తపోటులను నియంత్రించే నాడీ వ్యవస్థలో కొంత భాగం పనిచేయకపోవడం మూలంగా స్పృహ కోల్పోతే దాన్ని వాసోవాగల్‌ సింకోప్‌ అంటారు. ఇలా ఎక్కువ సమయంపాటు నిలబడ్డప్పుడు, శరీర ఉష్ణోగ్రత పెరిగిపోయినప్పుడు, రక్తాన్ని చూసినప్పుడు, భయానికి లోనైనప్పుడు జరుగుతుంది.


ఇర్రెగ్యులర్‌ హార్ట్‌బీట్‌

స్పృహ కోల్పోయేవారిలో 4ు మందికి ఇర్రెగ్యులర్‌ హార్ట్‌బీట్‌ కారణం. అరిథ్మియా అనే ఈ సమస్యలో గుండె అత్యంత వేగంగా నిమిషానికి 150 సార్లు కొట్టుకుంటుంది. దాంతో శరీరంలోని రక్తం మెదడుకు చేరి, తిరిగి గుండెకు చేరేంత సమయం ఉండదు. దాంతో మెదడుకు రక్తం అందక స్పృహ కోల్పోతాం. ఇది అంత ప్రమాదకరమైన సమస్య కాకపోయినా తరచుగా స్పృహ కోల్పోతూ ఉంటే మాత్రం తప్పక వైద్యులను సంప్రదించాలి.


ఆకలేస్తే?

ఎక్కువ సమయంపాటు ఆహారం తీసుకోకపోతే మెదడుకు కావలసిన శక్తి అందక స్పృహ కోల్పోతాం. ఆహారం తీసుకోవట ఆలస్యం చేస్తే రక్తంలో చక్కెర శాతం తగ్గి నీరసించిపోతాం. హైపోగ్టైసీమియా అనే రక్తంలో అతి తక్కువ చక్కెర నిల్వలు కలిగి ఉండే మధుమేహులు స్పృహ కోల్పోయి అలాగే కోమాలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంది. ఒకవేళ మధుమేహం లేని వాళ్లు ఆహారం తీసుకోవటం ఆలస్యమైతే ఒళ్లు తూలిపోయి, చమటలు పట్టి అంతిమంగా స్పృహ కోల్పోతారు. 


భావోద్వేగాల ఫలితం

అత్యంత సంతోషకరమైన లేదా విషాదకరమైన వార్త విన్నప్పుడు ఇలా జరగొచ్చు. యాంగ్జయిటీ, డిప్రెషన్‌, హిస్టీరియా రుగ్మతలున్న రోగుల్లో ఇలా జరిగే అవకాశాలు ఎక్కువ. విపరీతమైన ఒత్తిడి లేదా ఆందోళన వల్ల రక్తపోటు ఎక్కువ లేదా తక్కువై స్పృహ కోల్పోతాం. 


హఠాత్తుగా లేచి నిలబడ్డప్పుడు

హఠాత్తుగా లేచి నిలబడ్డప్పుడు కళ్లు తిరిగినట్టై తూలి పడబోతాం. ఇలా జరగటానికి కారణం నిలబడ్డప్పుడు శరీరంలోని రక్తం భూమ్యాకర్షణ వల్ల కాళ్లలోకి చేరుకోవటమే! ఇలాంటప్పుడు గుండె రక్తాన్ని పైవైపుకి మెదడుకు పంపేందుకు ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. ఇందుకోసం శరీరంలోని ప్రత్యేక కణాలు రక్తపోటులోని తగ్గుదలను గ్రహించి గుండె మరింత వేగంగా రక్తాన్ని పంప్‌ చేసేలా సిగ్నల్‌ ఇవ్వాల్సిందిగా మెదడును ప్రేరేపిస్తాయి. అయితే డీహైడ్రేషన్‌కు గురయినప్పుడు, అవసరానికి మించి ఆహారం ఎక్కువగా తీసుకున్నప్పుడు శరీరం ఆశించినంత వేగంగా స్పందించలేదు. ఫలితంగా స్పృహ కోల్పోతాం. లేచి నిలబడిన వెంటనే ఇలా అనిపిస్తే వెంటనే తల వంచి కాళ్ల మధ్య ఉంచాలి. ఇలా చేస్తే మెదడుకు రక్త సరఫరా జరిగి స్పృహ కోల్పోకుండా ఉంటాం. 


కారణాలు ఏవైనా తరచుగా స్పృహ కోల్పోతూ ఉంటే అశ్రద్ధ చేయకుండా వైద్యుల్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.

Updated Date - 2022-10-18T09:49:31+05:30 IST