Janhvi Kapoor: ఫిల్టర్స్‌ అన్నీ వదిలేశా!

ABN , First Publish Date - 2022-11-27T02:41:10+05:30 IST

బాలీవుడ్‌లో తనదైన ముద్ర వేయటానికి ప్రయత్నిస్తున్న యువ నటీమణుల్లో జాన్వీ కపూర్‌ ఒకరు.

Janhvi Kapoor: ఫిల్టర్స్‌ అన్నీ  వదిలేశా!

బాలీవుడ్‌లో తనదైన ముద్ర వేయటానికి ప్రయత్నిస్తున్న యువ నటీమణుల్లో జాన్వీ కపూర్‌ ఒకరు. శ్రీదేవి కూతురుగా... అమ్మ వారసత్వాన్ని నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నానంటున్న జాన్వీ - తాను దక్షిణాది అమ్మాయినేనంటుంది. ఒక ఫ్యాషన్‌ షోలో పాల్గొనటానికి హైదరాబాద్‌కు వచ్చిన జాన్వీని ‘నవ్య’ పలకరించినప్పుడు అనేక విశేషాలు చెప్పింది. వాటిలో కొన్ని..

‘‘నేను దక్షిణాది అమ్మాయినే! నేను ఉత్తరాదిన పెరిగి ఉండచ్చు... కానీ నా సంస్కృతి సంప్రదాయాలన్నీ దక్షిణాదివే! అందుకే చాలా సందర్భాలలో నేను దక్షిణాదికి చెందిన అమ్మాయిలా కనిపిస్తూ ఉంటా! చిన్నప్పుడు నాన్నగారి (బోనీకపూర్‌) షూటింగ్‌లు హైదరాబాద్‌లో ఎక్కువగా అవుతూ ఉండేవి. అందువల్ల ముందు హైదరాబాద్‌ వచ్చేదాన్ని. హైదరాబాద్‌లో కొద్ది కాలం ఉండి... ఆ తర్వాత తిరుపతి వెళ్లేదాన్ని. ఇప్పటికీ తిరుపతికి తరచూ వెళ్తూనే ఉంటా!

తెలుగు సినిమాలు...

ఇప్పటిదాకా నేను టాలీవుడ్‌ సినిమాలు చేయలేదు. కానీ చేయాలని ఉంది. సమీప భవిష్యత్తులో తెలుగు సినిమాలు చేస్తాననే నమ్మకం ఉంది. మంచి పాత్ర కోసం ఎదురుచూస్తున్నా! ఇక్కడ ఒక విషయం చెప్పాలి. టాలీవుడ్‌ సినిమాలను చూస్తుంటే చాలా గర్వంగా ఉంటుంది. సాధారణంగా హిందీ టెలివిజన్‌ ఛానల్స్‌లో తెలుగు సినిమాలు డబ్‌ అయి వస్తూ ఉంటాయి. వాటికి మంచి క్రేజ్‌ ఉంది. ఈ చిత్రాల వల్ల దక్షిణాది సినిమాల గురించి ఉత్తరాది ప్రేక్షకులకు తెలిసింది. ఈ చిత్రాల వల్ల దక్షిణాది చిత్రాలు హిందీ ప్రేక్షకులకు దగ్గరయ్యాయి. ఇప్పుడు తెలుగు దర్శకుల, నటుల సినిమాలు నేరుగా విడుదల అవుతున్నాయి. వాటికి మంచి ఆదరణ లభిస్తోంది. టాలీవుడ్‌లో అందరూ బాగా కష్టపడతారు. నా చిన్నప్పుడు అమ్మ షూటింగ్‌లో ఎంత కష్టపడి పనిచేసేదో నాకు తెలుసు.

బాలీవుడ్‌ గురించి...

బాలీవుడ్‌లో నా ప్రయాణం ఇప్పుడే ప్రారంభమయింది. చేయాల్సింది ఇంకా చాలా ఉంది. గ్లామరస్‌ పాత్రలతో పాటుగా ‘మిలీ’లో చేసిన పాత్రల్లాంటివి చేయాలనేది నా ఉద్దేశం. ‘మిలీ’లో నా నటనకు చాలా ప్రశంసలు వచ్చాయి. ఇప్పటిదాకా నేను చేసిన సినిమాల్లో ‘మిస్టర్‌ అండ్‌ మిస్‌ మాహీ’లో పాత్ర చాలా కష్టమైనది. అందులో నేను క్రికెటర్‌ని. ఈ సినిమా షూటింగ్‌ సమయంలో నా భుజానికి దెబ్బ తగిలింది. ఆ నొప్పి ఇంకా తగ్గలేదు.

నచ్చిన ట్రెండ్స్‌...

అమ్మకు అందంగా కనిపించటమంటే చాలా ఇష్టం. తను ఇంట్లో ఉన్నా, బయటకు వెళ్లినా, మంచి దుస్తులు ధరించేది. తను వేసుకోవటమే కాదు నాకు, నా సోదరి కుషికి కూడా మంచి దుస్తులు వేసేది. మా ఇద్దరిని రెండు బొమ్మల మాదిరిగా చూసేది. చిన్నపిల్లలు- బొమ్మలకు దుస్తులు వేసి ఆనందపడతారు కదా! అలా మా ఇద్దరికీ తను వేసి ఆనందపడేది. ఇక నేను ట్రెండ్‌ను ఫాలో అవుతూ ఉంటా. కానీ నేను వేసుకొనే దుస్తులు నా వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించాలనుకుంటా! నేను వేసుకొనే ప్రతి డ్రెస్‌ ఫొటో కుషికి పంపుతా. తను ‘ఓకే’ చేసిన తర్వాతే నేను వేసుకుంటా!

అమ్మాయిలకు నా సలహా...

కొందరు బయటకు ఒకలా కనిపిస్తారు. లోపల వేరే ఆలోచనలు ఉంటాయి. అంటే ఫిల్టర్స్‌ పెట్టుకుంటారన్నమాట! నేను కూడా మొదట్లో అలాగే ఉండేదాన్ని. నెమ్మదిగా ఫిల్టర్స్‌ అన్నీ వదిలేసా! నేను బయటకు ఎలా కనిపిస్తానో... లోపల కూడా అలాగే ఉంటా. మనస్సులో ఉన్న విషయాలను బయటకు చెప్పేస్తే మంచిది. కొన్ని సార్లు అలా చెప్పటం తప్పు కావచ్చు. కానీ తప్పులు చేయటం... వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకోవటమే మంచిది. దీని వల్ల మంచి వ్యక్తిత్వం ఏర్పడుతుంది. అమ్మాయిలందరికీ నేను ఇచ్చే సలహా ఇదే!

తొలిసారి...

హైదరాబాద్‌లో ఫ్యాషన్‌షోలో పాల్గొనటం ఇదే తొలిసారి. ఇంతకు ముందు బ్లెండర్స్‌ ప్రైడ్‌ గ్లాస్‌వేర్‌ నిర్వహించిన ఇతర ఫ్యాషన్‌ షోలలో పాల్గొన్నా. డిజైనర్‌ అమిత్‌ అగర్వాల్‌తో కలిసి పనిచేయాలని చాలా కాలంగా ఎదురుచూస్తున్నా. ఇంత కాలానికి నా కోరిక తీరింది. ఈ ఫ్యాషన్‌షోలో వేసుకుంటున్న దుస్తులు అందంగా కనిపించటంతో పాటుగా చాలా మృదువుగా ఉన్నాయి. సాధారణంగా సింథటిక్‌ వస్త్రాలు వేసుకుంటే నాకు పడదు. ఎలర్జీ వస్తుంది. అందువల్లే కాటన్స్‌ ఎక్కువగా వాడతా!

-సివిఎల్‌ఎన్‌ ప్రసాద్‌

Updated Date - 2022-11-27T02:41:11+05:30 IST