ఇక నుంచి నా పేరు... సరోజినీ నాయుడు

ABN , First Publish Date - 2022-10-12T06:24:23+05:30 IST

‘ఏదైనా బయోపిక్‌లో నటించాలని ఉంది..’ అంటూ ప్రతి కథానాయిక తన డ్రీమ్‌ ప్రాజెక్టు గురించి పలవరిస్తూ ఉంటుంది.

ఇక నుంచి నా పేరు... సరోజినీ నాయుడు

‘ఏదైనా బయోపిక్‌లో నటించాలని ఉంది..’ అంటూ ప్రతి కథానాయిక తన డ్రీమ్‌ ప్రాజెక్టు గురించి పలవరిస్తూ ఉంటుంది. ఆ అవకాశం  సోనాల్‌ మోన్‌టేరోకి చాలా త్వరగా వచ్చేసింది. ఇంతకీ సోనాల్‌  ఎవరనుకొంటున్నారా..? శాండిల్‌వుడ్‌లో దూసుకుపోతున్న యువ కథా నాయిక. అక్కడ ఆల్రెడీ పది సినిమాలు చేసేసింది. బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టింది. ‘బెనాసర్‌’ అనే పాన్‌ ఇండియా చిత్రంలో తనే కథానాయిక. ఇప్పుడు ‘సరోజినీ నాయుడు’ బయోపిక్‌లో నటించే అవకాశం అందుకుంది. ‘బెనారస్‌’ త్వరలోనే విడుదల అవుతున్న సందర్భంలో.. సోనాల్‌తో ‘నవ్య’ చిట్‌ చాట్‌... 


‘‘సాధారణంగా ‘నేను సినిమాల్లోకి వెళ్తా’ అంటే ఇంట్లోవాళ్లు అభ్యంతరం చెబుతారు. కానీ నా విషయంలో అది రివర్స్‌. నాకసలు సినిమాలంటే ఇష్టం లేదు. కానీ మా అమ్మ మాత్రం ‘నువ్వు హీరోయిన్‌ కావాల్సిందే’ అని పట్టుబట్టింది. ఎందుకంటే అమ్మకు సినిమాలంటే ఇష్టం. తను నటి అవ్వాలనుకొంది. ఆ అవకాశం కూడా వచ్చింది. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో అమ్మ తనని తాను వెండి తెరపై చూసుకోలేకపోయింది. ఆ కల నెరవేర్చే బాధ్యత నాకు అప్పగించింది. అందుకే ‘ఒకే ఒక్క సినిమా చేస్తా.. అది నీకోసం..’ అని చెప్పి మరీ కెమెరా ముందుకొచ్చా. కానీ... నా మనసు సినిమాలకు అంకితమైపోయింది. ఎనిమిదేళ్ల క్రితం మేకప్‌ వేసుకున్నా. అప్పటి నుంచీ ఖాళీ లేకుండా నటిస్తూనే ఉన్నా. తుళు, కన్నడ  భాషల్లో దాదాపు పది సినిమాల్లో నటించా’’. 


కాస్టింగ్‌ కౌచ్‌ ఉంది... 

‘‘నేను సినిమాల్లోకి వస్తున్నప్పుడు ఇంట్లోవాళ్లు ఎంత సంతోషించారో, మా బంధువులు అంత భయపెట్టారు. ‘అమ్మాయిలు నిలదొక్కుకోవడం అంత సులభం కాదు..’ అని హెచ్చరించారు. కాస్టింగ్‌ కౌచ్‌ వ్యవహారాలు కూడా భయపెట్టాయి. ‘నువ్వు సరిగా ఉన్నంత కాలం ఎవరూ నిన్ను ఏమీ చేయలేరు’ అని అమ్మ ధైర్యం చెప్పింది. నిజమే.. ఇక్కడ కాస్టింగ్‌ కౌచ్‌ ఉంది. కానీ దాన్ని దాటుకొని రావాల్సిన గుండె ధైర్యం కూడా ఈనాటి అమ్మాయిలకు ఉంది. నాకూ ఇలాంటి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే వాటిని త్వరగా పసిగట్టి.. బయటపడగలిగా. ఓ సూపర్‌ హిట్‌ సినిమాలో నటించే అవకాశం కూడా చేజారింది. అయినా నేనేం బాధ పడలేదు’’.


తొలి పారితోషికం... 

‘‘చదువుల్లో నేను యావరేజ్‌ స్డూడెంట్‌ని. నా ధ్యాసంతా.. మోడలింగ్‌పై ఉండేది. బొటాబొటీ మార్కులతో గట్టెక్కేదాన్ని. మోడలింగ్‌ రంగంలో నా తొలి సంపాదన పది వేలు. అది అమ్మ చేతికి ఇచ్చేశా. ఆ రోజు అమ్మ కళ్లలో ఆనందం చూడాలి. అది ఇప్పటికీ గుర్తుంది. బయట నేను సినిమా స్టార్‌ని. కానీ ఇంట్లో మాత్రం సాధారణమైన అమ్మాయిని. షూటింగ్‌ లేకపోతే.. ఇంట్లో అమ్మ రకరకాల పనులు చెబుతుంది. అంట్లు తోమి, వంట చేయమంటుంది. వంట చేయడం నాకు భలే సరదా. మా ఫ్యామిలీ ఫంక్షన్లకు వెళ్లినప్పుడు కూడా నన్ను సెలబ్రెటీగా చూడరు. నాక్కూడా అదే నచ్చుతుంది’’. 


నువ్వు సరోజినీ నాయుడువా..?

‘‘బెనారస్‌’ సినిమాలో నటించా. త్వరలోనే విడుదల అవుతోంది. అదో పాన్‌ ఇండియా మూవీ. ఈ సినిమాతో నాకు మరింత గుర్తింపు దక్కుతుందని ఆశిస్తున్నా. ‘సరోజినీ నాయుడు’ బయోపిక్‌ నా వరకూ ఎలా వచ్చిందో ఆలోచిస్తే ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తుంది. ఈ సినిమా ఆడిషన్‌కి నేను జీన్‌ ప్యాంటూ, టీ షర్టుతో వెళ్లా. నన్ను చూసి ‘నువ్వు సరోజినీ నాయుడువా.. అలా కనిపించే అవకాశమే లేదు’ అన్నారు. కానీ.. ఆడిషన్‌ చేశాక నా లుక్స్‌ బాగా నచ్చాయి. దాంతో ఆ పాత్రకు నన్ను సెలెక్ట్‌ చేసుకున్నారు. నా జీవితంలో చాలా కీలకమైన చిత్రమిది. బయోపిక్‌ చేయడం అంటే మాటలు కాదు. సరోజినీ నాయుడు డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ మహిళ. ఆమెకు సంబంఽధించిన వీడియోలు రెండో మూడో ఉన్నాయంతే. అవి చూసి ఆమెను అనుకరించడం మొదలెట్టా. ఈ బయోపిక్‌లో నా మొదటి సవాల్‌.. హిందీ నేర్చుకోవడం. పైగా డైలాగుల్లో ఎక్కువగా కవిత్వం చెప్పాల్సి ఉంటుంది. అందుకే హిందీ నేర్చుకోవడానికి సమయం కేటాయించా. 15 నుంచి 35 ఏళ్లలోపు సరోజినీ నాయుడు జీవితంలో మూడు రకాల పార్శ్వాలుంటాయి. ఒక్కొక్క వయసులో ఒక్కోలా కనిపించాలి. ఈ పాత్ర కోసం నన్ను బరువు పెరగమన్నారు. ఇలాంటి ఛాలెంజింగ్‌ పాత్ర వస్తే ఎంత కష్టమైనా పడొచ్చు. ఈ చిత్రం నా కెరీర్‌లో ఓ మైలు రాయిగా మిగులుతుంది. ఇప్పటికే కొంత షూటింగ్‌ పూర్తయింది. ఈ సినిమా విడుదలయ్యాక.. నా అసలు పేరు పక్కన పెట్టి, సరోజినీ నాయుడు అని పిలుస్తారు. అంత నమ్మకం ఉంది’’. 


నిజమే.. ఇక్కడ కాస్టింగ్‌ కౌచ్‌ ఉంది. కానీ దాన్ని దాటుకొని రావాల్సిన గుండె ధైర్యం కూడా ఈనాటి అమ్మాయిలకు ఉంది. నాకూ ఇలాంటి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే వాటిని త్వరగా పసిగట్టి.. బయటపడగలిగా. 

Updated Date - 2022-10-12T06:24:23+05:30 IST