ఆరోగ్యంగా... దృఢంగా...

ABN , First Publish Date - 2022-09-19T06:11:59+05:30 IST

‘ఈ బిజీ జీవన శైలిలో వ్యాయామాలకు సమయం ఇవ్వలేకపోతున్నాం’ అంటుంటారు చాలామంది.

ఆరోగ్యంగా... దృఢంగా...

‘ఈ బిజీ జీవన శైలిలో వ్యాయామాలకు సమయం ఇవ్వలేకపోతున్నాం’ అంటుంటారు చాలామంది. అయితే ఎంత పని ఒత్తిడి ఉన్నా... ఫిట్‌నెస్‌, దాంతో పాటే తీసుకొనే ఆహారంపై కూడా శ్రద్ధ పెట్టాలంటున్నారు న్యూట్రిషనిస్టులు. రోగాలకు దూరంగా... దృఢంగా... ఆరోగ్యమయ జీవన విధానానికి వారు ఇస్తున్న సూచనలివి...


పోషకాహారం: 

ఎంత తిన్నాం అనే దానికంటే సమతులాహారం తీసుకున్నామా లేదా అన్నది ముఖ్యం. దాని కోసం మెనూలో పండ్లు, కూరగాయలు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. ఏది పడితే అది కాకుండా పోషకాహారంతో నిండిన డైట్‌ ప్లాన్‌ ఒకటి రూపొందించుకొని, దాన్ని ఆచరించాలి. ఏఏ సమయాల్లో తినాలో కూడా అందులో ఉండాలి. కావాలనుకొంటే ఈ మెనూలో నచ్చిన వెరైటీలు కొన్ని చేర్చుకోవచ్చు. 

హైడ్రేషన్‌: 

ఆరోగ్యంగా జీవించాలంటే సరైన హైడ్రేషన్‌ చాలా అవసరం. ముఖ్యంగా వ్యాయామం చేసేటప్పుడు అలసట, ఆయసం, కండరాల నొప్పిని సాధ్యమైనంత తగ్గించుకొనేందుకు శరీరానికి ఎలక్ర్టోలైట్స్‌ తప్పనిసరి. అలాగే జీర్ణక్రియ సవ్యంగా సాగడానికి, ఫిట్‌గా ఉంచడంలో ఎలక్ర్టోలైట్స్‌ అత్యంత కీలకం. ఒకవేళ శరీరం డీహైడ్రేషన్‌కు గురైతే రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. 

వ్యాయామం: 

ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండాలంటే శరీరం కదలాలి. దానికి ప్రభావవంతమైన మార్గం వ్యాయామం. వర్కవుట్స్‌ అనగానే ఏ జిమ్‌కో, పార్కుకో వెళ్లాల్సిన పని లేదు. బిజీ షెడ్యూల్స్‌తో సమయం లేదనుకొంటే ఇంటి వద్దే వ్యాయామం చేసుకోవచ్చు. చిన్న చిన్న ఎక్స్‌ర్‌సైజ్‌లతో మొదలుపెట్టండి. అంటే సులువుగా చేసుకొనే ప్లాంక్స్‌, స్క్వాట్స్‌, కార్డియో లాంటివి. అయితే ఉదయం లేదా సాయంత్రం క్రమం తప్పకుండా రోజుకు కనీసం 30 నుంచి 40 నిమిషాలు చేయాలి. 

నిద్ర: 

విరామం పని గంటలు, ప్రయాణాల వల్ల చాలామంది నిద్రను నిర్లక్ష్యం చేస్తుంటారు. ఒక్కటి గుర్తుంచుకోండి... కంటి నిండా నిద్ర లేకపోతే శారీరకంగా, మానసికంగా ఒత్తిడికి గురవుతారు. ఇది అనారోగ్యానికి నాంది అవుతుంది. రాత్రిళ్లు ప్రశాంతమైన నిద్ర కంటే ఆస్వాదించగలిగింది మరేది ఉండదు. 

చెకప్‌: 

మీ శరీరం, దాన్లో జరుగుతున్న మార్పులపై మీకు పూర్తి అవగాహన ఉండాలి. వ్యాధులు వచ్చాక మందు వేసే కంటే... ఆ వ్యాధులు దరి చేరకుండా చూసుకోవడం ఉత్తమం. అందుకే రెగ్యులర్‌ మెడికల్‌ చెక్‌పలు చేయించుకోవాలి. ఒకవేళ అందులో ఏదైనా ఆరోగ్య సమస్య బయటపడితే... ముందుగానే చికిత్సకు వెళ్లి, రాబోయే ముప్పును అరికట్టే అవకాశం ఉంటుంది. క్రమం తప్పని వైద్య పరీక్షలు మీ జీవితాన్నే కాదు, మందుల ఖర్చు కూడా తగ్గిస్తాయని మర్చిపోవద్దు.

Updated Date - 2022-09-19T06:11:59+05:30 IST