క్యాన్సర్లకు దారి తీస్తున్న అల్సర్లు సకాలంలో గుర్తించకపోతే తప్పని అనర్థాలు

ABN , First Publish Date - 2022-11-21T22:46:05+05:30 IST

అల్సర్‌... జీవితంలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే సమస్య. తక్కువ నీళ్లు తాగడం, మానసిక ఒత్తిడి వంటి కారణాల వల్ల సాధారణంగా

క్యాన్సర్లకు దారి తీస్తున్న అల్సర్లు సకాలంలో గుర్తించకపోతే తప్పని అనర్థాలు

అల్సర్‌... జీవితంలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే సమస్య. తక్కువ నీళ్లు తాగడం, మానసిక ఒత్తిడి వంటి కారణాల వల్ల సాధారణంగా అల్సర్లు వస్తూ ఉంటాయి. ఇవి మూడు నాలుగు రోజుల్లో తగ్గిపోతాయి. అలాకాకుండా ఎక్కువ రోజులు వేధిస్తుంటే అలాంటి అల్సర్లను అనుమానించాలి.

సాధారణ అల్సర్లు

నోటి పూత, పెప్టిక్‌ అల్సర్లు, గ్యాస్ట్రిక్‌ అల్సర్లు, ఈసోఫేగల్‌ (అన్నవాహిక) అల్సర్లు, కదల్లేని స్థితిలో మంచానికే పరిమితమైనప్పుడు ఏర్పడే పుండ్లు, సిఫిలిస్‌, హెర్పిస్‌ వంటి ఎస్టీడీ, ఈఎస్పీ, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్ల వల్ల మర్మాయవాల్లో ఏర్పడే అల్సర్లు, మధుమేహుల కాళ్లలో వచ్చే న్యూరోపతిక్‌ అల్సర్లు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.

క్యాన్సర్లకు దారి తీసే అల్సర్లు

పెప్టిక్‌ అల్సర్లు: చిన్న పేగు ప్రారంభంలో ఉండే ఈ అల్సర్లను డియోడినల్‌ అల్సర్లు అని కూడా అంటారు. జీర్ణవ్యవస్థలో అధికంగా కనిపించే ఈ అల్సర్‌ ఒక శాతం క్యాన్సర్‌గా మారే అవకాశం ఉంటుంది.

గ్యాస్ట్రిక్‌ అల్సర్లు: పెప్టిక్‌ అల్సర్ల కంటే ఇవి తక్కువే అయినప్పటికీ, ఇవి క్యాన్సర్‌గా మారే అవకాశాలు ఎక్కువ. హెలికోబ్యాక్టరీపైలోరి అనే బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్‌ వల్ల గ్యాస్ట్రిక్‌ అల్సర్లు వస్తాయి.

స్టమక్‌ అల్సర్లు: దీర్ఘకాలంగా ఉండే గ్యాస్ట్రిక్‌ అల్సర్లే స్టమక్‌ క్యాన్సర్‌కు దారి తీస్తాయి. కాబట్టి ఒకసారి అల్సర్‌ తగ్గి, మళ్లీ కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి, బయాప్సీ పరీక్షలు చేయించాలి. అనుమానం ఉంటే సిటి స్కాన్‌, అలా్ట్రసౌండ్‌, ఎండోస్కోపీ పరీక్షలు చేయించాలి. వీటి వల్ల క్యాన్సర్‌ ఏ దశలో ఉందో తెలుస్తుంది.

అల్సర్‌కు ప్రధాన కారణాలు

మసాలాలతో కూడిన ఆహారం, కారం, మానసిక ఒత్తిడి, మద్యపానం మొదలైనవి అల్సర్‌కు ప్రధాన కారణాలు. హెలికోబాక్టర్‌ పైలోరీ అనే బ్యాక్టీరియా వల్ల కూడా అల్సర్లు వస్తాయని 1982లో కనుగొన్నారు. అయితే ఒత్తిడి, ఎసిడిటి, మద్యపానం, ధూమపానం, శరీర తత్వం మేరకు రోగి జీర్ణవ్యవస్థ లైనింగ్‌ దెబ్బతిన్నప్పుడు ఈ బ్యాక్టీరియా అల్సర్‌కు దారి తీస్తుంది. పెయిన్‌ కిల్లర్స్‌ ఎక్కువగా వాడేవారు ఈ బ్యాక్టీరియా బారిన పడే అవకాశాలు ఎక్కువ.

గ్యాస్ట్రిక్‌ అల్సర్ల ప్రధాన లక్షణాలు

కడుపులో నొప్పి, ఆకలి తగ్గడం, వికారం, ఎక్కిళ్లు, ఎసిడిటి, త్రేన్పులు, రక్తపు వాంతులు, మలంలో రక్తం.

చికిత్సా పద్ధతులు

క్యాన్సర్‌ సోకిన పొట్టలోని భాగాన్ని తొలగించి, గ్యాస్ట్రెక్టమీ, లింఫ్‌ నోడ్స్‌, చిన్న పేగులో కొంత భాగాన్ని తొలగించడం జరుగుతుంది. వ్యాధిని ఆలస్యంగా గుర్తించినప్పుడు పొట్ట మొత్తాన్నీ తొలగించి, అన్నవాహికను, చిన్నపేగునూ కలిపేయడం జరుగుతుంది. సర్జరీ తర్వాత ఆహారం సరిగా తీసుకోలేకపోవడం, వాంతులు, విరోచనాలు, వికారం, మలబద్ధకం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. సర్జరీ తర్వాత సప్లిమెంట్లు, విటమిన్‌ డి, క్యాల్షియం, ఐరన్‌, విటమిన్‌ బి12 ఇంజెక్షన్లు ఇవ్వవలసి ఉంటుంది. పొట్టను తొలగించినప్పుడు తిన్న ఆహారం నేరుగా చిన్నపేగులోకి వెళ్తుంది. దాంతో ‘డంపింగ్‌ సిండ్రోమ్‌’ వస్తుంది. కాబట్టి తక్కువ మోతాదుల్లో ఎక్కువసార్లు ఆహారం తీసుకోవాలి. ఆహారానికి ముందు, తర్వాత ద్రవ పదార్థాలు తీసుకోవలసి ఉంటుంది.

చివరి దశలో...

అల్సర్ల సంబంధిత క్యాన్సర్లను చివరి దశల్లో గుర్తించినప్పుడు, లేజర్‌ థెరపీ, రేడియో థెరపీలను అందిస్తారు. ఈ చికిత్సలతో క్యాన్సర్‌ కణితి పరిమాణాన్ని తగ్గించి, పేగుల్లో స్టెంట్‌ను అమరుస్తారు. మెటల్‌ లేదా ప్లాస్టిక్‌తో తయారైన ఈ ట్యూబ్‌ ద్వారా ఆహారం జీర్ణవ్యవస్థలోకి వెళ్తుంది.

జాగ్రత్తలు

కడుపులో మంట, ఉబ్బరం, పుల్లటి త్రేన్పులు, అజీర్తి లక్షణాలను అరుదుగా కాకుండా తరచుగా వేధిస్తుంటే, యాంటాసిడ్‌లు తోచిన చిట్కాలు పాటించకూడదు. అవి క్యాన్సర్లుగా మారే ప్రమాదం ఉంది కాబట్టి, లక్షణాలు కనిపించినప్పుడు వైద్యులను కలిసి, అవసరమైన పరీక్షలు చేయించుకుని, వైద్య చికిత్స తీసుకోవాలి.

డాక్టర్‌ సి.హెచ్‌ మోహన వంశీ

చీఫ్‌ సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌

ఒమేగా హాస్పిటల్స్‌,

బంజారాహిల్స్‌, హైదరాబాద్‌.

ఫోన్‌: 9849022121

Updated Date - 2022-11-21T22:46:24+05:30 IST

Read more