పట్టణాల్లో రివర్స్.. 3 పదులు దాటాకే!

ABN , First Publish Date - 2022-08-30T18:41:35+05:30 IST

రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లో మూడు పదులు దాటాకే మాతృత్వపు అనుభూతి పొందే మగువల సంఖ్య

పట్టణాల్లో రివర్స్.. 3 పదులు దాటాకే!

కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ప్రసవిస్తున్నవారిలో 

50% మంది మహిళలు 30 దాటిన వారే 

గ్రామీణ ప్రాంతాల్లో 25 ఏళ్లలోపే ఇద్దరు పిల్లలు

దశాబ్దం కిందట టీనేజ్‌ ప్రెగ్నెన్సీలే ఎక్కువ

ఆలస్యంగా గర్భం దాల్చడం తక్కువగా ఉండేది

ఇప్పుడది రివర్స్‌ అయింది: గైనకాలజిస్టులు


హైదరాబాద్‌, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లో మూడు పదులు దాటాకే మాతృత్వపు అనుభూతి పొందే మగువల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. గ్రామీణ ప్రాంతాల మహిళలు మాత్రం సగటున 25 ఏళ్లలోపే ఇద్దరు పిల్లలకు జన్మనిస్తున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని కార్పొరేట్‌ ప్రైవేటు ఆస్పత్రులకు వచ్చే ప్రతి పది మంది గర్భిణుల్లో ఐదుగురు 30 ఏళ్లు దాటిన వారే ఉంటున్నట్లు గైనకాలజిస్టులు చెబుతున్నారు. అయితే, ముస్లిం ఆడపిల్లలకు మాత్రం త్వరగా పెళ్లిళ్లు చేస్తుండడంతో.. వారు చాలా తక్కువ వయసులోనే పిల్లలకు జన్మనిస్తున్నారని హైదరాబాద్‌కు చెందిన ఓ గైనకాలజిస్టు వెల్లడించారు. లేటుగా గర్భం దాల్చుతున్న వారిలో ఎక్కువ శాతం మంది ఒక్కరితోనే సరిపెట్టుకుంటున్నారు.


ఇద్దరు, ముగ్గురు పిల్లల్ని కనాలనే ఆలోచనే వారిలో ఉండట్లేదని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. ఉన్నత చదువులు చదివిన వారిలో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తోందని వారు పేర్కొన్నారు. కెరీర్‌ కారణంగా పిల్లల్ని చూసుకునే తీరిక లేకపోవడం ఇందుకు ఒక కారణంగా చెబుతున్నారని మరో గైనకాలజిస్టు పేర్కొన్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే- 4లో 19 ఏళ్లకే తల్లులైన వారి శాతం 10.6గా నమోదైంది. అది ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌-5 సర్వే నాటికి 5.8కి పడిపోయింది. అంటే చిన్న వయసులో తల్లులు అయ్యేవారి శాతం తగ్గుతూ వస్తున్నట్లు జాతీ య కుటుంబ ఆరోగ్య సర్వేలో కూడా తేటతెల్లమైంది.  


గ్రామీణ ప్రాంతాల్లో..

హైదరాబాద్‌తో పొల్చితే ఇతర పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి వేరుగా ఉంది. అక్కడ ప్రతి పది కేసుల్లో ఒకటో, రెండో కేసులు మాత్రమే 30 దాటిన వారు ఉంటున్నట్లు వైద్యులు చెబుతున్నారు. అదీ కూడా సంతానలేమీ సమస్యల వల్ల ఆలస్యంగా గర్భం దాల్చుతున్నారని అంటున్నారు. అలాగే.. దశాబ్దం క్రితం యుక్తవయసులోనే గర్భం దాల్చే (టీనేజీ ప్రెగ్నెన్సీ) కేసులు ఎక్కువగా ఉండేవని.. ఇప్పుడు వాటి సంఖ్య బాగా తగ్గిందని వైద్యులు తెలిపారు. అప్పట్లో చాలా కుటుంబాల్లో ఆడపిల్లలకు 18 ఏళ్లు, అంతకన్నా తక్కువ వయసులోనే పెళ్లి చేసేవారని, దీంతో వారు 20-21 ఏళ్లకే పిల్లలకు జన్మనిచ్చేవారని గుర్తుచేస్తున్నారు. కానీ ఇప్పుడు సగటున 24 ఏళ్లు దాటితేగానీ పెళ్లి ప్రస్తావన  తీసుకురావడం లేదని.. ఈ మేరకు వారు ఆలస్యంగా గర్భం దాలుస్తున్నారని వైద్యులు వివరిస్తున్నారు.


అనారోగ్య సమస్యలు..

ఉద్యోగం, కుటుంబ బాధ్యతల కారణంగా ఒత్తిడి పెరిగిపోయి ఇటీవల కాలంలో మహిళల్లో 30లోపే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని.. బీపీ, షుగర్‌, థైరాయిడ్‌, పీసీవోడీ (పాలీసిస్టిక్‌ ఓవరీస్‌ డిసీజ్‌) వంటి సమస్యలు పెరుగుతున్నాయని డాక్టర్స్‌ చెబుతున్నారు. స్థూలకాయం సమస్య కూడా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కారణాలేవైనాగానీ.. ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం, 35 దాటాక గర్భధారణ, బిడ్డకు తల్లిపాలు పట్టకపోవడం, జీవనశైలిలో మార్పుల వంటివి మహిళల్లో కేన్సర్‌ రావడానికి కారణమౌతున్నట్లు భారతీయ ప్రజారోగ్య సంస్థ (ఐఐపీహెచ్‌) తన తాజా నివేదికలో వెల్లడించింది. దాని ప్రకారం.. గతంలో 50 పైబడిన మహిళల్లో రొమ్ము కేన్సర్‌ ఎక్కువగా కనిపించేది. కానీ ఇప్పుడు పాతికేళ్లకే బ్రెస్ట్‌ కేన్సర్‌ బారినపడుతున్న వారు పెరుగుతున్నారు. ముఖ్యంగా గర్భిణుల్లో ఇలాంటి కేసులు చూస్తున్నామని వైద్యనిపుణులంటున్నారు.
సమస్యలు పెరిగాయి

కెరీర్ కోసం ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకోవడం, గర్భాన్ని వాయిదా వేసుకోవడం బాగా పెరుగుతోంది. అలాగే.. ఇటీవల కాలంలో మహిళల్లో అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. 30 ఏళ్లకే బీపీ, షుగర్‌తో వస్తున్నారు. అలాగే థైరాయిడ్ సమస్యలు పెరిగాయి. అధిక బరువుతో బాధపడేవారు ఎక్కువ అయ్యారు. అయితే.. గతంలో కంటే టెక్నాలజీ బాగా పెరిగి అత్యాధునిక పరీక్షా యంత్రాలు అందుబాటులోకి రావడంతో మహిళల్లో అనారోగ్య సమస్యలను ముందే గుర్తించగలుగుతున్నాం.

-డాక్టర్ బాలాంబ, ప్రముఖ గైనకాలజిస్టు, హైదరాబాద్


30 దాటాక గర్భధారణ.. పెరిగింది 

మా దగ్గర ప్రెగ్నెంట్‌ ఓపీకి రోజూ 120 మంది దాకా వస్తుంటారు. అందులో 75 శాతం 30 లోపు వారు ఉంటే.. 25 శాతం మూడుపదులు దాటిన వారుంటున్నారు. పదేళ్ల క్రితం ముప్పై దాటిన ప్రెగ్నెంట్స్‌ కేవలం 10 శాతమే ఉండేవారు. అలాగే.. మా వద్దకు వచ్చే గర్భిణుల్లో ఐదు శాతం మంది ప్రీ-డయాబెటిక్‌ (చక్కెరవ్యాధికి ముందు దశ), మరో ఐదు శాతం మంది డయాబెటిక్‌ ఉంటున్నారు.10-15 శాతం మంది పీసీవోడీ సమస్యలున్న ప్రెగ్నెంట్స్‌ ఉంటున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో.. ఇద్దరు అమ్మాయిలు పుడితే అబ్బాయి కోసం ఎదురుచూస్తున్నారు.  పట్టణ ప్రాంతాల్లో అమ్మాయైునా, అబ్బాయైునా ఒక్కరు చాలు అనే ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది.  

-డాక్టర్‌ ఎం. ప్రశాంతి మోహన్‌, ప్రముఖ గైనకాలజిస్టు, జనరల్‌ అండ్‌ లాప్రోస్కోపిక్‌ సర్జన్‌, ఎండీ, ప్రశాంతి హస్పిటల్స్‌, వరంగల్‌.


50% మంది 30 పైబడిన వారే

మా దగ్గరకు వచ్చే ప్రతి పది మంది గర్భిణుల్లో ఐదుగురు మూడు పదులు దాటిన వారే ఉంటున్నారు. వారిలో విద్యావంతులు, ఉద్యోగస్తులే ఎక్కువగా ఉంటున్నారు. కెరీర్‌కు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తుండటం, ఆలస్యంగా పెళ్ల్లి చేసుకోవడం వల్ల ఆలస్యంగా గర్భం దాల్చుతున్నారు. ఐవీఎఫ్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత నాలుగు పదుల వయసులోనూ ప్రెగ్నెంట్స్‌ అవుతున్న కేసులు వస్తున్నాయి.

-డాక్టర్‌ షర్మిల, అపోలో ఆస్పత్రి, జూబ్లీహిల్స్‌, హైదరాబాద్‌.

Read more