కమ్మని నిద్ర కోసం ఇలా చేయండి

ABN , First Publish Date - 2022-09-27T20:07:45+05:30 IST

కమ్మని నిద్ర కోసం కొన్ని నియమాలు

కమ్మని నిద్ర కోసం ఇలా చేయండి

నిద్రలేమిని ఆరోగ్య సమస్యగానే భావించాలి. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న అంశాన్నైనా ఎలా పరిగణలోకి తీసుకుంటామో, అంతే ప్రాధాన్యం నిద్రలేమికీ ఇవ్వాలి. కమ్మని నిద్ర కోసం కొన్ని నియమాలు పాటించాలి. అవేంటంటే....


టైమ్‌టేబుల్‌: భోజనానికీ, ఇతరత్రా పనులకూ ఎలాగైతే టైమ్‌టేబుల్‌ను అనుసరిస్తామో, అలాగే నిద్రకూ వేళలు కచ్చితంగా పాటించాలి. ఏడున్నర నుంచి ఎనిమిది గంటల నిడివి ఏర్పాటు చేసుకుని, అందుకు తగిన సమయాలను ఫిక్స్‌ చేసుకుని అనుసరించాలి.

రాత్రి భోజనం: నిద్రకు రెండు గంటల ముందే రాత్రి భోజనం ముగించాలి.

సెల్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌: ఇవి వెలువరించే నీలం వెలుగు నిద్రకు తోడ్పడే మెలటోనిన్‌ అనే రసాయనం ఉత్పత్తిని తగ్గిస్తుంది. దాంతో నిద్ర తగ్గుతుంది. కాబట్టి నిద్రకు రెండు గంటల ముందు సెల్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌లకు దూరంగా ఉండాలి.

వ్యాయామం: ఆదమరిచి నిద్ర పట్టాలంటే శరీరం ఎంతో కొంత అలసటకు లోనవ్వాలి. కాబట్టి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడమూ అవసరమే! అయితే వ్యాయామంతో శరీరం వేడిగా ఉన్న స్థితిలో నిద్ర పట్టదు. కాబట్టి సాయంత్రం వ్యాయామం చేసే అలవాటు ఉన్నవాళ్లు నిద్ర సమయానికి రెండు గంటల ముందే ముగించాలి.

22 నుంచి 24 డిగ్రీలు: పడగ్గదిలో ఉష్ణోగ్రత 22 నుంచి 24 డిగ్రీల మధ్య ఉంటే త్వరగా నిద్రలోకి జారుకుంటాం. కాబట్టి పడగ్గదిలో ఏసి ఉంటే, అలా పెట్టుకోవాలి.

అలారం: ఫోన్‌ లేదా, గడియారాల్లో రిపీటెడ్‌ అలారం పెట్టుకోకూడదు. ఎలాంటి అలారం అవసరం లేకుండా ఉదయం ఒకే సమయానికి మెలుకువ వచ్చేలా అలవాటు చేసుకోవాలి.

పడగ్గది: పడగ్గదిని నిద్రకే ఉపయోగించాలి తప్ప ఆఫీసు పనులకు, ఇతరత్రా ఇండోర్‌ గేమ్స్‌కూ ఉపయోగించకూడదు. బెడ్‌రూమ్‌లో టివి ఉండకూడదు. నిద్రకు గంట ముందు బెడ్‌రూమ్‌లో బెడ్‌లైట్‌ ఆన్‌ చేసి పెట్టుకోవాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే, బెడ్‌రూమ్‌ నిద్ర కోసమే అనే జ్ఞాపకం మెదడులో నిక్షిప్తమవుతుంది. దాంతో బెడ్‌రూమ్‌లోకి అడుగు పెట్టిన వెంటనే నిద్ర పడుతుంది.

Read more