ఆయన అంతా చూస్తున్నాడు!

ABN , First Publish Date - 2022-11-24T22:22:14+05:30 IST

పూర్వం విశాలమైన రాజ్యాన్ని ఒక రాజు పాలించేవాడు. అతనికి ముగ్గురు కొడుకులు...

ఆయన అంతా చూస్తున్నాడు!

పూర్వం విశాలమైన రాజ్యాన్ని ఒక రాజు పాలించేవాడు. అతనికి ముగ్గురు కొడుకులు.

వారిని ఆయన ఒక రోజు పిలిచి... ‘‘రేపు పొద్దున్నే మన పండ్ల తోటకు వెళ్ళండి. నేను చెప్పిన చెట్లకు ఉన్న పండ్లను కోయండి. మంచి రుచికరమైన ఇతర రకాల పండ్లు ఉంటే... వాటిని కూడా కోసుకురండి. కానీ గోనె సంచి నిండా తీసుకురండి. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించవద్దు’’ అని ఆదేశించాడు.

‘ఏమిటీ వింత ఆదేశం? ఎంతోమంది సైనికులు, రాజోద్యోగులు, సేవకులు ఉండగా... రాజ కుమారులమైన మేము పండ్లు కోయడమేమిటి?’ అని ఆ రాజకుమారులు ఆశ్చర్యపోయారు. కానీ తండ్రి ఆజ్ఞ ప్రకారం... మర్నాడు ఉదయం గుర్రాల మీద బయలుదేరి, తోటకు చేరుకున్నారు.

‘మా తండ్రి మా అభిరుచిని పరీక్ష్షిస్తున్నారేమో?’ అనుకున్నాడు పెద్ద కుమారుడు. తోటలో తాజాగా, సువాసన వెదజల్లుతున్న, రుచికరమైన మంచి పండ్లను తీశాడు. గోనె సంచిలో గడ్డి వేసి, పండ్లను జాగ్రత్తగా పేర్చి, గోనెకు తాడు బిగించాడు. తండ్రి మెప్పు పొందాలనే తపనతో బయలుదేరాడు.

‘నా తండ్రి మహారాజు. సంచిలో ఉన్న ఒక్కొక్క పండునూ తీసి చూస్తారా? ఎప్పుడూ రాచకార్యాల్లో నిమగ్నమై ఉండే ఆయనకు అంత తీరిక ఎక్కడిది? ఏవో కొన్ని మంచి పండ్లు పైన పెడితే సరిపోతుంది’ అనుకున్నాడు రెండో కుమారుడు. మంచివీ, కుళ్ళినవీ, పచ్చివీ, పండినవీ, తియ్యనివీ, పుల్లనివీ, వగరైనవీ... ఇలా అన్ని రకాల పండ్లనూ సంచిలో నింపాడు. ఎండ తగలకుండా, పెద్దగా శ్రమ పడకుండా వాటిని కోటకు తీసుకువచ్చాడు.

‘సంచి నిండా తెచ్చారా? లేదా? అనేది మాత్రమే నా తండ్రి చూస్తారు. లోపల ఏ పండ్లు ఉన్నాయి, ఎలా ఉన్నాయి, అవి చిన్నవా, పెద్దవా, పుల్లటివా, తియ్యనివా, కుళ్ళినవా, సువాసనతో ఉన్నవా? అనే చిన్న చిన్న విషయాలు పరిశీలించాలంటే ఎంత సమయం కావాలి? ఈ పండ్లనే పరిశీలిస్తూ కూర్చుంటారా?’ అనుకున్నాడు మూడో పుత్రుడు. ఏమాత్రం కష్టపడకుండా... పండ్లు, ఆకులు, చెత్తా చెదారంతో తనకు నచ్చినట్టు గోనె సంచిని నింపేశాడు.

మరునాడు తన దర్బారుకు కుమారులు ముగ్గురినీ రాజు పిలిచాడు. వారు నిండుగా ఉన్న సంచులతో వచ్చారు. ఎంతో హుషారుగా, సంతోషంగా కనిపించారు. రాజు ఆ గోనె సంచులను ముట్టలేదు. వాటిని తెరిపించలేదు. వాటిలో ఏముందో చూడలేదు. అయితే... ‘‘ఈ ముగ్గురినీ రాజధానికి బాగా దూరంగా ఉన్న ఇరుకైన జైల్లో వేర్వేరుగా... రెండు నెలల పాటు బంధించండి. వీరు ఏరుకొని తెచ్చిన ఆ ఫలాలే వారికి ఆహారం’’ అని సైనికుల్ని ఆజ్ఞాపించాడు.

ఆ బహుదూరపు కారాగారంలో... ఆ ముగ్గురి దగ్గరా తోటలో తాము పోగు చేసుకున్నవి తప్ప మరేవీ లేవు. రెండు నెలలపాటు తాము తెచ్చుకున్న వాటితోనే గడపాలి. ఆ ముగ్గురికీ విషయం అర్థమయిపోయింది.

మనం పోగు చేసుకున్నదే మనకు తోడుగా ఉంటుంది. మరేదీ మిగలదనేదే దీనిలోని నీతి. ప్రళయదినాన... మనం తెచ్చుకున్న మంచి, చెడు మాత్రమే అల్లాహ్‌ చూస్తాడు. నీ ఆస్తులు, హోదాలు, వంశాలు, నీ సౌందర్యం... ఇవేవీ ఆయన పట్టించుకోడు. మంచిని తీసుకువెళ్తే స్వర్గం లభిస్తుంది. చెడు తీసుకుపోతే నరకం తప్పదు. మన చర్యలను ఎవరు చూసినా, చూడకపోయినా అల్లాహ్‌ చూస్తూనే ఉంటాడు. ఆ ఎరుకతో, అంతిమ దైవప్రవక్త మహమ్మద్‌ చూపిన మార్గంలో జీవించాలి. అప్పుడు ఇహ, పరలోక సాఫల్యం కచ్చితంగా లభిస్తుంది.

మహమ్మద్‌ వహీదుద్దీన్‌

Updated Date - 2022-11-24T22:22:14+05:30 IST

Read more