హీరోయిన్‌గా పనికిరావన్నారు

ABN , First Publish Date - 2022-09-28T06:18:30+05:30 IST

బాలతారలుగా ప్రతిభ కనబర్చి, ప్రశంసలు అందుకొన్న వారిలో చాలామంది పెరిగి పెద్దయ్యాక హీరోలుగానో, హీరోయిన్లుగానో రాణించిన సందర్భాలు వేళ్ల మీద లెక్కించవచ్చు.

హీరోయిన్‌గా పనికిరావన్నారు

బాలతారలుగా ప్రతిభ కనబర్చి, ప్రశంసలు అందుకొన్న వారిలో చాలామంది పెరిగి పెద్దయ్యాక హీరోలుగానో, హీరోయిన్లుగానో రాణించిన సందర్భాలు వేళ్ల మీద లెక్కించవచ్చు. తెలుగులో ఇలాంటి వారి సంఖ్య ఎక్కువే. బాలీవుడ్‌లో కూడా కొందరు కనిపిస్తారు. ఈ కోవలో బాలనటిగా, ఆ తర్వాత హీరోయిన్‌గా రెండు తరాల ప్రేక్షకులను అలరించిన వారిలో ఆశా పరేఖ్‌ పేరును ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఆశా 1942 అక్టోబరు 2న గుజరాతీ కుటుంబంలో జన్మించారు. ఆశా నట జీవితం పదేళ్ల వయసులోనే ప్రారంభమైంది. ఓ ఫంక్షన్‌లో ఆమె నృత్యం చూసి ముచ్చటపడిన దర్శకుడు విమల్‌ రాయ్‌ ‘మా’ (1952) చిత్రంలో ఆమెకు అవకాశం కల్పించారు. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించినా స్కూల్‌కు ఇబ్బంది అవుతోందని నటనకు తాత్కాలికంగా విరామం ఇచ్చారు ఆశా. పదహారేళ్ల వయసులో మళ్లీ నటన మీద దృష్టి పెట్టారు. ‘‘దర్శకుడు విజయ్‌ భట్‌ ‘గుంజ్‌ ఉతి షెషనాయి’ సినిమాలో హీరోయిన్‌ కోసం వెదుకుతున్నారని తెలిసి ఆయన్ని కలిశాను. విజయ్‌ భట్‌ ఒకసారి నన్ను ఎగాదిగా చూసి ‘అద్దంలో నీ మొహం ఎప్పుడైనా చూసుకున్నావా..’ అని హేళనగా మాట్లాడారు. ఐనా నేను ధైర్యాన్ని కోల్పోలేదు. నా ఫొటోలు పట్టుకుని ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నా. నాజీర్‌ హుస్సేన్‌ దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘దిల్‌ దేకే దేఖో’ చిత్రంలో హీరోయిన్‌గా నన్ను ఎన్నుకున్నారు. 1959లో విడుదలైన ఈ చిత్రంతో నా జాతకమే మారిపోయింది’’ అని పాత రోజుల్ని గుర్తు చేసుకున్నారు ఆశా. 


శా నటన చూసి ముగ్ధుడైన నాజీర్‌ హుస్సేన్‌ వరుసగా మరో ఆరు చిత్రాల్లో ఆమెను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ‘జబ్‌ ప్యార్‌ కిసీ సే హోతా హై’, ‘ఫిర్‌ ఓహి దిన్‌ లయా హూన్‌’, ‘తీస్రీ మంజిల్‌’, ‘కార్వాన్‌’, ‘ప్యార్‌ కా మౌసమ్‌’ వంటి చిత్రాలు ఆమెను గ్లామర్‌ హీరోయిన్‌గా నిలబెట్టాయి. వరుసగా గ్లామర్‌ పాత్రలే చేస్తున్న ఆశా 1966లో వచ్చిన ‘దో బదన్‌’ చిత్రంలో తన ఇమేజ్‌కు పూర్తి భిన్నమైన పాత్ర పోషించి, అందరికీ షాక్‌ ఇచ్చారు. దర్శకుడు రాజ్‌ ఖోస్లా చేసిన ఈ సాహసం విమర్శకులను ఆకట్టుకొంది కానీ తమ అభిమాన అందాల నటి ఆశాను తొలిసారిగా ఓ విషాద పాత్రలో చూసిన ఆమె అభిమానులు మాత్రం తట్టుకోలేక పోయారు. ‘ఈ వయసులో ఇటువంటి పాత్రలు పోషించడం నీకు అవసరమా’ అని  ప్రశ్నించారు. దాంతో ఆ తర్వాత మళ్లీ గ్లామర్‌ పాత్రలనే అంగీకరించారు.


అమితాబ్‌తో ఒకే ఒక్క సినిమా

శా పరేఖ్‌ నట జీవితంలో మూడు దశలు ఉన్నాయి. ఆమె బాల నటిగా కెరీర్‌ ప్రారంభించారు. ఆ తర్వాత హీరోయిన్‌ అయ్యారు. వయసు పెరిగాక క్యారెక్టర్‌ ఆర్టి్‌స్టగా మారి, వదిన, తల్లి పాత్రలు పోషించారు. 1981లో వచ్చిన ‘కాలియా’ చిత్రంలో ఆమె నటించారు. అమితాబ్‌తో స్ర్కీన్‌ షేర్‌ చేసుకొన్న ఏకైక చిత్రం ఇదే! ఎందుకో ఆ చిత్ర అనుభవం ఆమెకు నచ్చలేదు. ఇక నటనకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుని దానికే కట్టుబడ్డారు. 


అవివాహితగానే మిగిలిపోయారు

ఆశా హీరోయిన్‌గా బిజీగా ఉన్న తరుణంలోనే పెళ్లి చేసుకుంటామని ఆమె వెంటపడిన వాళ్లు కొంత మంది ఉన్నారు. వాళ్లలో దర్శకుడు నాజీర్‌ హుస్సేన్‌ ఒకరు. తన నట జీవితాన్ని తీర్చిదిద్దిన నాజీర్‌ అంటే ఓ దశలో ఆశా కూడా ఆకర్షితులయ్యారు. కానీ అప్పటికే ఆయనకు పెళ్లి కావడంతో ఆమె అడుగు ముందుకెయ్యలేకపోయారు. ఆ తర్వాత ఓ ప్రొఫెసర్‌తో ఆమెకు పెళ్లి కుదిరింది. అయితే అతను తన గర్ల్‌ ఫ్రెండ్‌ను వదులుకోవడానికి ఇష్టపడకపోవడంతో ఆశా ఆ పెళ్లి ప్రతిపాదనను విరమించుకున్నారు. ఆ తర్వాత ఒంటరిగా ఉండిపోయారు. ‘జ్యోతి’ సీరియల్‌కు దర్శకత్వం వహించారు. కొన్ని సీరియల్స్‌ కూడా నిర్మించారు. 1995లో నటనకు గుడ్‌ బై చెప్పేసిన ఆశా సీరియల్స్‌ నిర్మాణంలో బిజీ అయ్యారు. సెన్సార్‌ బోర్డ్‌ తొలి మహిళా చైర్‌పర్సన్‌గా (1998-2001) ఆశా పరేఖ్‌ నియమితులయ్యారు. ఆ సమయంలో ఆమె తీసుకున్న కొన్ని నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. శేఖర్‌ కపూర్‌ రూపొందించిన ‘ఎలిజిబెత్‌’ చిత్రానికి సర్టిఫికెట్‌ ఇ్వకుండా ముప్పుతిప్పలు పెట్టారు. 


ఆశా పరేఖ్‌కు దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు

భారత సినీ రంగంలో అత్యున్నతమైన దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు బాలీవుడ్‌ ప్రముఖ నటి ఆశా పరేఖ్‌ (79)ను వరించింది. అయిదుగురు సభ్యుల కమిటీ 2020 సంవత్సరానికి గాను ఫాల్కే అవార్డుకు పరేఖ్‌ను ఎంపిక చేసిందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు. సినీ దిగ్గజాలు ఆశా భోస్లే, హేమమాలిని, పూనమ్‌ థిల్లాన్‌, ఉదిత్‌ నారాయణ్‌, టీఎస్‌ నాగాభరణతో కూడిన ఎంపిక కమిటీ నిర్ణయాన్ని అనురాగ్‌ వెల్లడించారు. పరేఖ్‌ అయిదు దశాబ్దాలకు పైగా సినీ రంగానికి అందించిన సేవలకు గుర్తింపుగా ఫాల్కే అవార్డును అందిస్తుండడం గర్వంగా ఉందన్నారు. 95కు పైగా సినిమాల్లో ఆమె నటించారు. శుక్రవారం జరిగే 68వ జాతీయ సినిమా అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము... పరేఖ్‌కు అవార్డును అందజేస్తారు.

Read more