మతిమరుపు సహజమేనా?

ABN , First Publish Date - 2022-12-01T00:53:57+05:30 IST

డాక్టర్‌! నా వయసు 50. ఈ మధ్య ప్రతి విషయం మర్చిపోతూ ఉన్నాను. వయసు పైబడింది కాబట్టి మతిమరుపు సహజమే అనుకోవాలా? లేదంటే ఈ లక్షణాన్ని ఆరోగ్య సమస్యకు సూచనగా భావించాలా

మతిమరుపు సహజమేనా?

డాక్టర్‌! నా వయసు 50. ఈ మధ్య ప్రతి విషయం మర్చిపోతూ ఉన్నాను. వయసు పైబడింది కాబట్టి మతిమరుపు సహజమే అనుకోవాలా? లేదంటే ఈ లక్షణాన్ని ఆరోగ్య సమస్యకు సూచనగా భావించాలా?

- ఓ సోదరుడు, హైదరాబాద్‌

ఎప్పుడైనా, ఏదైనా గుర్తురాకపోతే ‘అయ్యో! నాకు మతిమరుపొచ్చేసిందే!’ అని కంగారు పడతాం. కానీ ప్రతి ఒక్కరికీ ఏదో ఓ సందర్భంలో మతిమరుపు అనుభవంలోకి రావటం సహజం. అయితే ఎలాంటి మతిమరుపును తేలికగా భావించాలి? దేన్ని సీరియ్‌సగా తీసుకోవాలో తెలుసుకోవాలి.

పేర్లు మర్చిపోవటం: రెండు, మూడు రోజుల కిందటే కలిసిన వ్యక్తి మళ్లీ ఎదురుపడి పలకరిస్తే అతని పేరు గుర్తుకురాక ఇబ్బంది పడతాం. 45 ఏళ్లు పైబడిన వాళ్లలో ఇది సహజమే! మెదడు నుంచి సమాచారాన్ని రాబట్టుకోగలిగే వేగం, సాంద్రత 45 ఏళ్లు పైబడితే తగ్గుతుంది. అయితే కుటుంబ సభ్యుల పేర్లు కూడా మర్చిపోతూ ఉంటే మాత్రం వెంటనే వైద్యుల్ని కలవాలి.

గదిలోకి దేనికోసం వెళ్లామో మర్చిపోతాం: దేని కోసమో గదిలోకి వెళ్తాం. తీరా అక్కడికెళ్లాక ఎందుకెళ్లామో గుర్తుకురాదు. ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇలా జరగటం సహజం. ఇలా మొదటిసారి తల్లయిన వాళ్లకి, కొత్తగా ఉద్యోగంలో చేరిన వాళ్లకి జరగొచ్చు. ఈ మతిమరుపుతోపాటు తరచుగా వస్తువులను పోగొట్టుకుంటూ, ఆ నెపాన్ని ఇతరుల మీద మోపుతుంటే జాగ్రత్త పడాల్సిన సమయమొచ్చిందని అర్థం.

చెప్పిందే చెప్పటం: ఒక్కోసారి చెప్పిన విషయాన్నే అదే వ్యక్తికి మళ్లీ చెప్తూ ఉంటాం. అయితే రెండోసారి చెప్పేటప్పుడు ఆ విషయాన్ని చెప్పినట్టు గుర్తొస్తుందిగానీ ఎవరితో చెప్పామో గుర్తుకురాదు. ఇది సహజం. అయితే ఒకే వ్యక్తితో ఒకే సంభాషణలో చెప్పిందే పదే పదే చెప్తూ, అలా చెప్తున్న విషయాన్ని గ్రహించలేకపోతే మాత్రం సమస్య ఉన్నట్టే భావించాలి.

డాక్టర్‌ శ్యామ్‌ జైస్వాల్‌

కన్సల్టెంట్‌ న్యూరాలజిస్ట్‌, హైదరాబాద్‌.

Updated Date - 2022-12-01T01:08:14+05:30 IST