ఆహార సూత్రాలు

ABN , First Publish Date - 2022-12-12T23:47:25+05:30 IST

పేర్లు తెలియని పదార్థాలతో తయారవుతున్న ఆహారాలు మార్కెట్లో బోలెడు. కాబట్టి తినే ముందు దాన్లో ఏం కలిపారు? ఎలా తయారైంది? ఎన్ని పదార్థాలతో తయారైంది? అనే వివరాలు తెలుసుకోవాలి.

ఆహార సూత్రాలు

పేర్లు తెలియని పదార్థాలతో తయారవుతున్న ఆహారాలు మార్కెట్లో బోలెడు. కాబట్టి తినే ముందు దాన్లో ఏం కలిపారు? ఎలా తయారైంది? ఎన్ని పదార్థాలతో తయారైంది? అనే వివరాలు తెలుసుకోవాలి. ఐదు అంతకంటే ఎక్కువ రకాల పదార్థాలు కలిపి తయారుచేసిన ఆహారాలకు దూరంగా ఉండడమే మేలు. ఇలాంటివాటికి శరీరం స్పందించే తీరు భిన్నంగా ఉంటుంది. కొత్త పదార్థాలను శరీరం తేలికగా స్వీకరించలేదు. కాబట్టి తినే సమయంలో ఒకేసారి ఎక్కువ పరిమాణంలో కాకుండా, స్వల్ప పరిమాణాల్లో శరీరానికి అలవాటు చేయాలి. లేదంటే వాంతులు, విరేచనాలు లాంటి అసౌకర్యాలు తప్పవు.

‘ఐదు వంతుల్లో నాలుగు వంతులే తినండి’ అని జపాన్‌లో, ‘సంచి నిండకముందే మూతి కట్టేయండి’ అని జర్మనీలో ఆహారశైలి గురించిన నానుడులు ఉన్నాయి. ఈ నియమాలన్నీ ఆరోగ్యం భేషుగ్గా ఉండడం కోసం అవలంబించేవే! కాబట్టి ఎంత ఆకలిగా ఉన్నా పొట్ట నిండుగా తినకూడదు. పొట్టలో ఎంతోకొంత ఖాళీ జాగా వదిలినప్పుడే ఆహారం తేలికగా జీర్ణమవుతుందనే విషయం గుర్తు పెట్టుకుని మెలగాలి.

టి.వి చూస్తూ భోజనం చేసే అలవాటు ఉంటే మానుకోండి. తినే ఆహారం మీద నుంచి మనసు మళ్లితే ఎంత తింటున్నాం అనే దాని మీద దృష్టి ఉండదు. కాబట్టి భోజనాలగదిలో టి.వి లేకుండా చూసుకోండి.

ఆకలి వేస్తేనే తినాలి. కానీ భోజనం వేళ అయిందనో, తినాలి కాబట్టి తినడమో చేయకూడదు. కొన్నిసార్లు భోజన సమయానికి ఆకలి వేయదు. తినాలనిపించేంత ఆకలి కూడా ఉండకపోవచ్చు. అలాంటప్పుడు భోజనాన్ని వాయిదా వేయండి. పోషకాల అవసరాన్నిబట్టి శరీరమే ఆకలిని కలిగిస్తుంది. అప్పటివరకూ ఆగడం మంచిదే!

Updated Date - 2022-12-12T23:47:25+05:30 IST

Read more