Eye Care : దెబ్బలతో ఐ ఇన్‌ఫెక్షన్‌

ABN , First Publish Date - 2022-12-05T23:30:24+05:30 IST

కార్నియా అనేది కనుగుడ్డుకు చర్మం లాంటి రక్షణ కవచం. చర్మానికి దెబ్బ తగిలి మచ్చ ఏర్పడినట్టే కార్నియా మీద కూడా దెబ్బల వల్ల మచ్చలు ఏర్పడతాయి.

Eye Care : దెబ్బలతో ఐ ఇన్‌ఫెక్షన్‌

కార్నియా అనేది కనుగుడ్డుకు చర్మం లాంటి రక్షణ కవచం. చర్మానికి దెబ్బ తగిలి మచ్చ ఏర్పడినట్టే కార్నియా మీద కూడా దెబ్బల వల్ల మచ్చలు ఏర్పడతాయి. ఆటల వల్ల, ప్రమాదవశాత్తూ, పెన్సిల్‌లాంటి పదునైన వస్తువులు తగలటం వల్ల కార్నియా చిరిగిపోతుంది. ఇలాంటప్పుడు వీలైనంత త్వరగా చిరిగిపోయిన కార్నియాను కుట్టేయాలి. లేదంటే ఆ గాటు ద్వారా బ్యాక్టీరియా లోపలికి ప్రవేశించి ఇన్‌ఫెక్షన్‌ను కలిగిస్తుంది. ఇలా కార్నియాకు గాయాలైనప్పుడు కూడా ఎర్రబారి, నీరుకారడంలాంటి లక్షణాలే ఉంటాయి. అయితే గాయం మరీ చిన్నదైతే దానంతటదే మానిపోతుంది. మరీ పెద్దదైతే కుట్లు వేయక తప్పదు. కొన్నిసార్లు కార్నియాతోపాటు కంట్లోని తెల్లని భాగం స్క్లీరా కూడా చిరిగిపోవచ్చు. కంట్లో ఏ ప్రదేశంలో చిరుగు ఏర్పడింది? ఎంత పరిమాణంలో ఉంది? కుట్టు వేయాలా? అవసరం లేదా అనే విషయాలు కంటి వైద్యులు మాత్రమే కనిపెట్టగలుగుతారు. కొన్నిసార్లు కుట్టు వేసి కార్నియాను కాపాడగలిగినా కార్నియా మీద మచ్చ ఏర్పడిన ప్రదేశాన్నిబట్టి ‘విజువల్‌ యాక్సిస్‌’ మీద మచ్చ ఏర్పడితే చూపులో తేడా రావొచ్చు. అలాంటప్పుడు వైద్యులు కళ్లజోడు సూచిస్తారు. కాబట్టి కంటికి దెబ్బ తగిలి నీరు కారుతూ ఉంటే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి.

నిర్లక్ష్యం చేస్తే?: గాయం పరిమాణాన్ని తెలుసుకోలేక నిర్లక్ష్యం చేస్తే కన్ను ఇన్‌ఫెక్షన్‌కు గురవుతుంది. మరింత ఆలస్యం చేస్తే ఇన్‌ఫెక్షన్‌ మరింత ముదిరిపోయి కార్నియా పూర్తిగా దెబ్బతింటుంది. అలాంటప్పుడు కన్నును కాపాడటం కష్టం. దెబ్బ తీవ్రత ఎక్కువగా ఉంటే కార్నియా వెనుకభాగం కూడా దెబ్బతిని భవిష్యత్తులో శుక్లాలు కూడా రావొచ్చు.

Updated Date - 2022-12-05T23:30:26+05:30 IST