వ్రతం చెడినా... ఫలితం దక్కింది

ABN , First Publish Date - 2022-10-02T07:03:13+05:30 IST

సినిమాలూ, ఓటీటీలు... అంటూ రెండు చేతులా సంపాదిస్తున్నారు కథానాయికలు.

వ్రతం చెడినా... ఫలితం దక్కింది

సినిమాలూ, ఓటీటీలు... అంటూ రెండు చేతులా సంపాదిస్తున్నారు కథానాయికలు. టాప్‌ స్టార్ల కాలెండర్‌ ఇయర్‌ అయితే అస్సలు ఖాళీ లేకుండా నడుస్తోంది. తమన్నా విషయంలోనూ అదే జరుగుతోంది. తెలుగులో ఈమధ్య తమన్నా మెరిసింది లేదు. అయితే ఓటీటీ వేదికపై బిజీ. ఆమధ్య ‘9 హవర్స్‌’ అనే ఓ వెబ్‌ సిరీ్‌సలో నటించింది తమన్నా. ఇటీవలే హాట్‌స్టార్‌ కోసం చేసిన సినిమా ‘బబ్లీ బౌన్సర్‌’ విడుదలైంది. అయితే అటు ‘9 హవర్స్‌’ గానీ, ఇటు ‘బబ్లీ బౌన్సర్‌’ గానీ ఓటీటీ ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయాయి. సినిమా పరిభాషలో చెప్పాలంటే ఇవి ఫ్లాప్‌ షోస్‌. అయితే... తమన్నాకు మాత్రం ‘బబ్లీ బౌన్సర్‌’ బాగా కలిసొచ్చింది. ఈ వెబ్‌ మూవీ కోసం తమన్నా తన కెరీర్‌లోనే అత్యధిక పారితోషికం అందుకొందని టాక్‌. పైగా మధుర్‌ బండార్కర్‌ లాంటి దర్శకుడితో పనిచేసే అవకాశం దక్కింది. ఈ విషయంలోనే తమన్నా పొంగిపోతోంది. ‘‘మధుర్‌ గొప్ప దర్శకుడు. ఆయన ఆలోచనలు భిన్నంగా ఉంటాయి. సినిమాని చూపించే విధానంలోనూ చాలా వైవిధ్యం ఉంటుంది. ఆయన సినిమాలు చూసి ఎన్నోసార్లు షాక్‌ తిన్నా. అలాంటి దర్శకుడితో కలిసి పనిచేయడం నాకు దక్కిన అదృష్టం’’ అని చెప్పుకొచ్చింది తమన్నా. ‘బబ్లీ బౌన్సర్‌’కి సరైన ఫలితం రాకపోయినా హాట్‌స్టార్‌లో వ్యూవర్‌ షిప్‌ మాత్రం అదిరిపోయిందట. అందుకే హాట్‌స్టార్‌ ఇప్పుడు తమన్నాతో రెండు ప్రాజెక్టుల డీల్‌ కుదుర్చుకొందని సమాచారం అందుతోంది. వ్రతం చెడినా, ఫలితం దక్కడం అంటే ఇదే. చేసిన సినిమాలు ఆడకపోయినా, ఆ సినిమాల వల్ల మైలేజీ పెరిగితే, కొత్త అవకాశాలు వస్తే... అంతకంటే కావల్సిందేముంది..?

Read more