దసరా సరదాలు... వెండి తెర వెలుగులు

ABN , First Publish Date - 2022-09-25T07:02:25+05:30 IST

టాలీవుడ్‌కి అతి ముఖ్యమైన సీజన్లలో దసరా ఒకటి. సంక్రాంతి, వేసవి తరవాత దసరా సెలవుల్ని అతి కీలకంగా చిత్రసీమ భావిస్తుంది.

దసరా సరదాలు... వెండి తెర వెలుగులు

టాలీవుడ్‌కి అతి ముఖ్యమైన సీజన్లలో దసరా ఒకటి. సంక్రాంతి, వేసవి తరవాత దసరా సెలవుల్ని అతి కీలకంగా చిత్రసీమ భావిస్తుంది. అందుకే దసరా బరిలో వీలైనన్ని చిత్రాల్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తుంటారు. ఈసారి కూడా దసరా పండగకు వెండి తెర వెలుగులు తోడవుతున్నాయి. ఏకంగా నాలుగు చిత్రాలు విడుదలకు రెడీ అయ్యాయి. ‘గాడ్‌ ఫాదర్‌’, ‘ది ఘోస్ట్‌’, ‘జిన్నా’, ‘స్వాతిముత్యం’ అక్టోబరు 5న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఒకేరోజు నాలుగు సినిమాలు వస్తుండడం చిత్రసీమలో ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.


చిరంజీవి ‘గాడ్‌ ఫాదర్‌’ని అక్టోబరు 5న తీసుకురావాలని ఎప్పుడో డిసైడ్‌ చేసేశారు. ఆ లెక్కన దసరా బరిలో నిలిచిన మొదటి చిత్రం చిరుదే అనుకోవాలి. చిరంజీవి, నయనతార కలిసి నటించిన చిత్రమిది. సత్యదేవ్‌ కీలక పాత్రధారి. బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ ఓ ముఖ్యమైన పాత్ర పోషించారు. సల్మాన్‌ ఖాన్‌ తెలుగులో నటించిన తొలి చిత్రమిది. దాంతో.. ఆ పాత్రపై, సల్మాన్‌ ఎంట్రీపై అంచనాలు ఏర్పడ్డాయి. చిరు, సల్మాన్‌లు ‘తార్‌ మార్‌ తక్కెడమార్‌’ పాటకు స్టెప్పులు వేయడంతో ఈ సినిమాపై మరింత క్రేజ్‌ ఏర్పడింది. అక్టోబరు 5న ప్రేక్షకుల మొదటి ఛాయిస్‌... ‘గాడ్‌ ఫాదర్‌’దే అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లెద్దు. ఎందుకంటే చిరంజీవికున్న క్రేజ్‌, ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ అలాంటిది. అయితే.. ఈయేడాది విడుదలైన ‘ఆచార్య’ చిరుతో పాటు ఆయన అభిమానుల్ని దారుణంగా నిరాశ పరిచింది. ఆ చిత్రానికి కనీసం ఓపెనింగ్స్‌ కూడా రాలేదు. దాంతో ‘గాడ్‌ ఫాదర్‌’పై మరింత బాధ్యత ఏర్పడింది. ఈ సినిమా విషయంలో చిరు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొన్నట్టు సమాచారం. పబ్లిసిటీ విషయంలోనూ చిరు ఓ స్ర్టాటజీ ఫాలో అవుతున్నారు. ‘నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను. కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు’ అంటూ ఓ డైలాగ్‌ని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు చిరు. ఆ ఒక్క డైలాగ్‌... సినీ, రాజకీయ రంగాల్లో ప్రకంపనలు సృష్టించింది. అయితే ఇది ‘గాడ్‌ ఫాదర్‌’ ప్రచారంలో భాగమని, అందులోని సంభాషణనే చిరు లీక్‌ చేశారని తెలుస్తోంది. దాన్ని బట్టి చిరు ఈ సినిమా విషయంలో ఎంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవొచ్చు. ఈ సినిమా ప్రచారానికి సల్మాన్‌ ఖాన్‌ కూడా వస్తారని తెలుస్తోంది. సల్మాన్‌ కూడా బరిలో దిగిపోతే.. ‘గాడ్‌ ఫాదర్‌’ క్రేజ్‌ మరింత పెరిగిపోవడం ఖాయం.


‘గాడ్‌ ఫాదర్‌’తో పాటుగా విడుదలవుతున్న మరో చిత్రం ‘ది ఘోస్ట్‌’. నాగార్జున కథానాయకుడిగా నటించారు. ప్రవీణ్‌ సత్తారు దర్శకుడు. ఇదో యాక్షన్‌ డ్రామా. ప్రచార చిత్రాల్లో నాగార్జున ఫుల్‌ యాక్షన్‌ మోడ్‌లో ఉన్నారు. ప్రవీణ్‌ సత్తారుకు యాక్షన్‌ సినిమాలంటే చాలా ఇష్టం. ‘గరుడవేగ’ ఆయనకు మంచి పేరు తీసుకొచ్చింది. ‘ఘోస్ట్‌’ ఆయన్ని మరో మెట్టు ఎక్కిస్తుందని ఇండస్ర్టీ వర్గాలు నమ్ముతున్నాయి. చిరు - నాగ్‌ మధ్య మంచి స్నేహం ఉంది. ఇద్దరూ సోదరుల్లా మెలుగుతారు. ఒకరి సినిమాకి మరొకరు ప్రచారం చేసుకొంటారు. అలాంటిది ఇద్దరి సినిమాలూ ఒకే రోజు విడుదల కావడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. దసరా కాకుండా మరో సీజన్‌ అయితే నాగార్జున తన సినిమాని చిరుకి పోటీగా దింపే విషయంలో పునరాలోచించేవారేమో..?! కానీ ఇది దసరా కాబట్టి... ఆయన కూడా ధైర్యంగా తన సినిమాని సిద్ధం చేస్తున్నారు.


మంచు విష్ణు ‘జిన్నా’గా ముస్తాబవుతున్న సంగతి తెలిసిందే. సన్నీలియోన్‌, పాయల్‌ రాజ్‌పుత్‌ కథానాయికలుగా నటించారు. ఈ చిత్రాన్ని అక్టోబరు 5నే విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించకపోయినా.. మంచు  విష్ణు ట్విట్టర్‌లో పరోక్షంగా సంకేతాల్ని అందించారు. ‘అక్టోబరు 5’ అంటూ ఓ థమ్సప్‌ సింబల్‌ని తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. దాంతో.. విష్ణు సినిమా దసరాకి వస్తున్నట్టు ఊహాగానాలు మొదలైపోయాయి. విష్ణు కూడా దసరాకి తన సినిమాని తీసుకురావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. దాంతో పాటు ‘స్వాతిముత్యం’ని అక్టోబరు 5నే విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ సోదరుడు గణేశ్‌ కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రమిది. హర్ష బొల్లమ్మ కథానాయిక. ఇదో ఫ్యామిలీ డ్రామా. ఇటీవల విడుదలైన ప్రచార చిత్రాలు ఆకట్టుకొంటున్నాయి. పండగ సీజన్‌లో ఫ్యామిలీ డ్రామాలకు మంచి క్రేజ్‌ ఉంది. అందుకే ‘స్వాతిముత్యం’ కూడా బరిలో నిలిచింది. అయితే చిరు, నాగ్‌ల మధ్య విష్ణు, గణేశ్‌ల సినిమాలు నలిగిపోతాయేమో? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎంత పండగ సీజన్‌ అయినా పెద్ద సినిమాలతో పోటీ పడి విడుదల చేయడం రిస్కే. కాకపోతే నిర్మాతల ధైర్యం వేరు. పండగ సీజన్‌లో ఎన్ని సినిమాలొచ్చినా జనం చూస్తారని, ఆ ధైర్యంతోనే సినిమాల్ని విడుదల చేస్తున్నామని చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ దసరా పండక్కి.. నలువైపులా వినోదాలు పంచివ్వడానికి చిత్రాలు రెడీ అయ్యాయి. విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి. 

Read more