వారసత్వంపై నమ్మకం లేదు...

ABN , First Publish Date - 2022-09-26T08:31:29+05:30 IST

మీ నాన్నగారి హత్యకు సంబంధించి మీరు వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించినందుకు అభినందనలు.

వారసత్వంపై నమ్మకం లేదు...

డాక్టర్‌ నర్రెడ్డి సునీతా రెడ్డి... మాజీ మంత్రి వై.ఎస్‌. వివేకానందరెడ్డి ఏకైక కుమార్తె... వైద్య విద్య అభ్యసించారు. పదేళ్ళు అమెరికాలో ఉన్నాక... స్వదేశం వచ్చి... ప్రతిష్టాత్మకమైన అపోలో  ఆసుపత్రిలో పని చేస్తున్నారు. మూడేళ్ళ  క్రితం జరిగిన తన తండ్రి దారుణ హత్య వెనుక నిజాన్ని వెలికి తీయడానికి అలుపెరగకుండా పోరాడుతున్నారు. ఒకఅంతర్జాతీయ వైద్య సెమినార్‌ లో పాల్గొనడానికి, తన తండ్రి కేసు గురించి  న్యాయవాదులతో మాట్లాడడానికి ఢిల్లీ వచ్చిన ఆమె ‘నవ్య’తో ప్రత్యేకంగా మాట్లాడారు. 


మీ నాన్నగారి హత్యకు సంబంధించి మీరు వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించినందుకు అభినందనలు.

సునీతారెడ్డి: థాంక్స్‌ అండీ. అయితే నాన్నగారి హత్య కేసు న్యాయస్థానం విచారణలో ఉంది కనుక... దాని గురించి మాట్లాడను. న్యాయపరిధిలో ఉన్న అంశం గురించి మాట్లాడడం సరైనది కాదు. 


మీ బాల్యం, విద్యాభ్యాసం గురించి...

సునీతారెడ్డి: పులివెందులలో అమ్మానాన్నలు, తాతలు, పెదనాన్నలు, బాబాయిలు, మేనత్తలు... ఇలా పెద్ద కుటుంబానికి చెందినప్పటికీ నా చదువంతా చెన్నైలోని బెయిన్‌ స్కూలులో జరిగింది. వెల్లూరు మెడికల్‌ కాలేజీలో చదివిన తర్వాత అమెరికాలో ఉన్నత విద్యకు వెళ్లిపోయాను. సెలవుల్లో ఇంటికి వస్తే తప్ప... నా ప్రపంచమే వేరుగా ఉండేది. కులాలు, కుమ్ములాటలు, రాజకీయాలు పెద్దగా తెలియని లోకం నాది. నిన్నమొన్నటి వరకూ ఎవరు ఏ కులం వారో నాకు తెలీదు. ఒక ఆసక్తికరమైన విషయం చెప్పమంటారా? నేను, షర్మిల (వై.ఎ్‌స.రాజశేఖర్‌ రెడ్డి కూతురు), భారతి (వై.ఎస్‌. జగన్మోహన్‌ రెడ్డి సతీమణి) ఒకే నెలలో అంటే.. డిసెంబర్‌లో... కొద్ది రోజుల తేడాలో పుట్టాం. కలిసే పెరిగాం. భారతి... మా అబ్బ (తాత) రాజారెడ్డి సోదరుడు చిన్న కొండారెడ్డి మనుమరాలు. ఇక నేను, షర్మిల ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు చెన్నైలో ఒకే స్కూలు, ఒకే తరగతి. భారతి ఆరు, ఏడు తరగతులు మాతో కలిసి చదివారు. నేను ఎనిమిదో తరగతి హైదరాబాద్‌లో చదివాక... మళ్లీ తొమ్మిదో తరగతికి చెన్నైకి వచ్చాను. అక్కడ ఏడాది పాటు హాస్టల్‌లో ఉన్నా ఎక్కువ కాలం ఇంటి నుంచే కాలేజీకి వెళ్లేదాన్ని. మా అబ్బ రాజా రెడ్డి, జేజి (నానమ్మ), అమ్మా నాన్నలు, పెదనాన్న వై.ఎ్‌స.జార్జిరెడ్డి తదితరులు మమ్మల్ని చదివించే వారు. జార్జిరెడ్డి గారి పిల్లలు సునీల్‌ , అనిల్‌ కూడా చెన్నైలో చదువుకునేవారు. నేను మా నాన్నకు ఒకే కూతుర్ని అయినప్పటికీ ఎప్పుడూ ఒంటరిగా ఉండలేదు. 


మీరు మెడిసిన్‌ చేయాలని ఎందుకనుకున్నారు?

సునీతారెడ్డి: మా అమ్మా నాన్నలకు నేను బాగా చదువుకొని పైకి రావాలని ఉండేది. ముఖ్యంగా మా నాన్న. నేను బాగా చదివి, మార్కులు తెచ్చుకోవాలనీ. మెడిసిన్‌ చేసి, ఆ తర్వాత సివిల్‌ సర్వీసు చేయాలనీ, దేశానికి సేవ చేయాలనీ ఆయన చెప్పేవారు. అమ్మాయిలు స్వేచ్ఛగా ఉండాలనీ, అంత కష్టపడి ఎందుకు చదవాలనీ మా పెదనాన్న రాజశేఖర్‌ రెడ్డి అనేవారు. కానీ మా నాన్న మాత్రం నేను కష్టపడి చదువుకోవాల్సిందేనని చెప్పేవారు. నిజానికి ఆయన స్వయంగా డాక్టర్‌ కావాలనుకొని, చేయలేక అగ్రికల్చర్‌ బిఎస్సీ చేశారు. నన్ను డాక్టర్‌ గా చూసుకోవాలనుకున్నారు. చిన్నప్పుడు నేను, షర్మిల మా అమ్మ ప్రోత్సాహంతో  భరత నాట్యం నేర్చుకున్నాం. చదువు మీద ధ్యాస తగ్గిపోతుందని ఆయన నాతో నాట్యం మాన్పించారు. ‘చదువంటే క్లాసు పుస్తకాలే కాదు, సమాజం గురించి తెలుసుకొనే ఇతర పుస్తకాలూ చదవాల’నే వారు. నేను తొమ్మిదో తరగతి చదువుతుండగా ఆయన... ‘కారల్‌ మార్క్స్‌’ రాసిన రెండు పుస్తకాలు బహూకరించారు. మా కుటుంబానికి కమ్యూనిస్టు నేపథ్యం కూడా ఉన్నది. కమ్యూనిస్టు రాజకీయాల్లోంచే వారు కాంగ్రెస్‌ రాజకీయాల్లోకి  మారారు. మా తాత ప్రోత్సాహంతోనే మా పెదనాన్న, నాన్న రాజకీయాల్లోకి వచ్చారు. మా నాన్న రష్యా కూడా వెళ్లి వచ్చారు. ఫిలిప్పీన్స్‌ వెళ్లి వ్యవసాయం గురించి అధ్యయనం చేశారు.


మీ నాన్నకు మీకూ ఉన్న అనుబంధం గురించి... 

సునీతారెడ్డి: అది మాటల్లో చెప్పలేనిది. చదువు విషయంలోనే కాదు, భోజనం విషయంలో కూడా ఆయన చాలా స్ట్రిక్టుగా ఉండేవారు. చిన్నప్పుడు నేను సరిగా భోజనం చేయకపోతే కొట్టేవారు. ఆరో తరగతి తర్వాత మాత్రం కొట్టడం మానేశారు. ఒకసారి నేను ఏడుస్తుంటే ‘‘సారీ తల్లీ, ఇంకెప్పుడూ నేను నిన్ను కొట్టను’’ అని క్షమాపణ వేడుకున్నారు. జీవితంలో ఎవరైనా పొగిడితే పొంగిపోవద్దని, ఎవరైనా విమర్శిస్తే మాత్రం సీరియ్‌సగా తీసుకొని ఆత్మ విమర్శ చేసుకోవాలని ఆయన చెప్పేవారు. నాన్నగారికి పర్యటనలంటే ఎంతో ఇష్టం. దేశ, విదేశాలు తిరిగేవారు. నన్ను, మా అమ్మను కూడా ఎన్నో ప్రాంతాలు తిప్పారు. యూర్‌పలో అంతా... ఆమ్‌స్టర్‌ డామ్‌, స్వీడెన్‌, జర్మనీ, స్విట్జర్లాండ్‌ , ఫ్రాన్స్‌, రోమ్‌, బ్రిటన్‌ తానే స్వయంగా కారు నడుపుతూ చూపించారు. అమెరికాలో నా పెద్ద కుమారుడు అనారోగ్యానికి గురై మరణించినప్పుడు నాన్న, అమ్మ నాతోనే ఉన్నారు. నాన్న నాకు ఎంతో మనోబలాన్ని ఇచ్చారు. మా అమ్మ ఎంతో చురుకైన మనిషి. పిల్లలతో ఆటలాడేవారు. ఉన్నట్లుండి ఆమె ఆరోగ్యం దెబ్బతింది. ఇప్పుడు నాతోనే ఉన్నారు. 


రాజకీయాలంటే మీకు ఆసక్తి ఉండేదా?

సునీతారెడ్డి: రాజకీయాలతో నేరుగా ప్రమేయం లేదు. కానీ తెలుసుకుంటూ ఉండేదాన్ని. ఇంట్లో రాజకీయాలు చర్చించేవారు కదా. చెన్నైలో ఉన్నపుఁడు తమిళనాడు రాజకీయాలు, జాతీయ రాజకీయాలు తెలిసేవి. ‘హిందూ’, ‘ఇండియా టుడే’ రెగ్యులర్‌గా చదివే దాన్ని. తొలిసారి మానాన్న సమితి అధ్యక్ష పదవికి పోటీ చేసినప్పుడు... చాలా చిన్న వయస్సులో నేను ప్రచారం చేశాను. మా అమ్మ కూడా వేంపల్లిలో మండల పరిషత్‌ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత మళ్లీ మా నాన్న... మా పెద్దమ్మతో పోటీ పడినప్పుడు ప్రచారంలో పాల్గొన్నాను. ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా శేషన్‌ గారు ఉన్నప్పుడు... అప్పటి అదనపు పోలీస్‌ సూపరింటెండెంట్‌గా ఉన్న ఉమేశ్‌ చంద్ర పులివెందుల ఎన్నికల్లో పోస్టర్లు లేకుండా చేయడం నాకు బాగా గుర్తుంది. ఇంట్లో పనిచేసేవారు కొందరు గద్దర్‌ పాటలు పాడుతుంటే విని, వాటి గురించి ఆసక్తిగా తెలుసుకొనే దాన్ని. ఒక రకంగా సామాజిక చైతన్యం నాకు ముందు నుంచే ఉండేది. 


కడప జిల్లాలో, ముఖ్యంగా పులివెందులలో  హత్యా రాజకీయాల్ని మీరు గమనించేవారా?

సునీతారెడ్డి: పులివెందులకు వచ్చినప్పుడల్లా అక్కడో హత్య జరిగిందని, ఇక్కడో హత్య జరిగిందని... ఇంట్లో వాళ్లు, బంధువులూ మాట్లాడుకుంటూ ఉంటే వినేదాన్ని. వాటి గురించి ప్రశ్నించే వయసు వచ్చే నాటికి చెన్నైలో చదువుకోవడం ప్రారంభించాను. ఆ రోజుల్లో కడప... రెండు విషయాల్లో ప్రచారంలో ఉండేది. బొంబాయి మెయిల్‌ చెన్నైకి వెళ్లే దారిలో... కడప రైల్వే స్టేషన్‌లో డిన్నర్‌ కోసం ఆపేవారు. రెండోది కడప అంటేనే ఫ్యాక్షన్‌ తగాదాలు, హత్యా రాజకీయాలు అని. ఈ రెండింటి వల్ల చాలా మందికి కడప గురించి తెలిసేది. రాను రాను ఈ హత్యలు తగ్గిపోయాయి. కాలేజీలు పెరగడం, అభివృద్ధి జరగడంతో పరిస్థితిలో మార్పు వచ్చిందనిపించింది. మా నాన్న ఎప్పుడూ చిత్రావతి, గండికోట, గాలేరు నగరి లాంటి నీటిపారుదల ప్రాజెక్టుల గురించి మాట్లాడేవారు. నీటిపారుదల ప్రాజెక్టులు వస్తే కడప రూపురేఖలు మారుతాయనేవారు. సాలిడ్‌ వేస్ట్‌ మేనేజిమెంట్‌, సేంద్రియ వ్యవసాయం గురించి 1989లోనే నాకు చెప్పారు.. కడప జిల్లా అభివృద్ధి ఆగిపోకూడదనే ఉద్దేశంతోనే ఆయన రాష్ట్ర మంత్రివర్గంలో చేరారు. తన జీవితమంతా కడపలో, పులివెందులలో ప్రజాసేవ చేస్తూ గడిపారు. ఆయన బతికి ఉంటే ఇప్పటికీ ఏ పదవి లేకపోయినా... ప్రజలకు సేవ చేస్తూ ఉండేవారు. మా నాన్న హత్య జరగడంతో... ‘అక్కడ పరిస్థితి ఏమీ మారలేదా?’ అనిపించింది. ఆ పరిస్థితిలో మార్పు కోసమే నేను పోరాడాలనుకున్నాను.


నాన్నకూ, రాజశేఖర్‌ రెడ్డికి సంబంధాలు ఎలా ఉండేవి?

సునీతారెడ్డి: నాన్న, పెదనాన్న ఎంతో సన్నిహితంగా ఉండేవారు. ఒకరంటే మరొకరికి ప్రాణం. పెదనాన్నంటే ఆయనకెంతో గౌరవం. ఒక రోజు నేను హైదరాబాద్‌లో ఎవరింట్లోనో ఉన్న పెదనాన్నతో మాట్లాడాలనుకున్నప్పుడు... ఫోన్‌ చేసి ‘‘వై.ఎ్‌స.రాజశేఖర్‌ రెడ్డి గారు ఉన్నారా?’’ అని అడిగాను. ఆ మాట విని నాన్న నన్ను మందలించారు. ‘‘నిన్ను నువ్వు పరిచయం చేసుకొని, పెదనాన్న గారితో  మాట్లాడాలని అనలేకపోయావా?’’ అని అడిగారు. ‘‘జీవితాన్ని అనుభవించడం నేర్చుకోవాలిరా! ఎందుకంత కష్టపడతావు?’’ అని నాన్నతో పెదనాన్న అనేవారు. పెదనాన్న మధ్యాహ్నం తప్పకుండా కునుకు తీసేవారు. రాత్రి ఎప్పుడు లేపినా నిద్ర లేచి ఫ్రెష్‌ గా కనపడేవారు. 


మీరు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారా

సునీతారెడ్డి: నేను డాక్టర్‌గా ఉండడం మీకిష్టం లేదా? జీవితంలో ఏవీ అనుకున్న విధంగా జరగవు. చెన్నై వెళ్లడం, మెడిసిన్‌ చేయడం, అమెరికా వెళ్లడం, పెద్ద కుమారుడి మరణం, ఇండియా తిరిగి రావడం, నాన్న హత్యకు గురి కావడం, కోర్టుల్లో పోరాడాల్సి రావడం... ఇవన్నీ అనుకొని జరగలేదు. ఏది ఎప్పుడు ఎలా ఎదురవుతుందో, దాన్ని స్వీకరించడం అలవాటైపోయింది. ప్రజాస్వామ్యంలో వారసత్వం అంటే నమ్మకం లేదు. పెదనాన్న చనిపోయాక సహజంగానే మొదట నాన్నకు, తర్వాత జగన్‌కు ప్రాధాన్యత ఉంటుందనుకున్నా.


కుటుంబంలో విభేదాలు, విజయమ్మగారికి వ్యతిరేకంగా నాన్న పోటీ చేయడం గురించి..

సునీతారెడ్డి: కుటుంబమన్నాక విభేదాలు, సర్దుబాట్లు తప్పవు. జగన్‌ కాంగ్రెస్‌ పార్టీలోనే ఉండాలని మా నాన్న అభిప్రాయపడ్డారు. కాని ఆయన వేరే దారి ఎంచుకున్నారు. అప్పటి పరిస్థితుల్లో కాంగ్రెస్‌ పార్టీ ఆదేశానుసారం ఆయన పెద్దమ్మ గారితో పోటీపడాల్సి వచ్చింది.


వైద్యురాలుగా మీ అనుభవాలు...

సునీతారెడ్డి: అమెరికాలో అంటువ్యాధులపై ఉన్నత విద్య అయిపోయాక... ఇండియాకు తిరిగి రావాలనిపించి వచ్చాను. గాంధీ ఆసుపత్రిలో 18 వేల జీతానికి చేరాను. ఉదయం ఆసుపత్రికి వస్తే... పదిన్నర వరకు గది తాళాలు కూడా తీసేవారు కాదు. మధ్యాహ్నం ఒంటిగంటకు ఉద్యోగం అయిపోయేది. ఆ తర్వాత అపోలోలో చేరాను. అక్కడ ఎన్నో అనుభవాలు. గుండె మార్పిడితో వచ్చిన ఒక వ్యక్తి అంటువ్యాధికి గురయ్యారని  తెలుసుకొని ట్రీట్‌మెంట్‌ ఇచ్చాను. తర్వాత ఆమె ఐదుసంవత్సరాలు బతికారు. జ్వరంతో వచ్చిన ఒక మహిళకు కాన్సర్‌ ఉన్నదని తెలిసింది. అంతిమ ఘడియల్లో కుటుంబమంతా ఆమెతో గడిపేందుకు అవకాశం కల్పించాను. ఇప్పటికీ ఎన్నో కుటుంబాలు నన్ను గుర్తు పెట్టుకుంటాయి. ఎందుకోగాని భావోద్వేగాలు లేకుండా గడపడం, మరణాల గురించి నిర్వికారంగా మాట్లాడుతూ ఉండడం అలవాటైపోయింది. ఎందరో మరణాలను చూశాను. కొవిడ్‌ సమయంలోనూ ఎన్నో అనుభవాలున్నాయి.


మీ అభిరుచులేమిటి...

సునీతారెడ్డి: నాన్నకు క్రీడలంటే ఇష్టం. ఆయన ప్రోద్బలంతో తొమ్మిదో తరగతిలో స్కూల్‌ బాస్కెట్‌ బాల్‌ టీమ్‌లో ఆడేదాన్ని. పుస్తకాలు ఎక్కువగా చదవడం నాకిష్టం, ఇయాన్‌ రాండ్‌, జాన్‌ గ్రిషమ్‌ నవలలు, మెడికల్‌ డిటెక్టివ్‌ నవలలు ఎక్కువగా చదివే దాన్ని. చదువంతా ఇంగ్లీషు మీడియంలోనే సాగినా... మా అమ్మ పట్టుబట్టి తెలుగు నేర్పించారు. కాబట్టి ‘చందమామ’ తో పాటు యండమూరి వీరేంద్రనాథ్‌, యద్దనపూడి సులోచనారాణి నవలలు చదివే దాన్ని. 

ఎ.కృష్ణారావు, న్యూఢిల్లీ


నేను, షర్మిల (వై.ఎ్‌స.రాజశేఖర్‌ రెడ్డి కూతురు), భారతి (వై.ఎస్‌. జగన్మోహన్‌ రెడ్డి సతీమణి) ఒకే నెలలో అంటే.. డిసెంబర్‌లో... కొద్ది రోజుల తేడాలో పుట్టాం. కలిసే పెరిగాం. భారతి... మా అబ్బ (తాత) రాజారెడ్డి సోదరుడు చిన్న కొండారెడ్డి మనుమరాలు. నేను, షర్మిల ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు చెన్నైలో ఒకే స్కూలు, ఒకే తరగతి. భారతి ఆరు, ఏడు తరగతులు మాతో కలిసి చదివారు.


జగన్‌ పెళ్ళీ, నా పెళ్ళీ ఒకే రోజు...

నాకు మా మేనత్త కుమారుడు రాజశేఖర్‌ రెడ్డితో జరిగింది. ఆయనే నన్ను ఇష్టపడి ఒక రోజు ‘‘నన్ను వివాహం చేసుకుంటావా?’’ అని అడిగారు. మా అబ్బ (తాత రాజారెడ్డి) వివాహం జరిపించారు. ముహూర్తాలు ఆయనే నిర్ణయించారు. నేను, జగన్మోహన్‌ రెడ్డి ఒకే మండపంలో ఒకే రోజు వివాహం చేసుకున్నాం తెలుసా? రాజశేఖర్‌ గారు పర్యావరణ ఇంజనీర్‌. ఇద్దరం అమెరికాలో చదువుకున్న తర్వాత ఉద్యోగాలు చేశాం. ఆ తర్వాత ఇండియాకు వచ్చి స్థిరపడ్డాం.

Read more